TN Governor refuses to read out the Government Speech
తమిళనాడు శాసనసభ బడ్జెట్ సమావేశాలు అసాధారణంగా మొదలయ్యాయి.
అసెంబ్లీ సంప్రదాయాల ప్రకారం ప్రభుత్వం రాసిచ్చే ప్రసంగాన్ని గవర్నర్ చదవడానికి
నిరాకరించారు. స్టాలిన్ ప్రభుత్వం తయారుచేసిన ప్రసంగంలో తప్పులు, నైతికపరంగా
విరుద్ధమైన అంశాలూ ఉన్నందున దాన్ని చదవబోనని గవర్నర్ ఆర్ఎన్ రవి స్పష్టం చేసారు.
ప్రసంగపాఠంలో చాలా అంశాలు వాస్తవ విరుద్ధంగా, సాధారణ
నైతిక పద్ధతులకు విరుద్ధంగా ఉన్నాయి. వాటిని గవర్నర్ హోదాలో సమర్పించడం
రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే అవుతుంది అని గవర్నర్ అన్నారు. ‘‘జాతీయ గీతానికి
గౌరవం ఇవ్వాలని పదేపదే కోరాను. గవర్నర్ ప్రసంగానికి ముందు, అయిపోయిన తర్వాత జాతీయ
గీతాన్ని వినిపించాలని కోరాను. దాన్ని విస్మరించారు. ఈ ప్రసంగంలో చాలా విషయాలు
వాస్తవ విరుద్ధంగా ఉన్నాయి, సామాన్య నైతిక విలువలకు విరుద్ధంగా ఉన్నాయి. అలాంటి
అంశాలతో నేను విభేదిస్తున్నాను. వాటిని నా నోటితో నేను చదవడం రాజ్యాంగాన్ని అవహేళన
చేయడమే అవుతుంది. కాబట్టి, సభను గౌరవిస్తూ, నా ప్రసంగాన్ని ఇక్కడితో
ముగిస్తున్నాను. ప్రజాప్రయోజనం కోసం ఈ సభ నిర్మాణాత్మకమైన, ఆరోగ్యకరమైన చర్చలు
నిర్వహిస్తుందని ఆశిస్తున్నాను’’ అన్నారు రవి.
దాంతో గవర్నర్ ప్రసంగం తమిళ ప్రతిని అసెంబ్లీ
స్పీకర్ ఎం అప్పవు చదివారు. ఆ సందర్భంగా గవర్నర్ మీద వ్యాఖ్యలు సైతం చేసారు.
‘‘గవర్నర్ ప్రసంగాన్ని తమిళనాడు ప్రభుత్వం ఆమోదించింది. దాన్ని ఆయన ఇక్కడ చదవాలి.
ఆయన దాన్ని చదవలేదు. దానికి నేను ఆయనను తప్పుపట్టను. జాతీయగీతం పాడాలని గవర్నర్
అన్నారు. ప్రతీఒక్కరికీ రకరకాల అభిప్రాయాలుంటాయి. కానీ అవన్నీ మాట్లాడడం నైతికం
కాదు. ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ గవర్నర్‌ని
గౌరవిస్తాము. వారితో భేదాభిప్రాయాలు ఉన్నప్పటికీ ఆ ఉన్నత స్థానాన్ని గౌరవిస్తాము.
గవర్నర్ గారూ, మీ మనసులో ఏముందో అదే మాట్లాడండి. మా మనసులో వరదలు, తుఫాన్ల ప్రభావం
రాష్ట్రం మీద ఎలా ఉందన్న విషయం గురించి మాత్రమే ఉంది. మాకు కేంద్రం నుంచి ఒక్క
పైసా అయినా నిధులు రాలేదు. పీఎం కేర్ ఫండ్స్‌లో చాలా నిధులున్నాయి. అందులోనుంచి
ఒక్క 50వేల కోట్లు అడగొచ్చా? గవర్నర్ ఆ
నిధులను ఇప్పించగలిగితే బాగుంటుంది’’ అని అప్పవు వ్యాఖ్యానించారు. ‘‘సావర్కర్, గాడ్సే
అడుగుజాడల్లో నడిచేవారికంటె తమిళనాడు అసెంబలీ చిన్నదేమీ కాదు’’ అని వ్యంగ్యంగా
అన్నారు.
స్పీకర్ తన ప్రసంగం పూర్తి చేయగానే, జాతీయగీతం
ఆలాపన జరగకముందే గవర్నర్ సభను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తమిళనాడు అసెంబ్లీ
గవర్నర్ తన ప్రసంగాన్ని పూర్తిగా చదివినట్టుగా భావించి దాన్ని ఆమోదిస్తూ తీర్మానం
చేసింది.
గతేడాది బడ్జెట్ సమావేశాల
సమయంలోనూ గవర్నర్‌కు ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. గవర్నర్ తనకు రాసిచ్చిన ప్రసంగ
పాఠానికి పరిమితం కాకుండా, అదనంగా చదివే వాక్యాలను శాసనసభ రికార్డుల నుంచి
తొలగించాలంటూ ముఖ్యమంత్రి స్టాలిన్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ తీర్మానాన్ని ఆమోదించడంతో
గవర్నర్ ఆర్ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేసారు.