భారత రక్షణ రంగ చరిత్రలో నూతన అధ్యాయం మొదలైంది. మేకిన్ ఇండియాలో భాగంగా రక్షణరంగానికి అవసరమైన ఆయుధాల తయారీలో ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా హైదరాబాద్ కేంద్రంగా అదానీ ఎల్బిట్ అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ ఇండియా లిమిటెడ్ తయారు చేసిన హీర్మేస్ 900 మానవ రహిత డ్రోన్‌లను ఇజ్రాయెల్‌కు ఎగుమతి చేశారు.
అత్యాధునిక హీర్మేస్ 900 డ్రోన్‌లు (hermes dronews) అధిక పనితీరుగల సెన్సార్‌లు కలిగి ఉంది. భూమి, సముద్రంపై లక్ష్యాలను గుర్తించి దాడులు చేయడంలో కీలక పాత్ర పోషించనున్నాయి. అదానీ డిఫెన్స్, ఇజ్రాయెల్‌కు చెందిన ఎల్బిట్ సిస్టమ్స్ జాయింట్ వెంచర్‌లో ఈ మానవరహిత డ్రోన్లను తయారు చేశారు.
2018లో హైదరాబాద్ కేంద్రంగా అదానీ కంపెనీ 50 వేల అడుగుల చదరపు విస్తీర్ణంలో ఈ ఫెసిలిటీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. మొదటి విడతో 20 డ్రోన్లను ఎగుమతి చేశారు. దేశ సరిహద్దుల్లో నిఘాను కట్టుదిట్టం చేసేందుకు ఈ డ్రోన్లు సహాయపడతాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. డ్రోన్ల తయారీలో భారత్ రాబోయే రోజుల్లో ప్రపంచంలోనే బలీయమైన శక్తిగా ఎదగనుందని భావిస్తున్నారు.