రైతుల చలో ఢిల్లీ కార్యక్రమం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.రైతు సంఘాలు రేపు చలో ఢిల్లీకి (farmers chalo delhi) పిలుపునిచ్చాయి. దీంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల నుంచి వేలాది రైతులు ఢిల్లీ వైపుగా కదులుతున్నారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ రైతు సంఘాలు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రైతు సంఘాల పిలుపుతో పంజాబ్, హర్యానా రాష్ట్ర పోలీసులతోపాటు, కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు.
భద్రత కట్టుదిట్టం
చలో ఢిల్లీ పిలుపుతో కేంద్ర, రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి. పంజాబ్‌లోని అంబాలా సమీపంలో శంఖు వద్ద హర్యానా పోలీసులు రహదారులను మూసివేశారు. జాతీయ రహదారికి అడ్డుగా ఇసుక బస్తాలు వేశారు. ముళ్ల కంచెలు, కాంక్రీటు దిమ్మెలు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక సిబ్బంది, భాష్ఫవాయువు ప్రయోగించే బలగాలను సిద్దం చేశారు. ఘగ్గర్ ఫ్లైఓవర్‌పై ముళ్ల కంచెలు వేశారు. రైతుల మార్చ్‌ను అడ్డుకునేందుకు దాదాపు 12 వేల మంది పోలీసు బలగాలను రంగంలోకి దింపారు.
బారికేడ్లు, జల ఫిరంగులు సిద్దం చేశారు. జింద్, ఫతేహాబాద్ జిల్లాల్లో ఖాప్ పంచాయత్లతో పోలీసులు చర్చలు జరుపుతున్నారు. పలు గ్రామాల సర్పంచులతో పోలీసు అధికారులు జరిపిన చర్చలు ఫలించడం లేదు. దేశ రాజధానిలో ఉద్రికత్తలు తెలెత్తకుండా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే 144 సెక్షన్ విధించింది. రెండు స్టేడియాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టైన రైతులను అందులోకి తరలించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.
హర్యానాలోని ఏడు జిల్లాలో మొబైల్, నెట్ సేవలు నిలిపివేశారు. ఈశాన్య ఢిల్లీలోనూ ఇప్పటికే 144 సెక్షన్ విధించారు. యూపీ, హర్యానా సరిహద్దులో భారీగా బలగాలను మోహరించారు. ఈ రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో 5 వేల మంది పోలీసులను మోహరించారు. మూడేళ్ల కిందట ఢిల్లీలో జరిగిన రైతుల సుదీర్ఘ నిరసనను దృష్టిలో పెట్టుకుని, కేంద్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంది.
ఎంత మంది వచ్చే అవకాశముంది?
ఢిల్లీ మార్చ్‌కు దాదాపు 30 వేల మందికిపైగా రైతులు వచ్చే అవకాశ ముందని కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలు అంచనా వేశాయి. రైతు సంఘాల నేతలు ఇప్పటికే రైతులతో రిహార్సల్స్ కూడా నిర్వహరించారని నిఘా వర్గాల సమాచారం. రైతుల ఆందోళన హింసకు దారితీయకుండా ఉండేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. రైతులు ట్రాక్టర్లలో ఢిల్లీకి చేరుకుంటున్నారు. 2 వేల నుంచి 2500 ట్రాక్టర్లలో ఢిల్లీ వీధులను నిర్బంధించే అవకాశాలున్నాయని నిఘా వర్గాలు హెచ్చరించాయి.
రైతుల డిమండ్లు ఏమిటి?
పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని కోరుతున్నారు.2021లో ఢిల్లీలో రైతులు చేపట్టిన నిరసన సమయంలో పెట్టిన వేలాది కేసులు ఎత్తివేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వం 200 రైతు సంఘాల నాయకులతో చర్చలు జరుపుతోంది. రైతుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఓ వైపు చర్చల్లో పాల్గొంటూనే రైతులను ఢిల్లీ చలో అంటూ రైతు సంఘాల నాయకులు పిలుపునివ్వడం ఆందోళన కలిగిస్తోంది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు