లోకకల్యాణం
కోసం తిరుమలలో అయోధ్యకాండ అఖండ పారాయణం జరగనుంది. తిరుమలలోని నాదనీరాజనం కళావేదికపై
ఫిబ్రవరి 11న ఆదివారం 7వ
విడత అయోధ్యకాండ అఖండ పారాయణం జరుగనున్నట్లు టీటీడీ తెలిపింది. ఉదయం 7
నుండి 9 గంటల వరకు జరుగనున్న ఈ కార్యక్రమాన్ని ఎస్వీబీసీ ఛానల్ లో
ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.
అయోధ్యకాండలోని 22 సర్గ నుంచి 25 వరకు మొత్తం నాలుగు సర్గల్లో 155
శ్లోకాలు పారాయణ చేస్తారు. యోగవాశిష్టం,
ధన్వంతరి మహామంత్రంలోని 25
శ్లోకాలు కలిపి మొత్తం 180 శ్లోకాలను పారాయణం చేయనున్నట్లు టీటీడీ ఓ
ప్రకటన జారీ చేసింది.
ఎస్వీ
వేదవిఙ్ఞాన పీఠం, ఎస్వీ వేదవిశ్వవిద్యాలయం, టీటీడీ
వేదపండితులు, టీటీడీ సంభావన పండితులు, శ్రీ
అన్నమాచార్య ప్రాజెక్ట్, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం పండితులు ఈ పారాయణ కార్యక్రమంలో
భాగస్వాములు అవుతారు.
ఎస్వీబీసీ ఛానల్ ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించడం ద్వారా శ్రీవారికృపకు
పాత్రులు కావాలని టీటీడీ ఆకాంక్షించింది.