Qatar releases Indians from prison who were facing spy charges
గూఢచర్యం ఆరోపణలపై కతార్ దేశం అరెస్ట్ చేసిన
ఎనిమిది మంది భారత నౌకాదళంలోని అధికారులను ఆ దేశం విడిచిపెట్టింది. 18నెలల జైలుశిక్ష
అనుభవించిన ఆ అధికారుల్లో ఏడుగురు భారత్ చేరుకున్నారు.
‘‘కతార్‌లోని దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తూ
అరెస్టయిన ఎనిమిది మంది భారత జాతీయులను కతార్ విడుదల చేసింది. ఆ నిర్ణయాన్ని భారత
ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఈ విషయంలో కతార్ అమీర్ సానుకూల నిర్ణయం తీసుకున్నందుకు
ఆ దేశపు అమీర్‌ను అభివందిస్తోంది’’ అంటూ భారత విదేశాంగశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
భారత నౌకాదళ అధికారులకు తమ విడుదల గురించి ముందస్తు
సమాచారం ఇవ్వలేదు. వారిని జైలు నుంచి విడిచిపెట్టిన వెంటనే భారత దౌత్యకార్యాలయం అధికారులు
తమతో తీసుకువచ్చేసారు. ఆదివారం రాత్రి ఇండిగో విమానంలో ఎక్కి ఈ తెల్లవారుజామున
సుమారు 3గంటల సమయంలో భారత్ చేరుకున్నారు.
ఆగస్టు 2022లో కెప్టెన్ నవతేజ్ సింగ్ గిల్. కెప్టెన్
సౌరభ్ వశిష్ఠ్, కమాండర్ పూర్ణేందు తివారీ, కెప్టెన్ బీరేంద్ర కుమార్ వర్మ, కమాండర్
పాకాల సుగుణాకర్, కమాండర్ సంజీవ్ గుప్తా, కమాండర్ అమిత్ నాగ్‌పాల్, సెయిలర్ రాగేష్‌లను
కతార్ జైల్లో నిర్బంధించారు, అప్పటినుంచీ వారు కతార్ కటకటాల వెనుక మగ్గిపోయారు.
వీరంతా కతార్‌లోని దహ్రా గోల్డ్ అనే ప్రైవేటు
సంస్థలో ఉద్యోగులుగా చేరారు. అక్కడ అమీర్‌కు చెందిన నౌకాబలగంలో ఇటాలియన్ తయారీ యు-212
స్టెల్త్ సబ్ మెరైన్లను ప్రవేశపెట్టే విధుల్లో ఉండేవారు. 2023 అక్టోబర్ 26న కతార్
కోర్టు వారికి మరణశిక్ష విధించింది.
ఆ తీర్పుతో షాక్ అయిన
భారత ప్రభుత్వం హుటాహుటిన విదేశాంగ శాఖ అధికారులను కతార్ పంపించింది. అన్నిరకాల ప్రయత్నాలూ చేసి వారి మరణ శిక్షను
ఎట్టకేలకు రద్దుచేసేలా కష్టపడింది. ఈ తెల్లవారుజామున ఢిల్లీ చేరుకున్న నేవీ అధికారులు
ప్రధాని నరేంద్రమోదీకి, భారత ప్రభుత్వానికీ ధన్యవాదాలు తెలియజేసారు. ‘‘ప్రధానమంత్రి
నరేంద్రమోదీ వ్యక్తిగతంగా జోక్యం చేసుకొనకపోయి ఉంటే, ఆయనకు కతార్ అమీర్‌తో
సత్సంబంధాలు లేకపోయి ఉంటే మేమసలు బైటపడేవారిమే కాదు. ప్రధానమంత్రికి, ఆయనతో పాటు
మా విడుదల కోసం అనునిత్యం కష్టపడినవారికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని బాధితులు
చెప్పారు.