పుల్వామా
ఉగ్రవాదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ నివాళులర్పించారు. దేశం కోసం
జవాన్లు చేసిన త్యాగం ఎప్పటికీ గుర్తుండిపోతుందన్నారు. పుల్వామాలో అమరులైన వీరులకు
నివాళులర్పిస్తున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
సరిగ్గా
ఐదేళ్ళ కిందట ఈ రోజున(ఫిబ్రవరి14) పుల్వామాదాడి జరిగింది. 2019, ఫిబ్రవరి 14న
సీఆర్ఫీఎఫ్ కాన్వాయ్ లక్ష్యంగా దాడి జరగడంతో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు.
మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉగ్రవాదులు 200 కిలోల పేలుడు పదార్థాలను
ఉపయోగించి విధ్వంసం సృష్టించారు.
పుల్వామా వద్దకు చేరుకోగానే ఓ కారు, సీఆర్ఫీఎఫ్
కాన్వాయ్ లోని వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో పేలుడు సంభవించి అక్కడికక్కడే 40 మంది
సైనికులు అమరులయ్యారు. ప్రమాద సమయంలో కాన్వాయ్ లో 78 వాహనాలు ఉండగా, వాటిలో 2,500
మంది సైనికులు ప్రయాణిస్తున్నారు.
పాకిస్తాన్
ప్రేరేపిత ఉగ్రవాదులు జరిపిన ఈ విధ్యంసానికి భారత్ కూడా బదులు తీర్చుకుంది.
సర్జికల్ స్ట్రైక్ రూపంలో పాక్ భూభాగంలోని ఉగ్రవాదుల స్థావరాలను నేలమట్టం చేసింది.
2019
ఫిబ్రవరి 26న భారత వైమానికదళం, పాకిస్తాన్ లోని బాలాకోట్ లోకి ప్రవేశించి
ఉగ్రవాదుల శిబిరాలను ధ్వంసం చేసింది. దీంతో పాకిస్తాన్ వైమానిక దళం కూడా
జమ్ము-కశ్మీర్ లోకి చొరబడి దాడులకు తెగబడింది.
భారత వైమానికదళం పాకిస్తాన్ దాడులను
తిప్పికొడుతుండగా, మిగ్-21 యుద్ధ విమానం కూలింది. దాని ఫైలట్ అభినందన్ వర్ధమాన్ ను
పట్టుకున్న పాకిస్తానీయులు, ఆ దేశ సైన్యానికి అప్పగించారు. భారత్ ఒత్తడితో అతడిని
పాకిస్తాన్ సైన్యం విడుదల చేసింది.
పుల్వామా
దాడి తర్వాత పాకిస్తాన్ తో అన్ని వాణిజ్య సంబంధాలను భారత్ రద్దు చేసుకుంది. దీంతో
ఆ దేశం తీవ్ర ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయింది.