Vasant Panchami : The festival of Goddess Saraswati
వసంత పంచమినే శ్రీపంచమి లేక సరస్వతీ పంచమి అని
కూడా అంటారు. మాఘమాసం శుక్లపక్షం పంచమీ తిథి నాడు ఈ పర్వదినాన్ని జరుపుకోవడం హిందువుల
ఆనవాయితీ. వసంత ఋతువు ఆగమనం ప్రారంభంలో వచ్చే పండుగ కాబట్టి వసంత పంచమి అని
వ్యవహరిస్తారు.
విద్య, సంగీతం, కళల అధిదేవత అయిన సరస్వతీదేవి ఈ దినాన
జన్మించిందని హిందువులు విశ్వసిస్తారు. ఆమె గౌరవార్ధం ఈ పంచమి రోజున పూజలు
చేస్తారు. ఉత్తరభారతదేశంలో ఇవాళ్టి నుంచీ హోలీ పూర్ణిమకు సన్నాహాలు మొదలవుతాయి. ఆ
వేడుకలు నలభై రోజుల పాటు సాగుతాయి.
ప్రపంచ ప్రఖ్యాత నాటకకర్త కాళిదాసుకు వసంతపంచమికీ
సంబంధించి ఒక కథ బహుళ ప్రచారంలో ఉంది. కాళిదాసు మొదట్లో చదువు రానివాడు. దాంతో అతని
భార్య అతన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. ఆ ఆవేదనలో కాళిదాసు నదిలో దూకి ఆత్మహత్య
చేసుకుందామనుకుంటాడు.అంతలో
నదిలోనుంచి సరస్వతీదేవి ప్రత్యక్షమై కాళిదాసును స్నానం చేసి రమ్మని ఆదేశిస్తుంది.
ఆ తర్వాత ఆయన జీవితమే మారిపోయింది. ఆయనకు అమ్మవారు జ్ఞానాన్ని ప్రసాదించడంతో ఆయన
గొప్ప కవి అవుతాడు.
మరో కథ ప్రకారం మన్మథుడు ఒకసారి శివుడి తపస్సును
భగ్నం చేయడానికి ప్రయత్నిస్తాడు. భార్య సతీదేవి మరణంతో దుఃఖంలో ఉన్న శివుడు తపస్సులో
మునిగిపోయి బాహ్యప్రపంచాన్ని పూర్తిగా వదిలిపెట్టేసాడు. అలాంటి స్థితి నుంచి
శివుణ్ణి బైటకు తీసుకురావడం కోసం దేవతలు మన్మథుణ్ణి ఆయన దగ్గరకు పంపిస్తారు. కామదేవుడు
పరమశివుడి మీదకు పుష్పబాణాలు సంధిస్తాడు. ఆగ్రహోదగ్రుడైన శివుడు తన మూడోకన్ను
తెరిచేసరికి ఆ జ్వాలల్లో మన్మథుడు ప్రాణాలు కోల్పోతాడు. అప్పుడు అతని భార్య
రతీదేవి 40 రోజులు పూర్తి ఉపవాసముండి శివుణ్ణి అర్చిస్తుంది. దానికి ప్రసన్నుడై
శివుడు మన్మథుణ్ణి పునరుజ్జీవింపజేస్తాడు. అదే వసంత పంచమి పర్వదినం.
ఇవాళ పసుపుపచ్చరంగుకు ప్రాధాన్యం ఎక్కువ. ప్రజలు
పసుపురంగు దుస్తులు ధరించి సరస్వతీ మాతను పూజిస్తారు. ఆమెకు పాయసం నివేదించి
ప్రసాదంగా తీసుకుంటారు.
వసంత పంచమి దేశవ్యాప్తంగా
అన్నిప్రాంతాలవారూ జరుపుకుంటారు. స్థానిక ఆచార వ్యవహారాలను బట్టి చిన్నచిన్న
తేడాలున్నా మౌలికంగా సరస్వతీదేవి పూజ చేయడం ఈ పండుగ విధి. ఉత్తర భారతదేశంలో
ప్రత్యేకించి పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో ఈ పండుగ రోజు గాలిపటాలు ఎగురవేస్తారు.
పశ్చిమబెంగాల్, దాని సమీపంలోని రాష్ట్రాల్లో ఈ రోజును సరస్వతీ పూజ అని
వ్యవహరిస్తారు. దక్షిణాదిన శ్రీపంచమి అంటారు. గుజరాత్లో పూలు, మధుర పదార్ధాలు పంచుకుంటారు.
మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో శివపార్వతులను
అర్చిస్తారు.