టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీ పర్యటన తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తించింది. బుధవారంనాడు ప్రత్యేక విమానంలో హుటాహుటిన ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబునాయుడు, రాత్రి 11 గంటల 30 నిమిషాల సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చర్చలు జరిపారు. అయితే చర్చల సారాంశం మాత్రం మీడియాకు వెల్లడించలేదు.
425 సీట్లు లక్ష్యంగా బీజేపీ పావులు
కేంద్ర బీజేపీ సార్వత్రిక ఎన్నికల్లో భారీ మెజారిటీ సాధించేందుకు పాత మిత్రులను దగ్గరకు తీస్తోంది. ఇప్పటికే బిహార్లో కొరకరాని కొయ్యలా మారిన సీఎం నితీష్ కుమార్ను (bihar chief minister nitish kumar) ఎన్డీయే కూటమిలో చేర్చుకున్నారు. ఇక కర్ణాటకలో జేడీయస్ను దగ్గరకు చేరదీశారు. నేడో రేపో ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్ కూడా ఎన్డీయేలో చేరతారనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణాదిలో కూడా బీజేపీని బలోపేతం చేసేందుకు ఆ పార్టీ పావులు కదుపుతోంది. ఏపీలో పాత మిత్రుడు చంద్రబాబును ఎన్డీయేలో (NDA) చేర్చుకునేందుకు బీజేపీ సిద్దమవుతోంది. ఏపీలో బీజేపీ ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉంది. ఇక టీడీపీని కూడా కలుపుకుంటే ముగ్గురు మిత్రుల కూటమి ద్వారా కనీసం ఏపీలో 23 సీట్లు సాధించవచ్చని ఆ పార్టీ భావిస్తోంది. తమకు పెద్దగా బలం లేని రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులను కలుపుకుని పోవాలని బీజేపీ భావిస్తోంది. దీని ద్వారా కాంగ్రెస్ పార్టీ బలపడకుండా ఇండీ కూటమికి చావుదెబ్బకొట్టే వ్యూహం అమలు చేస్తోంది.
చంద్రబాబు ఢిల్లీ పర్యటన
ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు ఖరారైంది. అయితే బీజేపీ కూడా వీరితో చేతులు కలిపితే,ఇక అభ్యర్థుల ప్రకటనే తరువాయి. గతంలో చంద్రబాబునాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఒకసారి కలసినా అడుగు ముందుకు పడలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ, ఇక ఆలస్యం చేయకుండా పొత్తులు, సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని మరో వారం రోజుల్లో తేల్చాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఆలస్యం అయ్యే కొద్దీ నష్టపోయే ప్రమాదం ఉంది. అందుకే ఏపీలో టీడీపీ, జనసేన పొత్తులో బీజేపీ కూడా చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందుకు చంద్రబాబు (telugudesam party president nara chandrababu delhi tour) కూడా ఆత్రుతగా ఉండటంతో బీజేపీ నేతలు ఎంపీ సీట్లు ఎక్కువగా సాధించుకునేందుకు పట్టుబట్టే అవకాశముంది.
నేడు ఢిల్లీకి పవన్ కళ్యాణ్
కేంద్ర బీజేపీ పెద్దలు పొత్తుల వ్యవహారాన్ని తేల్చి వేసేందుకు సిద్దమయ్యారు. ఇప్పటికే బిహార్ నుంచి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అంతకు ముందే కర్ణాటకలో జేడీయస్ను ఎన్డీయేలో చేర్చుకోవడం ద్వారా కాంగ్రెస్కు దూరంగా ఉన్న ప్రాంతీయ పార్టీలకు సంకేతాలు పంపారు. ఇక కాంగ్రెస్తో అంటకాగిన పార్టీలు కూడా ఇండీ కూటమి నుంచి బయటకు వస్తే ఎన్డీయేలో చేర్చుకునే ప్రణాళిక అమల్లోకి తీసుకువచ్చారు. ఇందులో భాగంగానే బిహార్లో నితీష్ కుమార్ను ఎన్టీయేలో చేర్చుకున్నారని తెలుస్తోంది. ఏపీ విషయానికి వస్తే… ఇక్కడ బీజేపీకి పెద్దగా పట్టులేదు. పట్టుమని పది సీట్లు కూడా గెలిచే సామర్థ్యం లేదు. జనసేన, టీడీపీతో చేతులు కలిపి వారికి సహకరిస్తే ఏపీలో కనీసం ఐదు ఎంపీ స్థానాల్లో బీజేపీ అభ్యర్థులను నిలపవచ్చని ఆ పార్టీ యోచిస్తోంది. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
చంద్రబాబు పర్యటన సారాంశం తేలేది వారం తరవాతే
చంద్రబాబునాయుడు ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలసి, చర్చలు జరిపినా సారాంశం మాత్రం బయటకు రావడం లేదు. ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా బీజేపీ పెద్దలతో మాట్లాడిన తరవాత కొంత క్లారిటీ వచ్చే అవకాశముంది. అయితే పొత్తుల ప్రకటనకు మరికొంత సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.పొత్తులు తేలకముందే, సీట్ల సర్దుబాటు వ్యవహారంపై కూడా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీలో వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీ పెద్దల సహకారం తప్పనిసరి అని టీడీపీ, జనసేన అధినేతలు భావిస్తున్నారు. పొత్తు ఖాయం. అయితే ఎవరెన్ని సీట్లలో పోటీ చేస్తారనేది మాత్రం ఇప్పుడే తేలేలా కనిపించడం లేదు. మొత్తం మీద చంద్రబాబు ఢిల్లీ పర్యటన వ్యవహారంలో ఎవరి విశ్లేషణలు వారు చేసుకోవడం తప్ప అధికారిక ప్రకటనలు మాత్రం రాలేదు.