Rahul Gandhi says Modi is not OBC, Center shows evidence
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీ
కులంపై చేసిన వ్యాఖ్యలకు కేంద్రప్రభుత్వం స్పందించింది. మోదీ ఓబీసీ కులానికి
చెందినవారు కాదనీ, ఐనా ఓబీసీ అని చెప్పుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారనీ రాహుల్
ఆరోపించారు. దాంతో కేంద్రం మోదీ కులానికి చెందిన ఆధారాలు చూపించింది.
ఒడిషాలో భారత్ జోడో న్యాయ యాత్ర చేస్తున్న రాహుల్
గాంధీ, మోదీ ఓబీసీ కులంలో పుట్టలేదని ఆరోపించారు. ‘‘మోదీ ఘాంచీ కులంలో పుట్టారు. అది అప్పట్లో
వెనుకబడిన కులం కాదు. తర్వాత గుజరాత్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ కులాన్ని
ఓబీసీల్లో చేర్చారు’’ అని రాహుల్ గాంధీ అన్నారు. దానికి జవాబుగా కేంద్రప్రభుత్వం
‘‘ప్రధానమంత్రి కులం మీద రాహుల్ గాంధీ ప్రకటనకు సంబంధించి వాస్తవాలు’’ అంటూ ఒక
ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటనలో ‘‘గుజరాత్ ప్రభుత్వపు సామాజికంగా, విద్యాపరంగా,
ఇతరత్రా వెనుకబడిన కులాల జాబితాలో మోద్ ఘాంచీ కులం, అందులో మోదీ పుట్టిన ఉపకులం
ఉన్నాయి’’ అని వెల్లడించింది.
‘‘గుజరాత్‌లో సర్వే నిర్వహించిన తర్వాత మండల్
కమిషన్ ఓబీసీల జాబితా రూపొందించింది. అందులో మోద్ ఘాంచీ కులాన్ని కూడా చేర్చింది.
భారత ప్రభుత్వపు ఓబీసీ కులాల జాబితాలో గుజరాత్‌కు సంబంధించిన 105 కులాలున్నాయి.
వాటిలో మోద్ ఘాంచీ కులం కూడా ఉంది’’ అని ఆ ప్రకటన వివరించింది.
ఓబీసీల జాబితాలో మోద్ ఘాంచీ కులాన్ని చేర్చాలన్న
నోటిఫికేషన్ 1994 జులై 25న విడుదలైంది. అప్పుడు గుజరాత్ కాంగ్రెస్ పాలనలో ఉంది. భారత
ప్రభుత్వం 2000 ఏప్రిల్ 4న విడుదల చేసిన నోటిఫికేషన్‌లో మోద్ ఘాంచీ కులాన్ని
ఓబీసీల జాబితాలో చేర్చింది. ఆ రెండు సందర్భాల్లోనూ నరేంద్రమోదీ అధికారంలో లేరు’’
అని స్పష్టం చేసింది.
ప్రధానమంత్రి కులం గురించి రాహుల్ గాంధీ
వ్యాఖ్యలు చేయడానికి కారణం కులాల వారీగా జనగణన చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుండడమే.
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే జాతీయస్థాయిలో కులగణన చేపడతామనీ,
రిజర్వేషన్ల మీద సుప్రీంకోర్టు విధించిన 50శాతం పరిమితిని తొలగిస్తామనీ రాహుల్ ఇటీవలే
ప్రకటించారు.
ఈ సోమవారం నాడు రాహుల్
గాంధీ ప్రధానమంత్రి నరేంద్రమోదీని విమర్శించే
క్రమంలో ‘‘ఓబీసీలు, దళితులు, గిరిజనులకు హక్కులు ఇవ్వవలసి వచ్చినప్పుడు
మోదీజీ కులాలు లేవు అంటారు. ఓట్లు పొందడానికి ప్రచారం చేసేటప్పుడు మాత్రం మోదీ తాను
ఓబీసీనని చెప్పుకుంటారు’’ అన్నారు. దానికి ప్రతివిమర్శగా ప్రధానమంత్రి బుధవారం
నాడు రాజ్యసభలో స్పందించారు. కాంగ్రెస్ మహానేత, దేశపు మొదటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్
నెహ్రూ ఏనాడూ రిజర్వేషన్లకు మద్దతివ్వలేదని గుర్తుచేసారు. ‘‘ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు
ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇస్తే ప్రభుత్వోద్యోగుల పని నాణ్యత పడిపోతుందని నెహ్రూ
చెప్పేవారు. ఆయన తన హయాంలో ఉద్యోగ నియామకాలు సైతం నిలిపేసారు. నెహ్రూజీ చెప్పిన
మాటలనే కాంగ్రెస్ ఇన్నాళ్ళూ ఆచరిస్తూ వచ్చింది. ఎస్సీ ఎస్టీ వర్గాలకు కాంగ్రెస్
ఎప్పుడూ వ్యతిరేకమే అంటూ మోదీ విరుచుకుపడ్డారు.