ఆంధ్రప్రదేశ్
లోని పాలక, ప్రతిపక్ష రాజకీయాలు కేంద్రప్రభుత్వ అధికార పార్టీ బీజేపీ చుట్టూ
తిరుగుతున్నాయి. బీజేపీ అండదండల కోసం వైసీపీ, టీడీపీ వెంపర్లాడుతున్న పరిస్థితి
నెలకొంది. బీజేపీ తమతో ఉందంటే కాదు కాదు మేము ఎన్డీయే కూటమి అని చెప్పుకునేందుకు
ఉవ్విళ్ళూరుతున్నాయి. భారతీయ జనతా పార్టీ అగ్రనేతలను ప్రసన్నం చేసుకునేందుకు
వైసీపీ, టీడీపీ అధినేతలు దిల్లీ పర్యటనకు వెళ్ళడమే ఈ పరిణామాలకు తార్కాణం.
కేంద్రహోంమంత్రి,
బీజేపీ అగ్రనేత అమిత్ షా, భారతీయ జనతాపార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు
భేటీ అయిన కొన్నిగంటల వ్యవధిలోనే ప్రధాని మోదీతో వైసీపీ అధినేత, సీఎం జగన్
అపాయింట్మెంట్ ఖరారైంది.
ఎన్డీయే
కూటమిలో చేరేందుకు టీడీపీ అధ్యక్షుడు సిద్ధమైనప్పటికీ సీట్ల సర్దుబాటులో భాగంగానే
వ్యవహారం ఇంకా నలుగుతోందనే వాదన కూడా ఉంది.
అందివచ్చిన అవకాశాన్ని వాడుకుని ఎక్కువ సంఖ్యలో సీట్లు తీసుకుంటే పార్టీ
బలపడుతుందని బీజేపీలోని ఓ వర్గం నేతల ఆలోచన. మరో వర్గం మాత్రం గెలిచినా ఓడినా
సొంతంగా పోటీ చేయడమే మేలు అని భావిస్తోంది.
బీజేపీతో
టీడీపీ పొత్తు ఇంకా ఓ కొలిక్కి రాకముందే వైసీపీ కూడా తనదైన ప్రయత్నాలు
మొదలెట్టింది.
వచ్చే
ఎన్నికల్లో ఎన్డీయే కూటమి 400 పైచిలుకు సీట్లలో గెలవాలనేది ప్రధాని మోదీ లక్ష్యం.
అందుకోసం పాతమిత్రులతో పాటు, అంశాల వారీగా పార్లమెంటులో తమకు మద్దతు ఇస్తున్న
పార్టీలను కూటమిలోకి ఆహ్వానిస్తున్నారు.
ఇప్పటికే
బిహార్ లో నితీశ్ కుమార్, కర్ణాటకలో దేవెగౌడ ఎన్డీయేలో భాగస్వాములయ్యారు. 2014లో
ఎన్డీయే లో టీడీపీ భాగస్వామిగా ఉంది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా
ఇవ్వలేదంటూ బయటకు వచ్చి రాజకీయంగా చావుదెబ్బ తింది. 2019 ఎన్నికల్లో ఒంటరిగా పోటీ
చేసి రాజకీయంగా పేలవ ప్రదర్శన మూటగట్టుకుంది. దీంతో ఈసారి ఆ తప్పు చేయకూడదని
చంద్రబాబు, ఆయన శ్రేయోభిలాషులు భావిస్తున్నారు.
రాజ్యసభలో
కీలక బిల్లుల సమయంలో మద్దతు పలికిన వైసీపీని గతంలోనే ఎన్డీయే ప్రభుత్వంలోకి ఆహ్వానించినట్లు
వార్తలొచ్చాయి. జగన్ మాత్రం మైనారిటీల ఓట్లకు గండిపడిందేమోననే లెక్కలతో కూటమిలో
చేరకుండానే అవసరమైనప్పుడు మాత్రం అడగకుండానే మద్దతు పలుకుతున్నారు.
వచ్చే
ఎన్నికలు టీడీపీ మనుగడకు చావుబతులకు సమస్య అని అందుకే ఆ పార్టీ పొత్తుల కోసం
వెంపర్లాడుతోందని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. పొత్తుల కోసం టీడీపీలా దేబిరించాల్సిన
పరిస్థితి తమకు లేదంటున్నారు.
బీజేపీతో
పొత్తు పెట్టుకున్న ప్రతీసారి టీడీపీ విజయం సాధించింది. దీంతో వచ్చే ఎన్నికల్లో
కాషాయ పార్టీ తో స్నేహం కోసం చంద్రబాబు మళ్ళీ సిద్ధమయ్యారు. రాష్ట్రంలో బీజేపీకి
ఒక్కశాతమే ఓట్లు ఉన్నప్పటికీ వైసీపీని ఓడించి అధికారంలోకి వచ్చేందుకు కమలం పార్టీ
బలం చాలా చాలా అవసరం. అయితే బీజేపీ మాత్రం ఈ సారి ఆంధ్రాలో తమకు 8 ఎంపీ సీట్లు కేటాయించాలని
అడుగుతున్నట్లు చర్చ జరుగుతోంది. అందుకే టీడీపీ అధినేత, పొత్తు విషయంలో డైలమాలో పడ్డట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
శాసనసభ
ఎన్నికల్లో వైసీపీ ని ఓడించేందుకు టీడీపీకి, జనసేన, బీజేపీ బలం అవసరం కాబట్టి, ఆ
మేరకు లోక్సభ సీట్లను చంద్రబాబు త్యాగం చేయాల్సి రావచ్చు.
బీజేపీ-టీడీపీ పొత్తు కుదరకూడదని వైసీపీ భావిస్తోంది.
రాష్ట్రంలో ప్రత్యర్థులు విడివిడిగా ఉంటేనే తమకు మేలు జరుగుతుందని అంచనా
వేస్తోంది. పైకీ మాత్రం, రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, కమ్యూనిస్టుల ఉనికి లేదంటూ
వైసీపీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది.