జాతీయ భద్రతా సంస్థ (ఎన్ఐఏ) జమ్ముకశ్మీర్లో మెరుపుదాడులకు దిగింది. ఉగ్రవాదుల నెట్వర్క్ను ధ్వంసం చేయడమే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్లు తెలుస్తోంది.ఉగ్రవాదులు ఏర్పాటు చేసుకున్న సదుపాయాలను నిర్వీర్యం చేసేందుకు ఈ దాడులు జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. జమ్మూ, కశ్మీర్లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ అధుకారులు ఏకకాలంలో దాడులకు దిగారు.
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, యువతను ఉగ్రవాదంలోకి ఆకర్షించడం వంటి కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే కీలక సమాచారంతో ఎన్ఐఏ ఈ దాడులకు దిగింది. జమ్మూలోని గుజ్జర్ నగర్, షహీదు చౌక్ ప్రాంతాల్లో దాడులు కొనసాగుతున్నాయి. ఓ ప్రైవేటు పాఠశాల యజమానికి ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనే సమాచారంతో దాడులు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.
నిషేధిత ఉగ్ర సంస్థ జమాత్ ఏ ఇస్లామీ జమ్ము అండ్ కశ్మిర్కు చెందిన ఇద్దరు మాజీ నాయకుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. జమాత్ మాజీ అధ్యక్షుడు షేక్ గులామ్ హసాన్, మరో నాయకుడు సాయర్ అహ్మద్ రేషి ఇళ్లలో కూడా ఎన్ఐఏ దాడులు చేసింది.