Uttarakhand Assembly Passes Uniform Civil Code Bill
ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (యూసీసీ)కు ఉత్తరాఖండ్
ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. తద్వారా యూసీసీని ఆమోదించిన మొదటి రాష్ట్రంగా
ఉత్తరాఖండ్ అవతరించింది. ఈ ప్రేరణతో మరిన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు యూసీసీ చట్టం
చేసే దిశగా అడుగులు మొదలుపెట్టాయి.
బుధవారం ఉత్తరాఖండ్ శాసనసభ ఉమ్మడి పౌరస్మృతి
బిల్లును పాస్ చేసింది. ఇంక గవర్నర్ అనుమతి అనే లాంఛనం మిగిలుంది. ఆ సందర్భంగా
రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ మీడియాతో మాట్లాడుతూ ‘‘ఇవాళ ఉత్తరాఖండ్‌కు
చాలా ముఖ్యమైన రోజు. దేశ ప్రజలందరూ సుదీర్ఘకాలంగా కావాలని కోరుకుంటున్న బిల్లును
మేం ఆమోదించాం, అలా యూసీసీ చట్టం చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలిచింది. ఈ
సందర్భంగా మాకు అధికారం కట్టబెట్టి, ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టి పాస్ చేసే
అవకాశం ఇచ్చిన రాష్ట్ర ప్రజలకు, అందరు ఎమ్మెల్యేలకు ధన్యవాదాలు’’ అని చెప్పారు.
పుష్కర్ సింగ్ ధామీ ఈ బిల్లు విషయంలో తమకు అండదండగా
నిలబడిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. ఈ బిల్లు ఎవరికీ
వ్యతిరేకం కాదనీ, అందరికీ – ముఖ్యంగా మహిళలకు – లబ్ధి చేకూరుస్తుందనీ
వెల్లడించారు. ‘‘ఈ బిల్లు వివాహం, భరణం, వారసత్వం, విడాకులు వంటి అంశాల్లో ఎలాంటి
వివక్షా లేకుండా అందరికీ సమానత్వపు హక్కును ఇస్తుంది. ముఖ్యంగా ఈ బిల్లు మహిళల
పట్ల వివక్షను తొలగిస్తుంది’’ అన్నారు. అవసరమైతే ఏదైనా నిర్దిష్టమైన క్లాజ్‌ను కలపవలసి
వస్తే యూసీసీని సవరించుకోవచ్చని వివరించారు.
ఉమ్మడి పౌరస్మృతి బిల్లును అసెంబ్లీలో
ప్రవేశపెట్టినప్పుడు ప్రతిపక్షం ఆ బిల్లును మొదట అసెంబ్లీ సెలక్ట్ కమిటీకి
పంపించాలని డిమాండ్ చేసింది. మరోవైపు, వచ్చే శాసనసభ సమావేశాల్లో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టడానికి రాజస్థాన్ సిద్ధపడుతోంది.