Farmers’
Delhi march: Haryana Turns Off Internet, Blocks Borders
హరియాణా-పంజాబ్
సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ‘ఛలో పార్లమెంటు’ నిరసన కార్యక్రమానికి రైతు సంఘాలు పిలుపు ఇచ్చిన నేపథ్యంలో పోలీసులు కట్టడి చర్యలు ప్రారంభించారు.
శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా కఠిన ఆంక్షలు విధించారు. రహదారులు దిగ్బంధించిన పోలీసులు,
ఇంటర్నెట్, మొబైల్ ఎస్ఎంఎస్ లపై నిషేధం విధించారు.
పోలీసు పహారాను కూడా రెట్టింపు
చేశారు. సమస్యాత్మక ప్రాంతాల్లో సాయుధ బలగాలను మోహరించారు. రోడ్లపై ముళ్ళకంచెలు,
పెద్దపెద్ద సిమెంటు డివైడర్లు ఏర్పాటు చేశారు.
అన్ని
రకాల పంటలకు కనీస మద్దతు ధరను తప్పనిసరి చేసేలా చట్టం చేయడంతో పాటు, 2020 ఆందోళనలో
రైతులపై పెట్టిన కేసులు కొట్టి వేయాలంటూ పలు రైతు సంఘాలు ఆందోళన కార్యక్రమానికి
పిలుపునిచ్చాయి. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈ నెల 13న పంజాబ్, హర్యానా ల నుంచి
పలువురు రైతులు దిల్లీ వెళ్ళనున్నారు. ఈ
పిలుపునకు దాదాపు 200 రైతు సంఘాలు మద్దతు తెలిపాయి.
దీంతో
శాంతి భద్రతల సమస్య తలెత్తే అవకాశం ఉండటంతో బీజేపీ నేతృత్వంలోని హర్యానా ప్రభుత్వం
అప్రమత్తమైంది. ఏడు జిల్లాల్లో ముందు జాగ్రత్త చర్యలు
చేపట్టింది. ఇంటర్నెట్ సేవలు నిలిపివేయడంతో పాటు, బల్క్ ఎస్ఎంఎస్ లపై నిషేధం
విధించారు. కేవలం వాయిస్ కాల్స్ మాత్రమే చేసే వీలుంది.
అంబాలా, కురుక్షేత్ర, కైతాల్, జింద్, హిసార్,
ఫతేబాద్, సిర్సా జిల్లాల్లో మంగళవారం రాత్రి వరకు ఆంక్షలు కొనసాగునున్నట్లు ముఖ్యమంత్రి
మనోహర్ లాల్ ప్రభుత్వం తెలిపింది.
హర్యానా-పంజాబ్
సరిహద్దులను పోలీసులు తాత్కాలికంగా మూసివేశారు. సరిహద్దు రాష్ట్రాలకు చెందిన నిరసనకారులు
దిల్లీ వెళ్ళకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ మార్గంలో నిత్యం రాకపోకలు
సాగించే వారు ఇబ్బంది పడకుండా వారి కోసం ప్రత్యామ్నాయ మార్గాలను పోలీసులు
సూచించారు.
ఆందోళన
కారులు గుమికూడితే చెదరకొట్టేందుకు వాటర్ కేనాన్స్ ను సిద్ధం చేసిన పోలీసులు, నిఘా
కోసం డ్రోన్లు కూడా ఉపయోగిస్తున్నారు.
శాంతి
భద్రతలకు భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆందోళనకారులను హర్యానా పోలీస్
బాస్, శత్రుజీత్ కపూర్ హెచ్చరించారు. 50 కంపెనీల పారామిలటరీ బలగాలు కూడా హర్యానా
పోలీసులకు సాయం అందిస్తున్నాయన్నారు.
ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లే చర్యలను మానుకోవాలన్నారు.