తమిళనాడు జాలర్లపై శ్రీలంక నేవీ దాడులపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల కొంతమంది తమిళ జాలర్లను శ్రీలంక నేవీ అధికారులు అరెస్ట్ చేశారు. దీనిపై తమిళనాడు సీఎం స్టాలిన్, ప్రధాని మోదీకి లేఖ రాశారు. అరెస్టైన మత్స్యకారులను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని స్టాలిన్ లేఖలో కోరారు. తమిళజాలర్లను తరచూ అరెస్ట్ చేయడం, పడవలు స్వాధీనం చేసుకోవడం ఆందోళన కలిగిస్తోందని స్టాలిన్ అన్నారు.
శ్రీలంక నేవీ అధికారులు స్వాధీనం చేసుకున్న పడవలను అక్కడి ప్రభుత్వం జాతీయం చేస్తోంది. దీంతో వాటిని విడిపించడం సాధ్యం కావడం లేదు. లక్షల విలువైన పడవలు కోల్పోతోన్న మత్స్యకార కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి.
గత సంవత్సరం శ్రీలంక నేవీ అధికారులు 243 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. 37 పడవలు స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల 12 పడవలు, 88 మంది మత్స్యకారులను అరెస్ట్ చేశారు. ఈ సంఖ్య పెరిగిపోతూ ఉండటం ఆందోళన కలిగిస్తోందని, వారిని విడిపించేందుకు దౌత్యపరమైన సంప్రదింపులు జరపాలని స్టాలిన్ లేఖలో కోరారు.