Swami Dayanand Saraswati : The saint who proclaimed Swarajya slogan for the first time
(నేడు స్వామి దయానంద సరస్వతి జయంతి)
‘స్వరాజ్యం నా జన్మహక్కు’ అన్న నినాదం ఇచ్చినది
బాలగంగాధర తిలక్ అని మనకు తెలుసు. కానీ ఆయన కంటె చాలా ముందే, 1876లోనే బ్రిటిష్
వారినుంచి విముక్తి కావాలి, భారతదేశానికి స్వరాజ్యం కావాలి అని ఒక సాధువు డిమాండ్
చేసారని మనలో చాలామందికి తెలియదు. ఆయనే స్వామి దయానంద సరస్వతి. భారతదేశపు
స్వాతంత్ర్యోద్యమానికి పితామహుడు ఆయన. భారత స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రను చదివితే ఆ
కాలానికి చెందిన చాలామంది నాయకులు, దేశభక్తులు, విప్లవవీరులు స్వామి దయానంద
సరస్వతి బోధనలతో స్ఫూర్తి పొందారని తెలుస్తుంది. వారిలో శ్యాంజీ కృష్ణవర్మ, స్వామి
శ్రద్ధానంద, లాలా లజపత్ రాయ్ ఆయన శిష్యులు ఎందరో ఉన్నారు.
విప్లవ మార్గంలో నడిచిన దేశభక్తులు బాలగంగాధర
తిలక్, బిపిన్ చంద్రపాల్, గేందాలాల్ దీక్షిత్, స్వామి భవానీ దయాళ్, భాయి పరమానంద్,
భగత్‌సింగ్, రాంప్రసాద్ బిస్మిల్, యశ్పాల్, గణేశ్ శంకర్ విద్యార్థి వంటి వారు
సైతం దేశభక్తి అనే గుణాన్ని అందిపుచ్చుకున్నది ఆర్యసమాజం నుంచే. దయానంద సరస్వతి
బోధనలు, దార్శనికత మహాత్మా గాంధీని సైతం గణనీయంగా ప్రభావితం చేసాయి. గాంధీ గురువు
గోపాలకృష్ణ గోఖలే, ఆయన గురువు జస్టిస్ గోవింద రానడే… దయానంద సరస్వతి శిష్యులు
మాత్రమే కాదు, ఆయన స్థాపించిన పరోపకారిణీ సభలో సభ్యులుగా పనిచేసారు కూడా.
1857 విప్లవం తరువాత ఆనాటి విప్లవానికి మానసిక,
సామాజిక, సాంస్కృతిక వారసులుగా నిలిచిన వారి జాబితాలో మొట్టమొదటి పేరు స్వామి
దయానంద సరస్వతిదే అని ఇంద్రవిద్యా వాచస్పతి చెప్పారు. రాజకీయాల్లో జాతీయవాదాన్ని
ఘనంగా ప్రకటించిన వ్యక్తి స్వామి దయానంద సరస్వతి అంటే అతిశయోక్తి కాదు. ‘భారతదేశం
భారతీయులకే’ అని మొట్టమొదట చెప్పిన వ్యక్తి దయానంద సరస్వతే అని అనీ బిసెంట్ స్పష్టం
చేసారు.
‘‘నాకు
నా ఆత్మను దానం చేసింది స్వామి దయానంద సరస్వతి. ఆయన మానసపుత్రుడినైనందుకు నేను
ఆయనకు ఋణపడిపోయాను’’ అని లాలా లజపత్ రాయ్ అన్నారు. దయానంద సరస్వతి రచించిన ‘సత్యార్థ
ప్రకాశ’లో ఆనాటి భారతదేశపు స్థితిగతులను హృదయాలను కలచివేసేలా వర్ణించారు. అవి చదివి
దయానంద దేశభక్తి స్ఫూర్తిని గ్రహించినప్పుడు… సనాతన ధర్మ అనుయాయి, దేశభక్తుడూ
అయిన మదన్మోహన్ మాలవీయ కళ్ళు నీళ్ళతో నిండిపోయాయని ఆయనే చెప్పుకున్నారు. ఈ ఉదాహరణలన్నీ
చూసాక మనకు అర్ధమయ్యేది ఒకటే. స్వామి దయానంద సరస్వతి తన జాతీయవాద భావజాలంతో భారత
స్వాతంత్ర్య సంగ్రామానికి స్ఫూర్తినీ, శక్తినీ అందించారు. భారతీయ సంస్కృతి విదేశీ
ప్రభావాలకు లోనైన తరుణంలో భారతదేశం కోసం, హిందువుల కోసం కృషి చేసిన మహనీయుడు
స్వామి దయానంద సరస్వతి.
స్వామి దయానంద సరస్వతి 1824 ఫిబ్రవరి 12న గుజరాత్
కఠియవాడ్ ప్రాంతం మోర్వీ రాష్ట్రంలోని తంకారా అనే ఊరిలో జన్మించారు. ఆయన మూలా
నక్షత్రంలో పుట్టినందున ఆయనకు మూలశంకర్ అని పేరు పెట్టారు. మూలశంకర్ 1846లో
సత్యాన్ని అన్వేషిస్తూ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. స్వామి విరజానంద వద్ద అతను
పాణిని వ్యాకరణం, పాతంజల యోగసూత్రాలు, వేద వేదాంగాలూ అధ్యయనం చేసాడు. ఆయన గురువు
ఆయనను ఒకటే అడిగారు. భిన్నాభిప్రాయాలు అనే అజ్ఞానాన్ని పారద్రోలి, వైదికధర్మం అనే
కాంతితో కూడిన సనాతన వైదిక మతం అనే దీపాన్ని దక్షిణగా ఇవ్వమని కోరారు. దాని ఫలితమే,
ఆర్యావర్తంలోని హిందూ సమాజాన్ని జాగృతం చేయాలని ఆయన లక్ష్యం నిర్దేశించుకున్నారు.
దానికి ఎంత వ్యతిరేకత వచ్చినా, ఎంతమంది ఖండించినా వెనుకడుగు వేయనే లేదు. దయానంద అతిపెద్ద
సేవ హిందువులను క్రియాశీలంగా జాగృతం చేసి వారిని సాధికారత వైపు నడిపారు. ‘‘బలం
లేకపోతే మన ఉనికి ఈ నేల మీదనుంచి చెరిగిపోతుంది’’ అని ఆయన స్పష్టం చేసారు. భారతదేశంలో
సమాజాన్ని సాధికారం వైపు దయానంద, వివేకానందలా నడిపినవారు ఇంకెవరూ లేరు.
స్వామి దయానందర సరస్వతి అందరూ బాగా చదువుకోవాలని భావించేవారు,
దాన్నే విస్తృతంగా ప్రచారం చేసారు. దేశంలోని మహిళలకు సరైన విద్య ఉండాలని ఆయన
వాదించేవారు. మహిళలను పూజించాలని ఆయన భావన. దయానంద సరస్వతి అథర్వవేదం గురించి
వివరిస్తూ, బాలికలు కూడా బ్రహ్మచర్యాన్ని అనుసరించాలనీ, విద్యను అభ్యసించాలనీ
చెప్పారు. బాలబాలికలు అందరూ విద్యాభ్యాసం సమయంలో నియమిత జీవితం గడపాలని, మనసా వాచా
కర్మణా బ్రహ్మచర్యం పాటించాలనీ వివరించారు. ఇంగ్లీషు చదువులు చదువుకున్న
యువతరాన్ని భారతీయ భాషల గౌరవంతో ఆకట్టుకోవాలనుకునేవారు. ఆయన రచన ‘సత్యార్థ ప్రకాశ’లో
హిందీ వినిమయం ఆయన ప్రజలను జాగృతం చేయడానికి అవతరించిన నాయకుడని, సాధారణ జనజీవనంలో
ప్రాచీన ఆదర్శాలను అనుసరించాలని చాటిచెప్పారనీ తెలియజేస్తుంది. నైతిక ఆదర్శాలు
కలిగిన వ్యక్తి సహజంగానే సామాజిక, రాజకీయ సమృద్ధి సాధిస్తాడని ఆయన విశ్వసించారు.
అలా ఆయన ఐహిక, నైతిక, సామాజిక ఉద్భవాన్ని బలంగా సమర్ధించారు.
మహర్షి దయానంద సరస్వతి ‘విద్యకు ఉత్తమ లక్ష్యం
శీలనిర్మాణం’ అని భావించేవారు. దాన్ని సాకారం చేయడం కోసం హరిద్వార్ వద్ద
గంగానదీతీరంలో 1902లో ‘కంగడి గురుకులా’న్ని స్థాపించారు. ఒక వ్యక్తి కోరికలు,
ఆచరణల సంకలనమే అతని స్వభావం అవుతుంది. ఒక
వ్యక్తి ఏ విలువల వైపు నిలిచి ఉంటాడో ఆ విలువల సమాపనమే అతని స్వభావం అవుతుంది. ఒక
వ్యక్తికి కలిగే సుఖదుఃఖాలు అతని ఆత్మపై, అతని సంస్కృతిపై ముద్రవేస్తాయి. అలాంటి
వివిధ ముద్రలు అన్నింటి ఫలితమే ఆ వ్యక్తి స్వభావం అవుతుంది. మన ఆలోచనలే మనం.
కాబట్టి విద్యార్ధుల స్వభావం ప్రధానంగా బాల్యంలోను, కౌమారంలోనూ వికసిస్తుంది. ఆ
విషయంలో తల్లిదండ్రులు, సంరక్షకులు, గురువులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. అందుకే
ఆహారం, నైతికత, దుస్తులు విషయంలో సర్వత్రా నిరాడంబరంగా ఉండాలనే సూత్రాన్ని
అనుసరించాలని స్వామీ దయానంద సరస్వతి బోధించారు. ప్రతీ విద్యార్ధికీ దుస్తులు, ఆహారం,
నివాసం ఒకే రకంగా ఉండాలని ఆయన అభిప్రాయం. స్వచ్ఛమూ, నిరాడంబరమూ అయిన జీవితంలోనే
అది సాధ్యమవుతుంది. భౌతిక ప్రపంచపు సుఖాలు, సంపదల నుంచి విడివడనంతవరకూ మతం యొక్క
నిజమైన జ్ఞానం అందదు అన్న విషయాన్ని గుర్తుంచుకుని ఆచరించాలని ఉపాధ్యాయులకు చెప్పేవారు.
దయానంద సరస్వతి 1880లో మీరట్‌లో పరోపకారిణి సభ స్థాపించారు. దాని ప్రధాన లక్ష్యం
వేద వేదాంగాలను సరైన వ్యాఖ్యానంతో ముద్రించి ప్రచురించడం. ఆర్యసమాజం ప్రధానంగా
అనాధలను రక్షించడం, సంక్షేమ కార్యక్రమాల నిర్వహణ, వైదిక పరిశోధనలపై దృష్టి
సారించింది.
ప్రఖ్యాత జర్మన్ తత్వవేత్త, విద్యావేత్త
హెర్బర్ట్ కూడా విద్య నిజమైన లక్ష్యం ‘ఆదర్శప్రాయమైన గుణాల నిర్మాణం’ అని
చెప్పాడు. ‘‘విద్య ప్రధాన లక్ష్యం మానవుల్లో నైతిక విలువలను వ్యాపింపజేయడం. నైతికత
అనేది మతం కంటె భిన్నమైనది. నైతికత అంటే మానవులలో అత్యుత్తమ లక్షణాలను పోగుచేయడమే.
విద్య యొక్క మొత్తం సారాంశం నైతికతే.
మానవుల గుణాలను సంస్కరించి వికసింపజేయడమే విద్య. సత్యం, శివం, సుందరం, ధర్మాలను తెలుసుకోవడమే
నైతికత’’ అని హెర్బర్ట్ భావన.
దయానంద సరస్వతి 1874 జూన్‌లో సత్యార్థ ప్రకాశ
రాయడం ప్రారంభించారు. 1875 ఏప్రిల్ 7న ఆయన ఆర్యసమాజం స్థాపించారు. ‘వేదాలకు
మళ్ళుదాం’ అనే నినాదం ఇచ్చారు. వేదాలకు భాష్యం రాస్తున్నప్పుడు ఆయన కర్మసిద్ధాంతం,
పునర్జన్మ, బ్రహ్మచర్యం, సన్యాసం వంటి విషయాల ఆధారంగా తన సిద్ధాంతాన్ని రూపొందించారు.
అస్పృశ్యత వేదబాహ్యము, వేదవిరుద్ధమూ అని దయానంద విశ్లేషించారు. హిందూ
వర్ణవ్యవస్థను అస్పృశ్యత అనే శాపం నుంచి విముక్తం చేయడంలో ఆయన కీలక పాత్ర
పోషించారు. సత్యార్థ ప్రకాశ మొదటిసారి కాశీలో 1875లో ప్రచురితమైంది. దయానంద
సరస్వతి రచనలు అన్నింటిలోనూ సత్యార్థ ప్రకాశ ప్రధానమైనది. దానికి రిఫరెన్సులుగా
377 పుస్తకాలను పేర్కొన్నారు. అందులో 1542 వేదమంత్రాలు లేక శ్లోకాలను ఉటంకించారు.
నేటి కాలంలో ఒక పరిశోధకుడు ఎవరైనా, ఏదైనా
విశ్వవిద్యాలయంలో అత్యాధునిక సంస్కృత గ్రంధాలయం అందుబాటులో ఉండగా, అలాంటి రిఫరెన్సులతో
ఒక పుస్తకం రాయాలంటే ఏళ్ళకేళ్ళు పడుతుంది. కానీ దయానంద సరస్వతి కేవలం కొన్ని
నెలల్లోనే పూర్తి చేసారు. ఆ పుస్తకం ఒక కొత్త సామాజిక దృక్కోణానికి జన్మనిచ్చింది.
విదేశీ భాషలు నేర్చుకోడాన్ని సత్యార్థ ప్రకాశ ప్రోత్సహిస్తుంది, కానీ ముందుగా మన
సొంత భాషలైన సంస్కృతం, హిందీకి ప్రధమ ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తుంది.
మహర్షి దయానంద సరస్వతి వేదాలు, ఉపనిషత్తుల ప్రాచీన
వ్యాఖ్యానాలను మాత్రమే ఆమోదించారు. అలాంటి ప్రామాణికమైన వ్యాఖ్యానం చేసారు. భారతీయ
సమాజాన్ని ఒక సాంస్కృతిక కేంద్రంగా నిర్వచించి నిర్వహించాలన్న ప్రధాన లక్ష్యంతోనే ఆయన
ఆర్యసమాజాన్ని ఏర్పాటు చేసారు. ఇవాళ మనం చూస్తున్న జాతీయవాద భావధారను
పెంచిపోషించడంలో ఆర్యసమాజం ప్రముఖ భూమిక పోషించింది. అది ప్రధానంగా పంజాబ్,
ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంచింది.
పరోపకారిణీ సభ 1880లో మీరట్‌లో ఏర్పాటయింది. వేదాలు,
వేదాంగాలు, వాటి వ్యాఖ్యానాల ముద్రణ, ప్రచురణ చేయడమే దాని ప్రధాన ఉద్దేశ్యం.
పుస్తక ప్రచురణ, వేదాలపై పరిశోధన, అధ్యయనం, ధర్మప్రచారం, అనాధల సంరక్షణ, ఇతర
సామాజిక సంక్షేమ కార్యక్రమాలూ ఆర్యసమాజం కార్యకలాపాలు. హిందూమతంలోనుంచి ఇతర
మతాల్లోకి మారినవారిని తిరిగి వెనక్కు హిందూమతంలోకి తీసుకొచ్చే శుద్ధి ఉద్యమాన్ని
దయానంద సరస్వతి ప్రారంభించారు. ఆ ఉద్యమంలో భాగంగా లక్షలాది ముస్లిములు,
క్రైస్తవులను శుద్ధిచేసి సనాతన వైదిక ధర్మంలోకి తీసుకొచ్చారు. ఆ ప్రయోజనం కోసం
స్వామి దయానంద శిష్యుడైన స్వామి శ్రద్ధానంద 1923 ఫిబ్రవరి 11న భారతీయ శుద్ధి సభను
స్థాపించారు.
స్వామి దయానంద సరస్వతి 1883 అక్టోబర్ 30న సిద్ధి పొందారు.
వేదాలను, వాటి సారాంశాన్నీ సరైన వ్యాఖ్యానంతో ప్రజలందరికీ అందుబాటులోకి తేవడం ఆయన
సాధించిన మహోన్నత ప్రయోజనం.