Nitish Kumar Government to face Trust Vote
బిహార్ ముఖ్యమంత్రిగా నితీష్ కుమార్ తాజాగా
ప్రమాణస్వీకారం చేసాక, కొత్త ప్రభుత్వం ఇవాళ విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది.
దానికోసం జేడీయూ ఎమ్మెల్యేలు రాష్ట్ర రాజధాని పట్నాలోని శాసనసభకు చేరుకున్నారు. విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు.
నితీష్ నేతృత్వంలోని జేడీయూ జనవరి నెలలో ఎన్డీయే
కూటమిలోకి మళ్ళీ చేరింది. ఆర్జేడీ-కాంగ్రెస్‌లతో కలిసి ఏర్పాటుచేసిన మహాగఠ్‌బంధన్‌ను
విడిచిపెట్టి పాత నేస్తమైన బీజేపీతో చేతులు కలిపింది. నిజానికి జాతీయస్థాయిలో
ఎన్డీయేకి వ్యతిరేకంగా ఇండీ కూటమి ఏర్పాటులో నితీష్ కుమార్ కీలకపాత్ర పోషించారు.
అయితే ఆ కూటమిలో నితీష్‌కు కన్వీనర్ పదవి అయినా దక్కలేదు. కాంగ్రెస్ వైఖరితో దెబ్బతిన్న
జేడీయూ విషయంలో కూటమిలోని మరో బిహారీ స్థానిక పార్టీ ఆర్జేడీ సైతం నిర్లిప్తధోరణి
వహించింది. దాంతో మనస్తాపం చెందిన నితీష్, ఇండీ కూటమి నుంచి బైటకు వచ్చేసారు. ఆ
నేపథ్యంలో బిహార్‌లో సీఎం పదవికి రాజీనామా చేసి, మళ్ళీ బీజేపీతో కలిసి కొత్తగా
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసారు.
ఆ క్రమంలో ఇవాళ విశ్వాస పరీక్ష జరగబోతోంది.
ఇరుపక్షాలూ తమకే మెజారిటీ ఉందని చెప్పుకుంటున్నాయి. ముందుజాగ్రత్త చర్యగా వేర్వేరు
ప్రాంతాలకు పంపించిన జేడీయూ ఎమ్మెల్యేలందరూ ఈ ఉదయం పట్నాలోని శాసనసభకు చేరుకున్నారు.
జేడీయూ నేత నీరజ్ కుమార్ ‘‘ఎన్డీయేకే మెజారిటీ
ఉంది. మొదట స్పీకర్‌కు వ్యతిరేకంగా అవిశ్వాసతీర్మానం ప్రవేశపెడతాం. ఆయన గద్దె
దిగాలి, ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ సభాకార్యక్రమాలు నిర్వహిస్తారు…’’ అని
చెప్పారు.
బీజేపీ నేత షానవాజ్ హుసేన్ ‘‘జేడీయూ-ఎన్డీయే
ప్రభుత్వం సభలో మెజారిటీ నిరూపించుకుంటుంది. మా సంఖ్య ఇంకా పెరుగుతుంది. ప్రతిపక్షం
ఎంత ప్రయత్నించినా ఏమీ జరగదు. బిహార్‌కు ఇక జంగల్ రాజ్ మళ్ళీ రాదు’’ అని
వ్యాఖ్యానించారు.
ఆర్జేడీ నేత మృత్యుంజయ్ తివారీ, తమ కూటమే గెలుస్తుందని
ధీమా వ్యక్తం చేసారు. ప్రజాస్వామ్యమే గెలుస్తుంది. బిహార్‌ను, రాష్ట్ర భవిష్యత్తును
రక్షించాలని ఎమ్మెల్యేలందరూ నిర్ణయించుకున్నారు. దానికోసం ఈ ప్రభుత్వాన్ని గద్దె
దింపాల్సిందే’’ అన్నారు.
బిహార్ శాసనసభలో మొత్తం 243 మంది ఎమ్మెల్యేలున్నారు. వారిలో జేడీయూకు
45మంది, బీజేపీకి 79మంది, బీజేపీ మిత్రపక్షం హిందుస్తానీ అవామ్ మోర్చా సెక్యులర్‌కు
4, స్వతంత్ర అభ్యర్ధి 1 ఉన్నారు. వీరంతా కలిసి 128మది ఎమ్మెల్యేలున్నారు.
ఆర్జేడీ-కాంగ్రెస్‌ల మహాగఠ్‌బంధన్‌లో 115మంది ఎమ్మెల్యేలున్నారు. బలపరీక్ష
గెలవడానికి అధికార పక్షానికి 122 ఓట్లు కావాలి. ఇరుపక్షాల మధ్యా తేడా నామమాత్రంగా
ఉన్నందున విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొంది.