Amit Shah on Ram Mandir in Lok Sabha Discussion
రామమందిర ఉద్యమాన్ని
విస్మరించి భారతదేశ చరిత్రను ఎవరూ చదవలేరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రామజన్మభూమిలో
భవ్య రామమందిర నిర్మాణ స్వప్నం మోదీ ప్రభుత్వ హయాంలోనే సాకారమైందన్నారు.
లోక్‌సభలో ‘చారిత్రక భవ్యరామమందిర
నిర్మాణం, రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ’ అన్న అంశంపై పాల్గొంటూ అమొత్ షా శ్రీరామచంద్ర
ప్రభువు లేని దేశాన్ని ఊహించుకునేవారికి ఈ దేశం గురించి సరిగ్గా తెలియదని, అలాంటి వాళ్ళు
వలసపాలన నాటి రోజులకు ప్రతినిధులు మాత్రమేననీ అన్నారు.
‘‘రామమందిర ఉద్యమాన్ని
విస్మరించి ఈ దేశపు చరిత్రను ఎవరూ చదవలేరు,. 1528 నుంచి ప్రతీ తరమూ ఏదో ఒక రూపంలో
ఈ ఉద్యమాన్ని చూసింది. రామమందిర అంశం సుదీర్ఘకాలం నిలిపివేయబడింది. ఈ కల మోదీ
ప్రభుత్వ హయాంలో సాకారం కావలసి ఉంది కాబట్టే అలా జరిగింది’’ అన్నారు అమిత్ షా.
ఈ యేడాది జనవరి 22న అయోధ్యలో నిర్మిస్తున్న భవ్య రామమందిరంలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆధ్వర్యంలో జరిగిన రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం
గురించి అమిత్ షా వివరించారు.
‘‘జనవరి 22 ఘనమైన భారతదేశానికి ప్రారంభదినం.
రాముడు లేకుండా ఈ దేశం గురించి ఊహించేవారికి ఈ దేశం గురించి సరిగ్గా తెలియదు,.
వాళ్ళు వలసపాలన నాటి రోజులకు ప్రతినిధులు. జనవరి 22 చరిత్రలో నిలిచిపోయిన రోజు.
రామభక్తులు అందరి ఆశలు, ఆకాంక్షలూ నెరవేరిన గొప్ప రోజది’’ అన్నారు అమిత్ షా.
భారతదేశంలోని అన్ని భాషల్లో అన్ని ప్రాంతాల్లో సంప్రదాయాలకు, జాతీయ
చైతన్యానికీ రామాయణమే ఆధారమని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. భారతదేశపు సంస్కృతినీ
రామాయణాన్నీ విడదీసి చూడలేమన్నారు.
ఇవాళ్టితో పార్లమెంటు సమావేశాలు ముగుస్తున్నాయి.
ప్రస్తుత బడ్జెట్ సమావేశాల ముగింపు మాత్రమే కాదు, ఈ ప్రభుత్వ హయాంలో ఇవే ఆఖరి
సమావేశాలు. మరికొన్ని వారాల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. మళ్ళీ కొత్త
ప్రభుత్వం ఏర్పడిన తర్వాతనే పార్లమెంటు మళ్ళీ సమావేశమవుతుంది.