సహాయ
నిరాకరణోద్యమంలో కీలక పాత్ర పోషించిన తెలుగునేత, ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు
పర్వతనేని వీరయ్య చౌదరి, ఫిబ్రవరి 8,
1970లో కన్నుమూశారు. నేడు ఆయన వర్థంతి. భారత స్వతంత్ర పోరాటంలో ఆయన
పాత్ర, బ్రిటీషు సైన్య దురాగతాలకు వ్యతిరేకంగా ఆయన సాగించిన పోరాటం, ప్రజలను సంఘటితం
చేసిన విధానం ఆద్యంతం స్ఫూర్తిదాయకం.
వీరయ్య
చౌదరి, 1886 అక్టోబర్ 4న పెదనందిపాడులో సాధారణ మధ్యతరగతి కుటుంబంలో శ్రీమతి
పర్వతనేని లక్ష్మమ్మ, వెంకయ్య దంపతులకు జన్మించారు.
చిన్నతనంలోనే
సంగీతం నేర్చుకుని హరికథ గానంలో ప్రవీణ్యం సంపాదించారు. స్వగ్రామంలో పోస్టుఫీసు,
పాఠశాల ఏర్పాటు చేశారు. సత్య హరిచంద్ర సహా పలు నాటకల్లో నటించి పేరుతెచ్చకున్నారు.
గ్రామంలోనే
ప్రాథమిక విద్యను అభ్యసించారు. మాతృభాషపై అభిమానంతో తెలుగుపై పట్టుసాధించడంతో పాటు
అపారమైన లోక జ్ఞానాన్ని సముపార్జించారు. పెద్దల దగ్గర నుంచి కొత్త విషయాలు
తెలుసుకోవడంలో బాల్యం నుంచే ఆసక్తి చూపేవారు. మంచి వక్తృత్వపు నైపుణ్యాన్ని
అలవరుచుకున్నారు.
జాతీయోద్యమంలో
మహాత్మాగాంధీ ఆశయమైన సహాయనిరాకరణ ఉద్యమంలో భాగంగా గుంటూరు జిల్లాలో మూడు ప్రధానమైన
పన్నుల నిరాకరణ ఉద్యమాలు సాగాయి. వాటిలో పెదనందిపాడు పన్నుల నిరాకరణ ఉద్యమం
ప్రధానమైనది. భారత స్వాతంత్ర్యోదమ చరిత్రలో ఈ పోరాటం అపూర్వమైన ఘట్టం.
విజయవాడలో
1922 జనవరి 7న సమావేశమైన ఆంధ్రరాష్ట్ర కాంగ్రెస్ కమిటీ, పొన్నూరులో మావేశమైన
కాంగ్రెస్ కమిటీ పన్నుల నిరాకరణోద్యమానికి పిలుపునిచ్చాయి. రైతులు పన్నులు చెల్లించకపోతే
ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని, అప్పుడు జాతీయ నాయకులతో ప్రభుత్వం రాజీకి వస్తుందనే
ఆలోచనతో ఈ ఉద్యమ ఆలోచన చేశారు.
ప్రముఖ
జాతీయోద్యమ నాయకులైన కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, ఉన్నవ లక్ష్మీనారాయణ,
మహమ్మద్ గౌస్ బేగ్, మంతెన రామరాజు, మద్ది రామకృష్ణ, కామరాజు భానుమూర్తి, వంటి
నేతలు పెదనందిపాడు ఫిర్కాలో పర్యటించి పన్నుల నిరాకరణోద్యమ ఆవశ్యకతను ప్రచారం చేశారు.
వీరి మార్గనిర్దేశంతో ఉద్యమ నిర్వహణకు పర్వతనేని వీరయ్యచౌదరి నాయకత్వం వహించారు.
ఫిర్కాలో
గ్రామాధికారుల చేత రాజీనామా చేయించారు.
గాంధీజీ
పట్ల ఆరాధనా భావంతో కొండా వెంకటప్పయ్య వంటి
నాయకుల ప్రేరణతో గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి పన్నుల వ్యతిరేక ఉద్యమం
గురించి ప్రచారం చేశారు. మధుర గంభీర కంఠస్వరంతో ఆసక్తికరమైన పాటలతో ప్రజలను చైతన్య
పరిచారు. జాతీయోద్యమ భావాలను ప్రబోధించారు.
పన్నులు
చెల్లించకపోతే ప్రభుత్వం దిగి వస్తుందన్న ఉద్యమ ఆశయాన్ని గొప్పగా ప్రచారం చేశారు.
దీంతో అప్పటి వరకు ఆ ఫిర్కాలో ఉన్న
వార్షిక శిస్తు వసూలు రూ.14.73లక్షల నుంచి రూ. 4 లక్షలకు పడిపోయింది.
ప్రభుత్వాధికారులను సాంఘిక బహిష్కరణ చేయమని ప్రజలను రెచ్చగొట్టి విజయం సాధించారు.
ప్రభుత్వం
తిరగబడకుండా నాలుగువేల మంది శాంతి సేనలతో వాలంటీర్లను ఏర్పాటు చేశారు. వారంతా
శాంతి, సంయమనం, లౌకిక దక్షతలతో వ్యవహరించేవారు. వారిని రెచ్చగొట్టేందుకు బ్రిటీషు
అధికారులు వారి ముఖాన ఉమ్మినా చిరునవ్వులు చిందిస్తూ తుడిచి వేసుకునేవారు. వారి
సహనాన్ని చూసి గుంటూరు జిల్లా అదనపు కలెక్టర్ రూధర్ ఫర్డ్ ఆశ్చర్యపోయారు.
మిలటరీ
బలగాలతో పెదనందిపాడు చేరిన కలెక్టర్, గ్రామాధికారులను సమన్వయం పరిచేందుకు చేసిన
ప్రయత్నాలు విఫలమయ్యాయి. శిస్తు చెల్లించని రైతుల ఆస్తులను జప్తు చేసే ప్రయత్నం చేశాడు.
ప్రభుత్వానికి శిస్తు చెల్లించని వారి వివరాలు చెప్పే వారే కరువయ్యారు. గ్రామంలోని ఇళ్ళ నంబర్లు
తొలగించడంతో ఏ ఇల్లు ఎవరిదో అధికారులు తెలుసుకోలేకపోయారు. ఇళ్ళకు తాళాలు వేశారు.
ఒక్కోసారి ఇంటి తాళాలు పగలగొట్టినా లోపల సామగ్రి ఉండేదికాదు.
బ్రిటీషు
అధికారులు కసితో వాళ్ళకు దొరికిన ఎద్దులు, గేదెలు, ధాన్యపు బస్తాలు, అరకలు, వంట
సామగ్రిని వేలం వేసేవారు.
అక్కడ వీరయ్య
చౌదరి ప్రభావంతో వేలంపాట పడేందుకు ఎవరూ ముందుకు వచ్చే వారు కాదు. ఆ సామగ్రిని
అతికష్టంమీద గుంటూరుకు తరలించేవారు.
కలెక్టర్
వీరయ్య చౌదరి కోసం వెదికించాడు. కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశాడు. ఆయన
చిక్కినట్లే చిక్కి క్షణాల్లో మాయమయ్యేవాడు.
ప్రజలు
అధికారుల కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని, నిషేధాజ్ఞలను ఉల్లంఘిస్తున్నారని
అనేకమందిని నిర్భందించి చిత్రహింసలు పెట్టేవారు.
మిలటరీ దళాలు రప్పించి
పెదనందిపాడు నుంచి గుంటూరు జిల్లా అంతటా విన్యాశాలు చేయించారు. అయినా ప్రజలు ఏ
మాత్రం బయపడలేదు. రాజీనామా చేసిన గ్రామాధికారులను ఉద్యోగం నుంచి తీసేస్తామని, ఆ
పదవులకు ఉన్న వంశపారంపర్యపు హక్కును తొలగిస్తామని ప్రభుత్వం బెదిరించింది. అయినా
గ్రామాధికారులు ఎవ్వరూ లొంగలేదు. కనీస విద్యార్హతల నియమాన్ని పాటించకుండా
ముస్లింలు, హరిజనులను గ్రామాధికారులుగా నియమించారు. ఈ చర్య అంతగా సఫలం కాలేదు.
వీరయ్య
చౌదరి నియమించిన శాంతిసేన వాలంటీర్లను అదుపులో పెట్టి నియంత్రిచేందుకు
ప్రతీగ్రామంలో పోలీసు దళాలను నియమించారు. శాంతిసేన వాలంటీర్లను ఎంత అమానుషంగా
కొట్టి అవమానించినా వారు ఏ మాత్రం చలించలేదు. ఎన్ని అణచివేత చర్యలు చేపట్టినా
వాలంటీర్లు, ప్రజలు సహనంతో భరించారే గాని ఉద్యమాన్ని విరమించలేదు. వీరయ్య చౌదరి
మీద ఉన్న గౌరవం అపారం.
గుంటూరు
కలెక్టర్ ‘‘ఇది శాంతియుతంగా ఉన్న బహిరంగ
విప్లవం’’ అన్నారు. బోర్డు ఆఫ్ రెవెన్యూ సభ్యుడైన హారస్ దీనిని ‘‘ శాసనోల్లంఘన ఉద్యమం
లేక సహాయ నిరాకరణోద్యమం అనడం కంటే విప్లవం అనడం సమంజసం’’గా ఉంటుందన్నారు.
అప్పటి
మద్రాసు గవర్నర్ లార్డ్ మిల్లింగ్ టన్ ఈ ఉద్యమ తీవ్రత గురించి, భారతదేశాన బ్రిటీషు
సామ్రాజ్యపు పునాదులనే కదిలించివేసిన ఉద్యమమని అన్నారు. ఉద్యమ క్షీణతకు దారి తీసిన
పరిస్థితులు తెలుసుకోవడం అవసరం. అంత తీవ్రంగా సాగి బ్రిటీషు ప్రభుత్వాన్ని
గడగడలాడించిన ఈ ఉద్యమం అర్ధాంతరంగా ముగిసింది. ఈ ఉద్యమంతో వీరయ్య చౌదరి పేరు
ప్రతిష్ఠలు గణనీయంగా పెరిగాయి. కొందరు నాయకులది కంటగింపుగా మారిందన్న
ఆరోపణలున్నాయి.
వీరయ్య
చౌదరి, ఆంధ్రప్రదేశ్ సంగీత నాటక అకాడమీ సభ్యుడిగా, హైదరాబాద్ రేడియో సంఘం
అధ్యక్షుడిగా సేవలందించారు.
హైదరాబాద్
లో 1970, ఫిబ్రవరి 8 న తుదిశ్వాస విడిచారు.
ఆయన గౌరవార్ధం పెదనందిపాడు మెయిన్ సెంటర్ లో విగ్రహం ఏర్పాటు చేశారు.