What our judiciary says about Uniform Civil Code
ఉమ్మడి పౌరస్మృతిని ప్రధానంగా
వ్యతిరేకిస్తున్నది ముస్లిములు. ఆ ఓటుబ్యాంకు తరిగిపోతుందని ఆందోళన చెందే రాజకీయ
పక్షాలు ఇన్నాళ్ళూ యూసీసీకి అడ్డం పడ్డాయి. యూసీసీ అమలు చేస్తే తమ మతానికి చెందిన
ఆచార సంప్రదాయాలకు అడ్డమంటూ ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు దుష్ప్రచారం
చేస్తున్నారు. నిజానికి యూసీసీ అంత వివక్షాపూరితమైనదైతే అంబేద్కర్ సహా రాజ్యాంగకోవిదులు
దాన్ని రాజ్యాంగంలో ఎందుకు పొందుపరిచారు? అంతటి వివక్షే ఉంటే న్యాయవ్యవస్థ ఎందుకు
యూసీసీని అమలు చేయాలని సూచిస్తుంది?
ఉమ్మడి పౌరస్మృతిపై న్యాయవ్యవస్థ ఏమందో
చూడడానికి ముందు ఆ చట్టాన్ని ముస్లిం మతపెద్దలు, రాజకీయ నాయకులు ఎందుకు
వ్యతిరేకిస్తున్నారు, అసలు వివక్ష చూపుతున్నది ఎవరో తెలుసుకోవాలంటే షాబానో కేసు
పూర్వాపరాలు చూడాలి.
షాబానో కేసు
1978లో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు
చెందిన షాబానో బేగం అనే నిరక్షరాస్యురాలైన ముస్లిం మహిళ తన భర్త మహమ్మద్ అహ్మద్
ఖాన్ మీద స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అప్పటికి ఆమె వయసు 62
ఏళ్ళు. వారి వివాహమై 40 ఏళ్ళు గడిచిపోయాయి. వారికి ఐదుగురు పిల్లలు ఉన్నారు. ఆ
వయసులో షాబానోకు ఆమె భర్త తలాక్ చెప్పేసాడు. దానికి వ్యతిరేకంగా ఆమె
కోర్టుకెక్కింది. అయితే కోర్టు, షాబానోకు నెలకు రూ.25 మనోవర్తి చెల్లించమని ఆదేశించింది.
స్థానిక కోర్టు తీర్పుతో సంతృప్తి చెందని
షాబానో, మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మనోవర్తి మొత్తాన్ని నెలకు
రూ.179.20పైసలకు పెంచింది. అయితే ఆ మొత్తాన్ని చెల్లించడానికి భర్త ఒప్పుకోలేదు.
దాంతో ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరుకుంది. 1995 ఏప్రిల్‌లో సుప్రీంకోర్టు షాబానోకు
అనుకూలంగా తీర్పునిచ్చింది. మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించింది. ఆ
తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఉన్న న్యాయమూర్తులు – డివై చంద్రచూడ్,
రంగనాథ్ మిశ్రా, డిఎ దేశాయ్, ఒ చిన్నప్ప రెడ్డి, ఇఎస్ వెంకట్రామయ్య.
షాబానోకు ఆమె భర్త తలాక్ చెప్పడంతో ఆమె మనోవర్తి
కోసం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది. అక్కడ షాబానో భర్త, మనోవర్తికి
సంబంధించిన సీఆర్‌పీసీ సెక్షన్ 125 ముస్లిములకు వర్తించదు అని వాదించాడు. ఆ వాదనను
కోర్టు తిరస్కరించింది. సెక్షన్ 125 భారతదేశ ప్రజలందరికీ వర్తిస్తుందని స్పష్టం
చేసింది. ఆ చట్టానికి మతాలతోనూ, ‘పెర్సనల్ లా’స్ తోనూ సంబంధం లేదని వివరించింది. ఆ
సందర్భంగా సుప్రీంకోర్టు కేంద్రప్రభుత్వానికి, ఉమ్మడి పౌరస్మృతి గురించి చెప్పే భారత
రాజ్యాంగంలోని 44వ అధికరణాన్ని గుర్తు చేసింది. అంతేకాదు, ఉమ్మడి పౌరస్మతిని
రూపొందించడానికి కేంద్రప్రభుత్వం ఎలాంటి ప్రయత్నాలూ చేయకపోవడం బాధాకరం అని
వ్యాఖ్యానించింది కూడా.
ఆ సందర్భంలో సుప్రీంకోర్టు ఇలా అంది,
‘‘రాజ్యాంగంలోని 44వ అధికరణం చచ్చుబడిపోయింది. ఈ దేశానికి ఉమ్మడి పౌరస్మతిని
రూపొందించేందుకు ఎలాంటి అధికారిక కార్యకలాపాలూ చేపట్టినట్టు ఎలాంటి ఆధారాలూ లేవు. విరుద్ధమైన
భావజాలాలకు వేర్వేరు విధేయతలు ప్రకటించే చట్టాలను తొలగించడం ద్వారా జాతీయ
సమైక్యతను సాధించాలన్న లక్ష్యానికి ఉమ్మడి పౌరస్మృతి సహాయపడుతుంది. ఈ దేశ పౌరుల
కోసం ఉమ్మడి పౌరస్మతికి రూపకల్పన చేయవలసిన బాధ్యత ప్రభుత్వానిదే. చట్టపరంగా ఆ
అధికారం కూడా ప్రభుత్వానికే ఉందనడంలో సందేహమే లేదు. రాజ్యాంగానికి ఏమాత్రం విలువ ఉన్నా
ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పన దిశగా ఒక ముందడుగు వేయాల్సిందే.’’
కానీ, అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ
కొందరు మతఛాందసవాదుల ఒత్తిడికి లొంగిపోయి సుప్రీంకోర్టు నిర్ణయాన్ని తిరగ్గొట్టారు.
1986 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎకె సేన్ ఒక కొత్త బిల్లును
పార్లమెంటులో ప్రవేశపెట్టారు. పూర్తి మెజారిటీ ఉన్న కాంగ్రెస్ ఆ బిల్లును పాస్
చేసేసుకుంది. కానీ ఆ సమయంలో జరిగిన చర్చోపచర్చలను ప్రతీ ఒక్కరూ చదవాల్సిందే. ఆ
బిల్లును కమ్యూనిస్టు పార్టీలు సైతం వ్యతిరేకించాయి. మహిళల హక్కుల కోసం మాత్రమే
కాక ఉమ్మడి పౌరస్మతిని అమల్లోకి తీసుకురావాలంటూ వారు ఐకమత్యంగా బలంగా డిమాండ్
చేసారు.
రాజీవ్ గాంధీ ప్రభుత్వం తెచ్చిన బిల్లును
సీపీఎం నేత సైఫుద్దీన్ చౌధురి తీవ్రంగా వ్యతిరేకించారు. ‘‘ఇదొక నల్ల బిల్లు. దాని
పేరు కూడా తప్పుదోవ పట్టించేలా ఉంది. ఈ బిల్లు ముస్లిం మహిళల హక్కులను
కాపాడుతుందని చెబుతున్నారు. నిజానికి ఈ బిల్లు ముస్లిం మహిళల హక్కులను కాలరాచివేస్తుంది.
భారతదేశాన్ని లౌకిక రాజ్యంగా తీర్చిదిద్దాలని చెప్పే భారత రాజ్యాంగపు ప్రవేశికను ఈ
బిల్లు ధిక్కరించింది’’ అంటూ మండిపడ్డారు.
సీపీఐ సీనియర్ నేత, 12సార్లు లోక్‌సభ
ఎంపీ అయిన ఇంద్రజిత్ గుప్తా సైతం ఆ బిల్లును వ్యతిరేకించారు. ‘‘ఉమ్మడి పౌరస్మృతిని
తక్షణమే రూపొందించుకోడానికి మనకు కుదరకపోవచ్చు. అందులో ఇబ్బందులున్నాయి, అర్ధం
చేసుకోగలను. కానీ ఉమ్మడి పౌరస్మృతి దిశగా ప్రభుత్వం ప్రయాణించాలి, దానికి వ్యతిరేక
దిశలో కాదు. ఉమ్మడి పౌరస్మృతి రూపకల్పనకు చాలా సమయం పట్టవచ్చు, ఆ ప్రయాణంలో ఎన్నో అడ్డంకులు
ఉండిఉండొచ్చు, ఎన్నో కష్టాలు రావచ్చు. కానీ ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లు మనల్ని కామన్
సివిల్ కోడ్ వైపు కాకుండా, దానికి వ్యతిరేక దిశలో తీసుకువెడుతుంది’’ అని ఆవేదన
వ్యక్తం చేసారు.
అలా…. షాబానో కేసులో సుప్రీంకోర్టుతో
పాటు ప్రధాన కమ్యూనిస్టు పార్టీలు రెండూ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా
స్పందించాయి.
ఇతర ప్రధాన న్యాయ నిర్ణయాలు
(1) 1973లో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎంఎచ్ బేగ్,
బహుభార్యాత్వాన్ని నిషేధించాలని, విడాకుల కేసుల్లో న్యాయపరమైన జోక్యం ఉండాలనీ
సిఫార్సు చేసారు. మార్చి 1973లో కేరళ హైకోర్టు జస్టిస్ వి ఖలీద్ కూడా మహిళల
హక్కులను సంస్కరించడంపై దృష్టి సారించాలని ముస్లిములకు విజ్ఞప్తి చేసారు.
(2) 1973లో కేశవానంద భారతి
వెర్సెస్ కేరళ ప్రభుత్వం కేసులో కోర్టు ‘‘భారత భూభాగం అంతటా దేశ పౌరులందరికీ
వర్తించేలా ఉమ్మడి పౌరస్మృతికి రూపకల్పన చేయాలని 44వ అధికరణం స్పష్టంగా చెబుతోంది. అది వాంఛనీయం
కూడా. కానీ ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ప్రభుత్వం ఎలాంటి ప్రభావవంతమైన చర్యలూ
తీసుకోలేకపోతోంది. ఈ దేశ ఐక్యత, సమైక్యతలను సాధించడం అత్యావశ్యకమే అయినప్పటికీ
దానికోసం తప్పనిసరి అయిన ఉమ్మడి పౌరస్మృతిని రూపొందించాలని ప్రభుత్వాన్ని ఏ న్యాయస్థానమూ
బలవంతపెట్టలేదు’’ అని చెప్పింది.
(3) 1985 మే 10న మిస్ జోర్డాన్ డెంగ్‌డే వెర్సెస్ ఎస్ఎస్ చోప్రా కేసులో
సుప్రీంకోర్టు ‘‘రాజ్యాంగపు 44వ అధికరణం సూచించినట్లు, వివాహాలు, విడాకుల విషయంలో
యూనిఫాం కోడ్‌ను రూపొందించడం విషయంలో న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోవలసిన తరుణం
ఆసన్నమైంది. జంటల మధ్య బాధాకరమైన పరిస్థితులను తొలగించడానికి ఒక చట్టాన్ని
తీసుకురావలసిన సమయం వచ్చింది. అన్ని కేసుల్లోనూ విడాకులు మంజూరు చేయడానికి వివాహ
బంధ విచ్ఛిన్నం, పరస్పర అంగీకారాలను ప్రాతిపదికలుగా చూపించడం తప్పనిసరి’’ అని
వ్యాఖ్యానించింది.
(4) 1995 మే 10న సరళా ముద్గల్ వెర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో
సుప్రీంకోర్టు అప్పటి ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు వ్యతిరేకంగా తీర్పునిచ్చింది.
44వ అధికరణాన్ని పునఃపరిశీలించాలని కోరింది. జస్టిస్ కులదీప్ సింగ్, జస్టిస్ ఆర్ఎం
సహాయ్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ‘‘భారత రాజ్యాంగంలోని 44వ అధికరణాన్ని అమలు
చేయవలసిన రాజ్యాంగ బాధ్యతను ఇప్పటివరకూ అధికారంలో ఉన్న అన్ని ప్రభుత్వాలూ దిగ్విజయంగా
వదిలిపెట్టేసాయి’’ అని వ్యాఖ్యానించింది. ఆ చారిత్రాత్మక తీర్పులో సుప్రీంకోర్టు,
ఉమ్మడి పౌరస్మృతిని అమల్లోకి తేవడానికి భారత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో
తెలియజేస్తూ 1996 ఆగస్టులోగా కేంద్ర న్యాయశాఖ ద్వారా అఫిడవిట్ దాఖలు చేయాలని
కేంద్రాన్ని అర్ధించింది.
(5) మరో కేసు తీర్పులో 2015 జులై 6న సుప్రీంకోర్టు ‘‘మన రాజ్యాంగంలోని
ఆదేశ సూత్రాల్లో ఉమ్మడి పౌరస్మృతి ఉందన్న విషయాన్ని విస్మరించడానికి మేము
వ్యతిరేకం. కానీ అది ఏమాత్రం పరిగణనలోకి తీసుకోబడని రాజ్యాంగ సూచనగా మిగిలిపోయింది’’
అని ఆవేదన వ్యక్తం చేసింది.
(6) ఇంకో కేసు తీర్పు సందర్భంగా 2019 సెప్టెంబర్ 13న సుప్రీంకోర్టు ‘‘రాజ్యాంగం
4వ భాగంలోని 44వ అధికరణంలో ఉన్న ఆదేశసూత్రాల్లో, భారత భూభాగం అంతటా అమలయ్యేలా దేశపౌరులు
అందరికీ ఒకే ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని రాజ్యాంగ రూపకర్తలు ఆశించారు, కానీ ఆ దిశగా
ఇప్పటివరకూ కనీసం ఒక్క అడుగైనా వేయలేదు’’ అని గమనించింది.
వీటన్నిటినీ గమనిస్తే….
ఉమ్మడి పౌరస్మృతి విషయంలో, దేశాన్ని అతి ఎక్కువ కాలం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ
వైఖరి, స్పష్టంగా అర్ధమవుతుంది. ముఖ్యంగా ముస్లిముల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ
దేశ ప్రయోజనాలను ఎలా తాకట్టు పెట్టింది, ఉమ్మడి పౌరస్మృతిని ఎలా మూలకు నెట్టేసింది
అన్న విషయం తేటతెల్లమవుతుంది. ఒక వృద్ధ ముస్లిం మహిళకు సహాయం చేయడానికి సైతం
కాంగ్రెస్ ప్రభుత్వాలు వెనుకడుగు వేసిన సంగతి తెలుస్తుంది. దేశానికి స్వతంత్రం
వచ్చిన నాటినుంచి నేటివరకూ ఎప్పటికప్పుడు న్యాయస్థానాలు ఉమ్మడి పౌరస్మృతి
ఆవశ్యకతను ఎలుగెత్తి చాటుతున్నా విస్మరించిన వైఖరి కళ్ళకు కడుతుంది. కేవలం కొందరు
ముస్లిం ఛాందస మతపెద్దలను బుజ్జగించడానికి, వారి చేతిలో ఉందనుకునే ఓటుబ్యాంకు కోసం…
అన్నివర్గాల ప్రజలకూ ప్రయోజనకరమైన ఉమ్మడి పౌరస్మృతిని కాలరాసేసిన దుర్నీతి అవగతమవుతుంది.