తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ చలో ఢిల్లీకి పిలుపునిచ్చిన రైతులు రాజధాని సమీపానికి చేరుకున్నారు. మంగళవారంనాడు ఢిల్లీకి సమీపంలోకి వచ్చిన పంజాబ్ రైతులపై భద్రతాదళాలు డ్రోన్ల ద్వారా భాష్ఫవాయుగోళాలు ప్రయోగించాయి. రైతులు నగరంలోకి ప్రవేశించకుండా వేసిన బారికేడ్లను కొన్ని ప్రాంతాల్లో రైతులు బద్ధలు కొట్టే ప్రయత్నం చేస్తున్నారు. పంజాబ్ నుంచి శంభు చేరుకున్న రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగించడంతో రైతులు సమీపంలోని పొలాల్లోకి పరుగులు తీశారు.
రైతుల ఆందోళనను మేం అర్థం చేసుకోగలం. వారిని మేం అడ్డుకోవడం లేదు. కానీ ట్రాక్టర్లతో ఢిల్లీలోకి ప్రవేశిస్తే తీవ్రమైన ట్రాఫిక్ సమస్య తలెత్తుతుందని అంబాలా రేంజ్ ఐజీ సిబాష్ కబిరాజ్ చెప్పారు. బస్సులు, రైళ్ల ద్వారా నగరానికి చేరుకోవాలని, ట్రాక్టర్లను అనుమతించమని చెప్పారు. నగరంలో 144 సెక్షన్ విధించినట్లు గుర్తుచేశారు.
రైతుల ప్రయోజనాలకు కట్టుబడి ఉన్నట్లు కేంద్ర వ్యవసాయ మంత్రి అర్జున్ ముండా తెలిపారు. అయితే రైతు సంఘాల ఆందోళనకు రాజకీయరంగు పులుముతున్నారని ఆయన విమర్శించారు. రైతు సంఘాల నాయకులతో చర్చలు జరపడానికి మేం సిద్దంగా ఉన్నామని మంత్రి తెలిపారు. ప్రతి డిమాండును పరిష్కరించేందుకు అవకాశాలుంటాయన్నారు.
రైతులు 12 డిమాండ్లను కేంద్ర మంత్రుల వద్ద ఉంచారు. సంయుక్త్ కిసాన్ మోర్చా, పంజాబ్ కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ నాయకులతో కేంద్ర మంత్రులు చర్చలు జరిపినా ఫలితం దక్కలేదు. 2021లో రైతులు నిరసన చేసిన సమయంలో వారికి మంచి మద్దతు ధర కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని రైతు సంఘాల నేతలు గుర్తుచేశారు.
మద్దతు ధరకు గ్యారంటీ ఇచ్చేందుకు చట్టం చేయాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.స్వామినాథన్ కమిటీ సిఫార్సుల అమలుకు పట్టుబడుతున్నారు. విద్యుత్ సవరణ బిల్లు 2020ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. భూ సేకరణ చట్టం 2013ను మరలా ప్రవేశపెట్టాలని కోరుతున్నారు. భూమి మార్కెట్ ధర కంటే 4 రెట్లు అధికంగా ఇచ్చి సేకరించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
లఖింపూర్ ఖేరీలో రైతులను తొక్కించి చంపిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతు సంఘాల నేతలు డిమాండ్ చేశారు. రోజుకు రూ.700 వేతనంతో సంవత్సరానికి కనీసం 200 రోజులు పనికల్పించాలని రైతు కూలీల యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. వ్యవసాయరంగాన్ని మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి పథకంతో లింకు చేయాలని కోరుతున్నారు. 2021లో ఢిల్లీ నిరసనల్లో పాల్గొని ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.