Summons to the Kerala CM daughter, CPM propaganda in support of her
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా
విజయన్‌కు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐఓ) సమన్లు జారీ చేసింది. ఆమె
నిర్వహిస్తున్న ఒక సంస్థ ఆర్థిక లావాదేవీలను పరిశోధించడం కోసం పలు డాక్యుమెంట్లు
ఇవ్వాలని కోరింది.
వీణా విజయన్ ‘ఎగ్జాలాజిక్ సొల్యూషన్స్’, అనే
సంస్థను స్థాపించి నిర్వహిస్తున్నారు. ఆ
సంస్థకు, ‘కొచ్చిన్ మినరల్స్ అండ్ రుటైల్ లిమిటెడ్’ (సీఎంఆర్ఎల్) అనే మరో సంస్థకు
మధ్య ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఎస్ఎఫ్ఐఓ పరిశోధిస్తోంది. అందులో భాగంగానే, ఆ రెండు
సంస్థల మధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన డాక్యుమెంట్లను సమర్పించాలంటూ వీణా
విజయన్‌కు ఎస్ఎఫ్ఐఓ నోటీసులిచ్చింది.
ఎగ్జాలాజిక్ సంస్థ ఆ సమన్ల కాపీని కర్ణాటక
హైకోర్టుకు సమర్పించింది. ఎస్ఎఫ్ఐఓ పరిశోధనను నిలిపివేయాలని కోర్టను కోరింది. అదే
పిటిషన్లో, కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ యేడాది జనవరి 31న జారీ చేసిన
విచారణ ఉత్తర్వులను నిలిపివేయాలని కూడా కోరింది.
ఆసక్తికరమైన విషయం ఏంటంటే వీణా విజయన్ సంస్థను
సమర్థిస్తూ సీపీఎం ఒక పత్రం విడుదల చేసింది. ఎగ్జాలాజిక్ సొల్యూషన్స్ సంస్థకు
సంబంధించి వివాదాలపై సీఎం కూతురిని సమర్ధిస్తూ మాట్లాడాలంటూ పార్టీ నాయకులు,
కార్యకర్తలకు ఆ పత్రం పంచింది. ఎగ్జాలాజిక్ బ్యాంకు లావాదేవీలను తారుమారు చేసి
తప్పుడు ఆరోపణలు చేస్తోందంటూ ఆ పత్రం నేరుగా కేంద్రప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించింది.
పినరయి విజయన్ కేరళలో అమలుచేస్తున్న అభివృద్ధి అజెండాను రాజకీయంగా దెబ్బతీయడం కోసం
కేంద్రప్రభుత్వ సంస్థలు అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయంటూ దుయ్యబట్టింది. ఎగ్జాలాజిక్
సంస్థ కార్యకలాపాలన్నీ పారదర్శకంగా ఉన్నాయని ఆ పత్రం క్లీన్చిట్ ఇచ్చేసింది.
వీణావిజయన్, సీఎంఆర్ఎల్ పేర్లను ప్రస్తావించకుండా… వీణను లక్ష్యం చేసుకోవడం
ద్వారా కేంద్రం పినరయి విజయన్‌పై రాజకీయ కక్ష సాధిస్తోందంటూ ఆ పత్రం చెప్పుకొచ్చింది.
ఒక కేసులో విచారణ ఎదుర్కొంటున్న తమ పార్టీ వ్యక్తికి అనుకూలంగా ప్రచారం చేయడానికి
ఇలా కరపత్రాలు పంచడం కేరళ సీపీఎం చరిత్రలో మొదటిసారి. కొన్నేళ్ళ క్రితం సీపీఎం
రాష్ట్ర కార్యదర్శి దివంగత కొడియేరి బాలకృష్ణన్ కుమారులు దాదాపు ఇలాంటి ఆరోపణలే
ఎదుర్కొన్నప్పుడు పార్టీ మౌనంగా చూస్తూ ఉండిపోయింది. ఇప్పుడు విజయన్ కూతురి కోసం
మాత్రం పార్టీ రంగంలోకి దిగింది.
ఈ వ్యవహారంపై కేంద్రమంత్రి వి మురళీధరన్ స్పందించారు.
ముఖ్యమంత్రి చెప్పుకుంటున్నట్లుగా ఆయన, ఆయన కూతురు ఏ తప్పూ చేయకపోతే దర్యాప్తు
సంస్థ పరిశోధన నుంచి పారిపోవడం అక్కర్లేదని అభిప్రాయపడ్డారు. వారంత
నిజాయితీపరులైతే ఎస్ఎఫ్ఐఓ దర్యాప్తును నిలిపివేయాలంటూ కోర్టును ఆశ్రయించడంలో అర్ధం
లేదన్నారు. సీపీఎం పార్టీ వీణను ఎందుకు సమర్ధిస్తోందని ఆశ్చర్యం వ్యక్తం చేసారు.
కొడియేరి బాలకృష్ణన్ పిల్లలకు ఒక న్యాయం, పినరయి విజయన్ కూతురికి ఇంకో న్యాయమా అని
ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అని గతంలో చెప్పిన సీపీఎం, ఇప్పుడు
సీఎం కూతురి విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటోందని ప్రశ్నించారు.