బిహార్ సీఎం నితీశ్ కుమార్ బలపరీక్షలో నెగ్గారు. ఇవాళ నిర్వహించిన విశ్వాస పరీక్షలో మొత్తం 129 మంది ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు పలికారు. విపక్ష సభ్యులు ఓటింగ్లో పాల్గొనలేదు. అసెంబ్లీ నుంచి విపక్ష సభ్యులు వాకౌట్ చేశారు. బిహార్ అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా, మెజార్టీ సాధించడానికి 122 ఓట్లు రావాల్సి ఉంది. అయితే నితీశ్ కుమార్కు 129 మంది మద్దతుగా నిలిచారు.
సీఎం విశ్వాస పరీక్షకు ముందు బిహార్ అసెంబ్లీ స్పీకర్ బిహారీ చౌధరిపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై కూడా ఓటింగ్ జరిగింది. అవిశ్వాస తీర్మానం 125-112 ఓట్లతో నెగ్గింది. ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఎన్డీయే పక్షంలో కూర్చోవడంతో ఆ పార్టీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర అభ్యంతరం తెలిపారు. పాయింట్ ఆఫ్ ఆర్డర్ లేవనెత్తారు. స్పీకర్ తిరస్కరించారు. త్వరలో కొత్త స్పీకర్ను కూడా ఎన్నుకోనున్నారు.
బిహార్లో మహాగఠ్బంధన్ను చూసి బీజేపీ భయపడిందని అంతకు ముందు తేజస్వీ యాదవ్ వ్యాఖ్యానించారు. కూటమి నుంచి నితీశ్ కుమార్ ఎందుకు మారారో ఆయనే చెప్పాలన్నారు. బీజేపీ కూటమి నుంచి మరోసారి మారబోరని ప్రధాని హామీ ఇవ్వగలరా అంటూ తేజస్వి ప్రశ్నించారు.
బిహార్ సీఎం నితీశ్ కుమార్ (bihar cm nitish kurmar won floor test) గత నెల 28న పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఆర్జేడీ కూటమి నుంచి బయటకు వచ్చి, బీజేపీతో చేతులు కలిపారు. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అదే రోజు 9వసారి సీఎంగా ప్రమాణం చేశారు. ఇవాళ బలం నిరూపించుకున్నారు.