“Modi 3.0 Will Strengthen Foundation Of Viksit Bharat”
పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ప్రసంగానికి
ధన్యవాదాలు తెలిపే చర్చలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇవాళ రాజ్యసభలో
ప్రసంగించారు. అందులో భాగంగా ఆయన రాబోయే ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే
ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేసారు.
రాబోయే ప్రభుత్వాన్ని పలువురు మోదీ 3.0గా పిలుస్తున్నారంటూ
ఆ ప్రభుత్వం వికసిత భారతానికి బలమైన పునాదులు వేసే దిశగా కృషి చేస్తుందని
చెప్పారు. అలాంటి భారతదేశంలో రైతులకు డ్రోన్లు సహాయపడతాయని, విద్యుత్ రంగంలో
స్వయంసమృద్ధి ఉంటుందని, సెమీకండక్టర్లు భారత్లోనే తయారవుతాయని, ప్రజారవాణా
వ్యవస్థ రూపురేఖలు మారిపోతాయని, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ రంగంలో భారత్ ప్రతిభ
ప్రపంచానికి తెలుస్తుందనీ మోదీ చెప్పారు. ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలు కొత్తకొత్త
స్టార్టప్లకు కేంద్రాలు అవుతాయన్నారు.
అదే సమయంలో సంక్షేమం పైనా తమ ప్రభుత్వం దృష్టి
సారిస్తుందని మోదీ చెప్పారు. పేదలకు రూ.5లక్షల వరకూ ఉచిత చికిత్స, మందులపై 80శాతం
సబ్సిడీ కొనసాగుతాయన్నారు. కిసాన్ సమ్మాన్ నిధి, పక్కా ఇళ్ళ పథకం, తాగునీరు
అందించే నల్ సే జల్ పథకం, టాయిలెట్ల నిర్మాణం కొనసాగుతాయని చెప్పారు.
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ప్రధాని మోదీ
వ్యంగ్యబాణాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ తమ యువరాజును ఒక స్టార్టప్లా చూపే
ప్రయత్నం చేస్తోందనీ, కానీ ఆ యువరాజు ఏమీ స్టార్ట్ చేయలేకపోతున్నాడనీ చమత్కరించారు.
ఆయన దేన్నీ మోయలేడు, ప్రారంభించలేడని వ్యాఖ్యానించారు.
మోదీ తన రాజ్యసభ ప్రసంగంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు
మల్లికార్జున ఖర్గేను లక్ష్యం చేసుకున్నారు. గత శుక్రవారం రాజ్యసభలో
మాట్లాడుతున్నప్పుడు ఖర్గే, ఎన్డీయే కూటమికి 400కు పైగా సీట్లు వస్తాయని
నోరుజారారు. ఆ వ్యాఖ్యకు మోదీ ఇవాళ ఖర్గేకు కృతజ్ఞతలు తెలిపారు. ఖర్గే
ఆశీర్వాదాన్ని తీసుకుంటున్నామనీ, ఆయన దీవెన కలిగించినంత ఆనందం మరి దేనివల్లా
రాలేదనీ మోదీ అన్నారు.
మోదీ పరోక్షంగా రాహుల్ గాంధీని ప్రస్తావిస్తూ రాజ్యసభలో
ఉన్నంత వినోదం లోక్సభలో లేదన్నారు. అసలు ఖర్గే ఆరోజు అంత స్వేచ్ఛగా ఎలా మాట్లాడారా
అని ఆశ్చర్యం వ్యక్తం చేసారు. ఆరోజు ఇద్దరు ప్రత్యేక కమాండర్లు (జైరాం రమేష్, కేసీ
వేణుగోపాల్) లేనందునే ఖర్గే స్వేచ్ఛగా మాట్లాడగలిగినట్లు అర్ధమైందన్నారు. ఆరోజు
ఫోర్లు, సిక్సులు కొడుతూ ఖర్గే సరదాగా గడిపారు అని మోదీ జోక్ చేసారు. ‘ఐసా మౌకా
ఫిర్ కహా మిలేగా’ (ఇలాంటి అవకాశం మళ్ళీ ఎక్కడ దొరుకుతుంది) అనే పాట ఖర్గే విని
ఉంటారని చమత్కరించారు.
ఇక దేశ ప్రథమ ప్రధాని జవాహర్లాల్ నెహ్రూ మీద తన వ్యాఖ్యలకు
మోదీ మరింత పదును పెట్టారు. లోక్సభ ప్రసంగంలో నెహ్రూ మీద మోదీ చేసిన వ్యాఖ్యలను
కాంగ్రెస్ తప్పుపట్టింది. దానికి జవాబుగానా అన్నట్టు మోదీ మాట్లాడారు. ‘‘నెహ్రూ ఒకసారి
రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖ రాసారు. అందులో ఆయన తను రిజర్వేషన్లకు వ్యతిరేకిని
అని స్పష్టం చేసారు. రిజర్వేషన్ల వల్ల సమర్థత లేని వ్యక్తులు వస్తారనీ, దానివల్ల
వ్యవస్థలో అసమర్థత పెరుగుతుందనీ నెహ్రూ భావించారు’’ అని మోదీ గుర్తుచేసారు.
వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ
కనీసం 40 సీట్లయినా గెలుచుకోవాలని ప్రార్థిస్తున్నానని మోదీ అన్నారు. గతవారం ఇండీ
కూటమిలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను ఆయన
ప్రస్తావించారు. ‘‘మీకు ఈ సవాల్ పశ్చిమబెంగాల్ నుంచి వచ్చింది. కాంగ్రెస్ 40
స్థానాలయినా గెలవలేదట. కానీ మీ పార్టీ కనీసం 40 సీట్లయినా గెలవాలి. దానికోసం నేను
ప్రార్ధిస్తున్నాను’’ అని వ్యాఖ్యానించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తీర్మానంలో
భాగంగా ఇవాళ రాజ్యసభలో ప్రసంగించిన నరేంద్ర మోదీ, యూపీయే పదేళ్ళ పాలనను
దుయ్యబట్టారు. తమ పదేళ్ళ పాలనలో పలు విజయాలు సాధించామని వివరించారు. దేశ ఫెడరల్
వ్యవస్థపై తమకు విశ్వాసం ఉందని, రాష్ట్రాల అభివృద్ధికి తగినన్ని నిధులిస్తామని చెప్పుకొచ్చారు.