సరోజినీనాయుడు. ఆ పేరు తెలియని భారతీయులుండరు. స్వాతంత్ర్య సమరయోధురాలుగా, కవయిత్రిగా, జాతీయ కాంగ్రెస్కు మొదటి మహిళా అధ్యక్షురాలిగా, తొలి మహిళా గవర్నరుగా ఆమె దేశానికి అందించిన సేవలు నిరుపమానం. సరోజినీనాయుడు 135వ జయంతోత్సవాల సందర్భంగా ఆమె దేశానికి చేసిన సేవలు మరోసారి స్మరించుకుందాం.
పువ్వుపుట్టగానే పరమళించడం అంటే ఇదేకదా
సరోజినీనాయుడు 1879వ సంవత్సరం, ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్లో జన్మించారు. తండ్రి డాక్టర్ అఘోరనాథ్ చటోపాధ్యాయ, తల్లి వదర సుందరి దంపతుల గారాలపట్టి సరోజినీనాయుడు. అఘోరనాథ్ చటోపాధ్యాయ హైదరాబాద్ నిజాం కాలేజీకి మొదటి ప్రధానోపాధ్యాయుడిగా పనిచేశారు. తల్లి వరదాదేవి రచయిత్రి. బెంగాలీలో అనేక కావ్యాలు, కథలు రచించారు. తండ్రి అఘోరనాథ్ 8 భాషల్లో పండితుడు. విద్యాధికుల కుటుంబంలో జన్మించడంతో సరోజినీనాయుడు కూడా చదువులో ప్రతిభ చూపారు. బాల్యం నుంచి ప్రతి విషయం నేర్చు కోవాలనే కుతాహలం కనబరిచేవారు. పట్టుబట్టిన విషయం తెలుసుకునే వరకు వదిలేవారు కాదు.
చిన్నతనం నుంచి ఆమెకు ఇంగ్లీషుపై మమకారం ఉండేది. ఇంగ్లీషులో మాట్లాడాలనే పట్టుదలతో భాషపై పట్టుసాధించింది. సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్లో ప్రాథమిక విద్యను పూర్తి చేసింది. పదకొండో తరగతి నాటికే ఇంగ్లీషులో అనర్గళంగా మాట్లాడటం నేర్చుకుంది.అప్పటికే ఇంగ్లీషులో రచనలు కూడా ప్రారంభించింది. 12 సంవత్సరాలకే మద్రాసు విశ్వవిద్యాలయంలో మెట్రిక్కులేషన్ పూర్తి చేయగలిగిందంటే అంటే ఆమె ప్రతిభ అర్థం చేసుకోవచ్చు.
గోల్డెన్ త్రెషోల్డ్ విద్యా దేవాలయం
సరోజినీనాయుడు తండ్రి నాంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ బంగ్లాలో నివశించేవారు.ఆ బంగ్లాను సరోజినీనాయుడు కుమార్తె పద్మజా నాయుడు 1974లో హైదరాబాద్ యూనివర్సిటీకి ఉచితంగా ఇచ్చారు. 1975లో ప్రధాని ఇందిరాగాంధీ ఆ భవనాన్ని హైదరాబాద్ యూనివర్సిటీకి అంకితం చేశారు.
విదేశాల్లో ఉన్నత చదువులు
సరోజినీనాయుడు 13వ ఏటనే సరోవరరాణి పేరుతో పెద్ద రచనే చేశారు. పదమూడు వందల పంక్తులతో, చెప్పదలచుకున్న విషయాన్ని సూటిగా అందరి హృదయాలను తాకేలా ఆమె రచన సాగించారు. ఆమె ప్రతిభను గుర్తించిన నిజాం నవాబు ఉన్నత చదువులకు విదేశాలకు పంపాలని నిర్ణయించుకున్నారు. ఆమెకు ఆ రోజుల్లోనే రూ.4200 వేతనంగా ఇచ్చి విదేశాల్లో విద్యనభ్యసించేందుకు పంపించారు. నిజాం నవాబు ప్రోత్సాహంతో సరోజినీనాయుడు లండన్లోని కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేశారు. చదువుకుంటూనే రచనలు కొనసాగించారు.ఆమె రచనల్లో భారతీయుల జీవితాలు ప్రతిబింబించేవి.సరోజినీనాయుడు రచనల్లో బర్డ్ ఆఫ్ టైమ్, ది గోల్డెన్ త్రెషోల్డ్, ది బ్రోకెన్ వింగ్స్ ప్రసిద్దమైనవి.
వివాహం..కుటుంబ బాధ్యతలు
1898లో విదేశాల్లో విద్యను పూర్తి చేసుకుని సరోజినీనాయుడు, స్వదేశానికి తిరిగి వచ్చారు. ముత్యాల గోవిందరాజులునాయుడును ఆమె వివాహం చేసుకున్నారు. అప్పటికే ఆయన హైదరాబాద్ ప్రధాన ఆరోగ్య అధికారిగా పనిచేస్తున్నారు. కులం, మతం, మూఢ విశ్వాసాలకు సరోజినీనాయుడు దూరంగా ఉండేవారు. కులమతాలకు అతీతంగా సమసమాజ స్థాపన చేయాలని ఆమె జీవితాంతం పరితపించారు. సరోజినీనాయుడు దంపతులకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు కలిగారు. కుమారుడు ముత్యాల జయసూర్యనాయుడు.హోమియో డాక్టర్. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు కూడా. వీరి కుమార్తె పద్మజానాయుడు బెంగాల్ గవర్నర్గా సేవలందించారు.
ముగ్గురు సంతానం కలిగినా సరోజినీనాయుడు, వారి గురించే కాకుండా దేశం గురించి ఆలోచన చేశారు. స్వాతంత్ర్య ఉద్యమంలోకి దూకారు. ఆంగ్లేయుల పాలనకు వ్యతిరేకంగా దేశమంతా పర్యటించారు. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి, గోపాల కృష్ణగోఖలే మార్గంలో నడిచారు. అనేక ఉద్యమాల్లో పాల్గొని జాతీయ నాయకురాలిగా ఎదిగారు.
మహిళా విద్యా అవసరాన్ని గుర్తించిన సరోజినీనాయుడు
1906లో మహిళా విద్య అవసరాన్ని గుర్తించిన సరోజినీనాయుడు, వారిలో చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం చేశారు. జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరి 1915లో ముంబైలో జరిగిన మహాసభలు, 1916లో లక్నోలో జరిగిన సభల్లో పాల్గొన్నారు. జాతి వేరనీ, నువ్వు వేరనీ విడిగా ఉండకు, నీకు అన్యాయం జరిగితే దేశానికి జరిగినట్లే, దేశం అనుభవించే బానిసత్వం, నీవు కూడా అనుభవిస్తున్నట్లే అంటూ దేశమంతా తిరుగుతూ దేశభక్తిని నింపారు.
దేశమంతా విస్తృతంగా తిరగడంతో సరోజినీనాయుడు 1919లో తీవ్ర అనారోగ్యం పాలైంది. జలియన్ వాలా బాగ్ ఉదంతం సమయంలో ఆమె లండన్లో చికిత్స పొందుతోంది. అప్పటికే ఆమెకు గుండెజబ్బు బాగా ముదిరిపోయిందని డాక్టర్లు హెచ్చరించారు. అయినా డాక్టర్ల మాటలు లెక్కచేయకుండా జలియన్ వాలా బాగ్ ఉదంతానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో పొల్గొన్నారు.
శాసనోల్లంఘన
లండన్లో చికిత్సకోసం వెళ్లిన సరోజినీనాయుడు జలియన్ వాలా బాగ్ ఉదంతంతో వెంటనే ఓడలో భారత్ చేరుకున్నారు.వెంటనే శాసనోల్లంఘన ఉద్యమంలో పాల్గొన్నారు. గాంధీజీ ఆదేశాల మేరకు బ్రిటిష్ దొరల శాసనాలు దిక్కరిస్తూ చరిత్ర పుస్తకాలను వీధుల్లో అమ్మి శాసనోల్లంఘనలో పాల్గొంది. గాంధీజీతో 1931లో లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు హాజరైంది. 1942 క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొని బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించింది. క్విట్ ఇండియా ఉద్యమంలో అరెస్టైన సరోజినీనాయుడు 1945 వరకు జైలు జీవితం గడిపారు. తీవ్ర అనారోగ్యంపాలు కావడంతో ఆమెను బ్రిటిష్ దొరలు జైలు నుంచి విడుదల చేశారు.
గవర్నర్గా సేవలు
స్వాతంత్రం వచ్చాక జాతీయ కాంగ్రెస్ ఆమె సేవలు ఉపయోగించుకుంది. దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ గవర్నర్గా సరోజినీనాయుడును నియమించింది. వృద్దాప్యం, తీవ్రమైన అనారోగ్యంగా ఉన్నా ఆమె అందించిన సేవలు నేటికీ మరవలేనివి.జీవితాంతం మానవ సేవకు, దేశ సేవకు అంకితమై, అలసిపోయిన సరోజినీనాయుడు 1949, మార్చి 2న లక్నోలో కన్నుమూశారు.