What are the main points in the Uttarakhand UCC?
భారతదేశంలో ఉమ్మడి పౌరస్మృతిని (యూసీసీ)
అమల్లోకి తీసుకొస్తున్న మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఆ రాష్ట్రంలో
అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక శాసనసభ సమావేశాలు ఏర్పాటు చేసి మరీ యూసీసీని ఆమోదించింది. ఇంతకీ ఆ చట్టంలో ఏముందో
తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్ ఉమ్మడి పౌరస్మృతి చట్టం 2024
ఆ రాష్ట్రంలో వివాహాలు, విడాకులు, వంశ పారంపర్య వారసత్వం, సహజీవనం వంటి అంశాలపై
ఉండే చట్టాలను ఒక గొడుగు కిందకు తెస్తుంది. అది ఉత్తరాఖండ్ రాష్ట్ర పౌరులందరికీ
వర్తిస్తుంది. రాష్ట్రం బైట నివసించే ఉత్తరాఖండ్ పౌరులు కూడా ఈ చట్టం పరిధిలోకి
వస్తారు. భారత రాజ్యాంగంలో 366(25), 342 అధికరణాల కింద ప్రత్యేక రక్షణ కలిగిన
షెడ్యూల్డు తెగల వారికి మాత్రం మినహాయింపు ఉంది. అలాంటి ఎస్టీలు రాష్ట్ర జనాభాలో
3శాతం మంది ఉన్నారు.
వివాహం, విడాకులు
ఈ చట్టం ప్రకారం పౌరులు ఒక్క వివాహం
మాత్రమే చేసుకోవాలి. వివాహానికి కనీస వయసు పురుషులకు 21 ఏళ్ళు, స్త్రీలకు 18 ఏళ్ళు.
బహుభార్యాత్వం, బాల్యవివాహాలు నిషిద్ధాలు. అయితే పౌరులు తమతమ మత సంప్రదాయాలు,
ఆచారాలకు అనుగుణంగా పెళ్ళి వేడుకలు జరుపుకోవడాన్ని ఈ చట్టం గౌరవిస్తుంది,
అనుమతిస్తుంది.
2010 మార్చి 26, ఆ తర్వాత పెళ్ళి చేసుకున్న వారు తమ పెళ్ళిని రిజిస్టర్ చేసుకోవడం
తప్పనిసరి. ఇప్పటికే వివాహాన్ని రిజిస్టర్ చేసుకున్నవారు మళ్ళీ చేసుకోనక్కరలేదు.
విడాకులు లేదా
వివాహ రద్దు డిక్రీ సందర్భంలో ఇరు పక్షాల వారు లేదా కనీసం ఒకరు తప్పనిసరిగా రాష్ట్రప్రభుత్వం
నిర్దేశించిన నమూనాలో ఒక డాక్యుమెంట్‌ను భర్తీ చేసి సంతకం పెట్టాలి. దాన్ని సంబంధిత
అధికారికి అందేలా చేయాలి.
విడాకులు
తీసుకున్న వ్యక్తులు మళ్ళీ పెళ్ళి చేసుకోవాలనుకుంటే దానికి ఎలాంటి అనుమతీ
అక్కరలేదు.
వివాహాల రద్దు
అనేది కేవలం ఈ చట్టంలో పొందుపరిచిన అంశాలకు అనుగుణంగా మాత్రమే జరుగుతుందని ఈ చట్టం
స్పష్టం చేస్తుంది. వివాహ రద్దు కోసం ఏ ఆచారాలు, పద్ధతులు, ‘పర్సనల్ లా’లను
అనుసరించడాన్ని చట్టం గుర్తించదు. కేవలం ఈ చట్టంలో నిర్దేశించిన విధి విధానాలను
పాటించడం ద్వారానే వివాహాన్ని రద్దు చేసుకోవడం కుదురుతుంది.
బాల్యవివాహాలు,
బహుభార్యాత్వం వంటి విధానాల్లో జరిగే పెళ్ళిళ్ళు చెల్లవు. కానీ అలాంటి వివాహం
ద్వారా కలిగే సంతానం చట్టబద్ధమైన సంతానంగానే పరిగణించబడుతుంది.
పెళ్ళిళ్ళు,
విడాకుల రిజిస్టర్లను నిర్వహించడానికి రాష్ట్రమంతటికీ ఒక రిజిస్ట్రార్ జనరల్‌ను, రాష్ట్రంలోని
వేర్వేరు ప్రాంతాలకు సబ్ రిజిస్ట్రార్లను రాష్ట్రప్రభుత్వం నియమిస్తుంది.
పెళ్ళి జరిగిన
60 రోజులలోగా రిజిస్టర్ చేసుకోకపోతే ఆ జంటకు రూ.10వేల జరిమానా విధిస్తారు. ఐతే
రిజిస్టర్ చేసుకోని కారణంతో వారి పెళ్ళి రద్దయిపోదు. యుక్తవయసు రాకుండా పెళ్ళి
చేసుకునే యువతీ యువకులకు 6 నెలలు జైలుశిక్ష, గరిష్టంగా రూ.50వేల వరకూ జరిమానా
విధించవచ్చు. ఉమ్మడి పౌరస్మృతిలోని నియమనిబంధనలకు లోబడి కాకుండా విడాకులు ఇవ్వడం
శిక్షించదగిన నేరం. దానికి గరిష్టంగా 3 సంవత్సరాల జైలుశిక్ష విధించవచ్చు. విడాకుల
తరవాత మళ్ళీ పెళ్ళి చేసుకోవడానికి వ్యక్తులకు స్వేచ్ఛ ఉంటుంది. ఫలానా వ్యక్తినే
పెళ్ళి చేసుకోవాలి అన్న ఆంక్షలు వర్తించవు. అలా నిర్బంధించి చేసే పెళ్ళిళ్ళు, అంటే ‘నిఖా హలాలా’
వంటి పద్ధతులకు పాల్పడితే 3ఏళ్ళ వరకూ జైలుశిక్ష, రూ. లక్ష వరకూ జరిమానా
విధించవచ్చు. భరణం విషయానికి వస్తే మహర్, కట్నం, స్త్రీధనం, లేదా మరే ఇతర ఆస్తుల
పంపకాలతో సంబంధం లేకుండా న్యాయస్థానం నిర్ణయించినంత భరణాన్ని చెల్లించాలి.
విడాకుల వేళ మైనర్
పిల్లల కస్టడీ విషయంలో న్యాయస్థానం ఆ పిల్లల పరిస్థితిని బట్టి తగిన నిర్ణయం
తీసుకుంటుంది. ఐతే 5ఏళ్ళ లోపు పిల్లలను మాత్రం తల్లి వద్దనే పెరగనిస్తారు.
వంశపారంపర్య వారసత్వం
ఎవరైనా వ్యక్తి వీలునామా రాయకుండా మరణిస్తే
వారి ఆస్తి యూసీసీ నియమ నిబంధనల ప్రకారం వారసుల మధ్య పంచబడుతుంది. అటువంటి వ్యక్తి
ఆస్తికి వారసులు ఎవరు కాగలరు అనడానికి యూసీసీ ఒక జాబితా రూపొందించింది. దాని
ప్రకారం మొదటి వరుసలో వ్యక్తి సంతానం, జీవిత భాగస్వామి, తల్లిదండ్రులు ఉంటారు.
వారెవరూ లేనిపక్షంలో అన్నదమ్ములు లేదా అక్కచెల్లెళ్ళు, వారి సంతానానికి ఆస్తి
సంక్రమిస్తుంది. వ్యక్తికి అర్హులైన బంధువులు ఎవరూ లేనిపక్షంలో ఆ ఆస్తి
ప్రభుత్వానికి చెందుతుంది.
ఆస్తి పంపకాలకు సంబంధించిన నియమాలు
ఏ వ్యక్తి అయినా వీలునామా రాయకుండా చనిపోతే
ఆ వ్యక్తి ఆస్తిని సదరు వ్యక్తి వారసులకు పంచడానికి ఈ నియమాలు పాటించాల్సి
ఉంటుంది…
1.
బ్రతికిఉన్న జీవిత
భాగస్వాములు అందరికీ ఒక్కొక్క వాటా వస్తుంది
2.
బ్రతికిఉన్న సంతానం
అందరికీ ఒక్కొక్క వాటా వస్తుంది
3.
చనిపోయిన సంతానపు
పిల్లలు అందరికీ ఒక్కొక్క వాటా వస్తుంది
4.
చనిపోయిన సంతానానికి
వచ్చే వాటా ఆ వ్యక్తి…
– బ్రతికిఉన్న జీవిత భాగస్వాములు
– బ్రతికిఉన్న సంతానం
– చనిపోయిన సంతానపు సంతానం… అందరికీ సమానంగా పంచాలి
5.
చనిపోయిన సంతానపు
చనిపోయిన సంతానానికి వచ్చే వాటా ఆ వ్యక్తి…
–
బ్రతికిఉన్న జీవిత
భాగస్వాములు
–
బ్రతికిఉన్న
సంతానం… అందరికీ సమానంగా పంచాలి
6.
బ్రతికిఉన్న
తల్లిదండ్రులకు ఒక్కొక్క వాటా వస్తుంది. వారిద్దరిలో ఒక్కరే బ్రతికిఉంటే వారికి
మాత్రమే ఒక వాటా వస్తుంది
గర్భంలోని సంతానానికి ఉండే హక్కు
ఒక వ్యక్తి వీలునామా రాయకుండా చనిపోతే
చట్టం ఆ వ్యక్తి సంతానం అందరినీ సమానంగా పరిగణిస్తుంది. సదరు వ్యక్తి చనిపోయే
సమయానికి ఆ సంతానం పుట్టిఉన్నా, తల్లిగర్భంలో ఉన్నా ఆస్తిలో ఆ సంతానానికి కూడా
హక్కు ఉంటుంది. ఆ వ్యక్తి జీవించి ఉండగా బిడ్డ పుట్టినా, పుట్టకపోయినప్పటికీ
తల్లిగర్భంలో ఉన్నా ఆ వ్యక్తి వారసత్వం ఆ బిడ్డకు వచ్చినట్లే.
వారసత్వానికి అనర్హతలు
ఒక వ్యక్తి మరణానికి ముందు వారి జీవిత
భాగస్వామి మరోపెళ్ళి చేసుకుంటే వారు వారసత్వానికి అనర్హులు. ఒక వ్యక్తిని హత్య
చేసినవారు లేదా హత్యకు సహకరించినవారు ఆ బాధితుడి/బాధితురాలి ఆస్తిలో
వారసత్వానికి అనర్హులు. అనారోగ్యం లేదా చట్టంలో చెప్పబడని మరే ఇతర కారణాలు
వారసత్వానికి అనర్హతలు కావు.
వీలునామా చెల్లుబాటు
మానసికంగా స్థిరమైన స్థితిలో ఉన్న, మైనర్
కాని వ్యక్తి ఎవరైనా వీలునామా రాయవచ్చు. అనారోగ్యం వల్ల కానీ, ఏదైనా మత్తులో ఉండడం
వల్ల కానీ తాము చేస్తున్న పనులను, వాటి పర్యవసానాలను అర్ధం చేసుకోలేని స్థితిలో
ఉండేవారు వీలునామా రాయడానికి అనర్హులు.
మరణించిన వ్యక్తి ఆస్తి రక్షణ
ఒక వ్యక్తి మరణిస్తే, వారి ఆస్తిపై హక్కు
ఉందని భావించే వ్యక్తి ఆ ఆస్తి కోసం స్థానిక న్యాయమూర్తికి దరఖాస్తు చేసుకోవచ్చు. మరెవరైనా
వ్యక్తి అదే ఆస్తిని తప్పుడు పద్ధతుల్లో స్వాధీనం చేసుకున్నా న్యాయస్థానాన్ని
ఆశ్రయించి ఊరట పొందవచ్చు. ఆస్తి పొందాల్సిన వ్యక్తి మైనర్ అయినా, లేదా తన వ్యవహారాలు
తానే చూసుకోలేనివారైనా… వారి గార్డియన్ లేదా స్నేహితుడు వారి తరఫున కోర్టును
ఆశ్రయించవచ్చు. వారి వాదన న్యాయబద్ధంగా ఉందని జడ్జి భావిస్తే, ఆస్తిని స్వాధీనం
చేసుకున్న వ్యక్తిని దాన్ని వదిలిపెట్టవలసిందిగా ఆదేశించవచ్చు. లేదా ఆ వ్యవహారంపై విచారణ
జరపడానికి అధికారిని నియమించవచ్చు.
న్యాయమూర్తి మరిన్ని నిర్ణయాలు కూడా
తీసుకోవచ్చు. ఆస్తిపై హక్కు ఎవరిదో నిర్ణయించే వరకూ క్యూరేటర్‌ను నియమించవచ్చు, ఆ
క్యూరేటర్‌కు అధికారాన్ని అప్పగించవచ్చు. రాష్ట్రప్రభుత్వం జిల్లాల వారీగా కానీ, లేదా
కొన్నిజిల్లాలకు ఒకరు చొప్పున కానీ పబ్లిక్ క్యూరేటర్లను నియమించవచ్చు. ఇద్దరు క్యూరేటర్ల
మధ్య విభేదం వస్తే, వ్యవహారాన్ని రాష్ట్ర హైకోర్టు తీసుకుంటుంది.
మరణించిన వ్యక్తికి ప్రతినిధిత్వం
ఎవరైనా ఒక వ్యక్తి చనిపోయినప్పుడు, తన
వ్యవహారాలు చూడడానికి ఆ వ్యక్తి నియమించిన వ్యక్తి, వారికి సంబంధించిన ప్రతీ విషయానికీ
చట్టబద్ధ ప్రతినిధి అవుతారు. మృతుని ఆస్తి మొత్తం ఆ ప్రతినిధికి చెందుతుంది. మృత
వ్యక్తి ఎవరికైనా బకాయి ఉంటే, ఆ వ్యక్తి ఆ బకాయి వసూలు చేసుకోవాలనుకుంటే , వారికి
ఆధారంగా ఒక పత్రం కావాలి. దాన్ని ‘ప్రొబేట్ లేదా లెటర్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్’ అంటారు.
ఆ పత్రం వారి చట్టబద్ధమైన అధికారాన్ని ధ్రువీకరిస్తుంది. అలాంటి పత్రం లేనిపక్షంలో,
మృతవ్యక్తి తమకు బకాయి ఉన్నారని నిరూపించడానికి ‘సక్సెషన్ సర్టిఫికెట్’ అనేది
కావాలి. కొన్ని రకాల రుణాలకు మాత్రమే ఈ సర్టిఫికెట్ ఉపయోగపడుతుంది.
సహజీవనం
ఉత్తరాఖండ్‌లో నివసించే పౌరులు లేదా
వ్యక్తులు సహజీవనంలో ఉంటే ఆ బంధం గురించి తమ నివాస ప్రాంతంలోని రిజిస్ట్రార్ దగ్గర
స్టేట్మెంట్ ఇవ్వాలి. అయితే భాగస్వాముల్లో ఒకరు మైనర్ అయినా, వేరొకరితో పెళ్ళి
అయినవారైనా, లేక వారిని బెదిరించో భయపెట్టో బలవంతంగానో మరేవిధంగానైనా ప్రభావితం
చేసో బంధానికి ఒప్పించినా…. ఆ సహజీవన బంధాన్ని రిజిస్టర్ చేయరు. సహజీవన బంధం
నుంచి వైదొలగాలనుకున్న వ్యక్తులు నిర్ణీత నమూనాలో రిజిస్ట్రార్‌కు స్టేట్మెంట్ ఇవ్వాలి.
సహజీవనం వల్ల పుట్టే పిల్లలు చట్టబద్ధమైన సంతానంగానే పరిగణించబడతారు.
సహజీవన బంధాలు, లేదా వాటినుంచి
వైదొలగడాలు… వాటికి సంబంధించిన స్టేట్మెంట్లతో కూడిన రిజిస్టర్‌ను రిజిస్ట్రార్
నిర్వహిస్తారు. సహజీవన బంధంలోకి ప్రవేశించిన నెలరోజుల లోగా ఆ బంధాన్ని రిజిస్టర్
చేసుకోకపోతే 3నెలల జైలుశిక్ష, గరిష్టంగా రూ.10వేల జరిమానా, లేదా రెండూ
విధించవచ్చు. స్టేట్మెంట్లో తప్పుడు సమాచారం ఇస్తే దానికి 6నెలల జైలుశిక్ష,
గరిష్టంగా రూ. 25వేల జరిమానా, లేదా రెండూ విధించవచ్చు.