రైతు సంఘాల నేతలతో కేంద్ర ప్రభుత్వం సోమవారంనాడు జరిపిన చర్చలు విఫలం అయ్యాయి. తమ డిమాండ్ల సాధన కోసం 200 రైతు సంఘాలు చలో ఢిల్లీకి (chalo delhi) పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఇవాళ చలో ఢిల్లీకి 20 వేల మందికిపైగా రైతులు సిద్దం కావడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి భారీ సంఖ్యలో రైతులు ట్రాక్టర్లుతో ఢిల్లీకి బయలు దేరారు. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు భద్రతాదళాలను కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దించింది.
చర్చలు విఫలం
రైతుల డిమాండ్లపై చండీగఢ్‌లో సోమవారం అర్థరాత్రి వరకు చర్చలు సాగాయి. కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండాలు 200 రైతుల సంఘాల నేతలతో చర్చలు జరిపినా ఫలితం లేకపోయింది. చర్చలు విఫలం అయ్యాయి. కనీస మద్దతు ధరపై చట్టం చేయాలని, 2021లో ఢిల్లీలో నిరసన తెలిపిన రైతులపై పెట్టిన వేలాది కేసులు ఎత్తివేయాలని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రుణ మాఫీ అమలు అంశాలపై రైతు సంఘాలు పట్టుపట్టాయి.కేంద్రం అంగీకరించకపోవడంతో చర్చలు విఫలం అయినట్లు రైతు సంఘాలు ప్రకటించాయి.
ఢిల్లీ అంతటా 144 సెక్షన్
రైతుల చలో ఢిల్లీ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకుని కేంద్ర బలగాలు రంగంలోకి దిగాయి. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా చర్యలు తీసుకున్నారు. రైతుల ఉద్యమంలోకి సంఘ విద్రోహ శక్తులు చొరబడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇప్పటికే రోడ్లపై ఇనుప కంచెలు ఏర్పాటు చేశారు. రైతులను, ట్రాక్టర్లను ఎక్కడికక్కడ నిలువరించేందుకు ఏర్పాట్లు చేశారు. రైతుల చలో ఢిల్లీ పిలుపుతో రాజధానిలో ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.