Maharashtra former CM Ashok Chavan quits Congress
మహారాష్ట్ర శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆ రాష్ట్రంలో
కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి, మాజీ ఎంపీ
అశోక్ చవాన్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసారు. ఆయన
బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మహారాష్ట్రలోని భోకర్ నియోజకవర్గం నుంచి
ఎమ్మెల్యే అయిన అశోక్ చవాన్, ఇవాళ రాష్ట్ర శాసనసభ స్పీకర్ రాహుల్ నార్వేకర్‌ను
కలిసి తన రాజీనామా సమర్పించారు. అశోక్ చవాన్ బీజేపీలో చేరితే, కాంగ్రెస్ కోల్పోతున్న
రెండో పెద్ద నాయకుడవుతారు. గత నెల మిలింద్ దేవరా కాంగ్రెస్‌కు రాజీనామా చేసి ఏకనాథ్
షిండే నేతృత్వంలోని శివసేనలో చేరారు.
అశోక్ చవాన్ బీజేపీలో చేరతారా అని అడిగినప్పుడు
ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ‘‘ఈ విషయాన్ని మీడియాలోనే చూసాను. నేను
చెప్పగలిగేది ఒకటే. కాంగ్రెస్‌లోని చాలామంది మంచి నాయకులు బీజేపీతో టచ్‌లో
ఉన్నారు. ప్రజాదరణ కలిగిన ఎందరో నాయకులు కాంగ్రెస్‌లో ఉండలేని పరిస్థితి’’ అని
చెప్పారు.
అశోక్ చవాన్‌కు మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు
నానా పటోలేకు మధ్య అసెంబ్లీ ఎన్నికల అభ్యర్ధులను ఎంపిక చేయడంలో తలెత్తిన విభేదాల
వల్లనే ఆయన పార్టీకి రాజీనామా చేసారని తెలుస్తోంది.
అశోక్ చవాన్, మహారాష్ట్ర
మాజీ ముఖ్యమంత్రి శంకర్ చవాన్ కుమారుడు. నాందేడ్ ప్రాంతంలో ఆయనకు గణనీయమైన పట్టు
ఉంది. అశోక్ రాజీనామా రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయావకాశాలను బాగా
దెబ్బతీస్తుంది. కాంగ్రెస్ – ఉద్ధవ్ థాకరే శివసేన – ఎన్సీపీ కూటమి మీద కూడా
గణనీయమైన ప్రభావం చూపుతుంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు