ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రెండు రోజుల విదేశీ పర్యటన ఖరారైంది. ఈ నెల 13, 14 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రధాని పర్యటించనున్నారు. యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశం కానున్నారు. రాజధాని అబుధాబిలో నిర్మించిన హిందూ ఆలయాన్ని మోదీ ప్రారంభించనున్నారు. ఆ తరువాత ప్రధాని మోదీ ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.
యూఏఈకి ప్రధాని మోదీ వెళ్లడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. మోదీ, నహ్యాన్ రెండు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని విస్తరించడంపై చర్చించనున్నారు. ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలు కూడా చర్చకు రానున్నాయని తెలుస్తోంది. దుబాయ్‌లో జరగనున్న వరల్డ్ గవర్నమెంట్ సమ్మిట్ 2024కు గౌరవ అతిథిగా ప్రధాని మోదీ హాజరు కానున్నారు.