What the Constituent Assembly Spoke of Uniform Civil Code
ఉమ్మడి పౌరస్మృతి ముస్లిముల హక్కులకు విఘాతం
కలిగిస్తుందన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది కదా. కానీ నిజానికి దాన్ని ప్రతిపాదించింది
భారత రాజ్యాంగంలోనే అన్న సంగతి తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది. ఆదేశసూత్రాల్లో దీనిగురించి
ప్రస్తావించారంటే ఉమ్మడి పౌరస్మృతికి రాజ్యాంగ సభ ఎంత విలువ ఇచ్చిందో
అర్ధమవుతుంది.
రాజ్యాంగ సభలో ప్రాథమిక హక్కుల సబ్ కమిటీ సభ్యులు
దాదాపు అందరూ ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ)ని వీలైనంత త్వరగా అమల్లోకి తీసుకురావాలి
అని ప్రతిపాదించారు. కమిటీ సభ్యులు ఎంఆర్ మసానీ, హంసా మెహతా, రాజకుమారి అమృత్ కౌర్
ఇలా చెప్పారు, ‘‘మా ఉద్దేశం ప్రకారం కామన్ సివిల్ కోడ్‌ను 5 నుంచి 10 సంవత్సరాల
లోగా భారతీయులకు అందుబాటులోకి తేవాలి. క్లాజ్ నెంబర్ 23 ప్రకారం ఉచిత, నిర్బంధ ప్రాథమిక విద్యను పదేళ్ళలోపు అమల్లోకి
తెచ్చేటట్లే ఉమ్మడి పౌరస్మృతిని కూడా అందుబాటులోకి తేవాలి’’.
రాజకుమారి అమృత్‌కౌర్ అయితే ఉమ్మడి పౌరస్మృతిని
ప్రాథమిక హక్కుల్లో భాగం చేయాలని ప్రతిపాదించారు. ఆ మేరకు ఆమె రాజ్యాంగ సభ సలహా
కమిటీకి లేఖ కూడా రాసారు.
1948 ఏప్రిల్ 9న రాజ్యాంగ సభలో హిందూకోడ్‌ను
ప్రతిపాదిస్తూ రోహిణీ కుమార్ చౌధురీ ఇలా చెప్పారు, ‘‘వంశ పారంపర్య ఆస్తి విషయంలో,
వివాహం విషయంలో మతపరమైన చట్టాలు ఉండకూడదు. కానీ ఉమ్మడి పౌరస్మృతి అనేది తప్పకుండా
ఉండాలి. అది అన్ని మతాలవారికీ, అన్ని వర్గాలవారికీ సమానంగా వర్తించేలా ఉండాలి.’’
1948 డిసెంబర్ 12న హిందూకోడ్ బిల్లుపై చర్చలో హరి
వినాయక్ పాటస్కర్ ఉమ్మడి పౌరస్మృతి ఆవశ్యకత గురించి సవిస్తరంగా వివరించారు. ‘‘రాజ్యాంగంలోని
ఆదేశసూత్రాల్లో మనం – దేశమంతటా ఉమ్మడి పౌరస్మృతి అమలు చేయడానికి కృషి చేయాలని –
రాసుకున్నాం. ఇప్పుడు హిందువుల కోసం హిందూకోడ్ బిల్లును తీసుకొచ్చి చట్టం
చేస్తుండడం ద్వారా మనం ఆదర్శవంతమైన ప్రగతి వైపు అడుగులు వేస్తున్నామా లేదా అని
సీరియస్‌గా ఆలోచించాలి. నిజానికి మనం ముందడుగు వేయడం లేదు, వెనుకడుగు
వేస్తున్నామని నా ఉద్దేశం. …. …. దేశ భద్రత కోసం చేసే చట్టాలు కేవలం
హిందువులకు మాత్రమే వర్తించేవిగా ఉండకూడదు, దేశ పౌరులందరికీవర్తించాలి.
భారతదేశంలో నివసించే పౌరులందరినీ సమానంగా పరిగణించేలా చట్టాలు ఉండాలి. వివాహం,
వంశపారంపర్యం వంటి అంశాలు ప్రపంచంలోని అన్ని దేశాల్లోనూ పౌరస్మృతిలో భాగంగా
ఉంటాయి, భారతదేశంలో కూడా అలాగే ఉండాలి. హిందువులు, క్రైస్తవులు, పార్సీలు లేదా
ముస్లిములు ఇలా మతపరమైన తేడాలేమీ లేకుండా ఆ పౌర స్మృతి దేశ పౌరులందరికీ ఒకేలా
ఉండాలి.’’
రాజ్యాంగంలోని 44వ అధికరణం గురించి చర్చిస్తున్న
సందర్భంలో అంబేద్కర్ ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా ప్రసంగించారు. ‘‘ఉమ్మడి
పౌరస్మృతి పరిధిలోకి రాకుండా ఉండిపోయిన అంశాలు వివాహం, వారసత్వం. ఆ రకమైన మార్పు తేవాలన్నదే
44వ అధికరణాన్ని రాజ్యాంగంలో ప్రవేశపెట్టడం వెనుక అసలైన ఉద్దేశం’’ అని చెప్పారు.
రాజ్యాంగ సభ మతపరమైన ఎన్నికలు, చట్టసభల సీట్లలో
మతపరమైన రిజర్వేషన్ల పద్ధతికి రాజ్యాంగసభ ముగింపు పలికినప్పుడు… సి సుబ్రహ్మణ్యం,
జస్పత్‌రాయ్ కపూర్, హంసా మెహతా ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా స్పష్టమైన ప్రకటనలు
చేసారు. ‘‘మనం ఒక దేశాన్ని నిర్మించాలంటే మనకు ఉమ్మడి పౌరస్మృతి ఉండడం చాలా
ముఖ్యం’’ అని హంసా మెహతా 1949 నవంబర్ 24న స్పష్టంగా చెప్పారు. అదే రోజు రాజ్యాంగసభలో
ఎ థాను పిళ్ళై మాట్లాడుతూ ‘‘భారతదేశానికి ఒక ఉమ్మడి పౌరస్మృతిని తేవాలంటే అది
ఆధునిక జీవిత విధానాలకు అనుగుణంగా ఉండాలి. మన మహిళలు స్వేచ్ఛావంతులు. మన వివాహ
చట్టాలు సామాజిక మనుగడకు సంబంధించిన అప్-టు-డేట్ అంశాలకు అనుకూలంగా ఉండాలి’’.
1949 డిసెంబర్ 14న రాజ్యాంగ సభలో హిందూకోడ్
బిల్లు గురించి మాట్లాడుతూ విఐ మునిస్వామిపిళ్ళై ‘‘మనకొక ఉమ్మడి పౌరస్మృతిని తయారు
చేసుకోవాలని మన రాజ్యాంగంలో చెప్పుకున్నాం’’ అని గుర్తు చేసారు.
1951 ఫిబ్రవరి 5న ప్రొవిజనల్ పార్లమెంటులో
హిందూకోడ్ గురించి చర్చించినప్పుడు వినాయక్ సీతారామన్ సర్వతే, ఇంద్ర విద్యావాచస్పతి,
జెఆర్ కపూర్ వంటి ప్రముఖులు సహా చాలామంది సభ్యులు ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా
ఓటువేసారు. 7వ తేదీన జరిగిన అదే చర్చలో సేఠ్ గోవింద దాస్ కూడా ఉమ్మడి పౌరస్మృతికి
మద్దతు పలికారు.
ఉమ్మడి పౌరస్మృతికి అనుకూలంగా పలువురు రాజకీయ
నాయకుల ప్రకటనలు
‘‘పౌరస్మృతిని చట్టం చేస్తే అది మైనారిటీలపై
దౌర్జన్యం కాదా అన్నంత వరకూ వాదనను పొడిగించారు. అది దౌర్జన్యమా? కానే కాదు.
ఆధునిక ముస్లిం దేశాలు వేటిలోనూ ఒక్కో మైనారిటీ వర్గానికి ఒక్కొక్క పౌరస్మృతిని
పరమావధిగా గుర్తించలేదు. ఎందుకంటే అందరికీ ఒకే పౌరస్మృతిని అందించడం కోసమే. …
… భారతదేశం అంతటికీ ఒకే పౌరస్మృతి ఉండకూడదు అనడాన్ని సమర్ధించేందుకు ఏ కారణమూ
లేదు. … …. మనం ఒక ముఖ్యమైన అంశాన్ని దృష్టిలో ఉంచుకోవాలి, నా ముస్లిం
స్నేహితులందరూ ఈ విషయాన్ని గుర్తించాలని కోరుతున్నాను. అదేంటంటే, జీవితంలో ఈ ఒంటెత్తు
ధోరణిని ఎంత త్వరగా మరచిపోతే దేశానికి అంత మంచిది’’ – కె ఎం మున్షీ
‘‘రెండో అభ్యంతరం ఏంటంటే మతం ప్రమాదంలో ఉందంటున్నారు.
అందరికీ ఒకే పౌరస్మృతి ఉంటే వివిధ మతాల వారు స్నేహంగా జీవించలేరని చెబుతున్నారు.
నిజానికి ఈ అధికరణం లక్ష్యమే అందరిమధ్యా స్నేహం సాధించడం. ఇది స్నేహాన్ని విచ్ఛిన్నం
చేయదు. … … ఒక న్యాయ విధానం మరో న్యాయవిధానాన్ని ప్రభావితం చేయడం, లేదా
దానివల్ల ప్రభావితం అవడం అనే పద్ధతి కాదిది. … … ఏ విధానం కూడా తనంత తానుగా ఉండలేదు. అలా ఉంటే
ఎదుగుదల ఉండదు. ఎప్పుడూ గతాన్ని పట్టుకుని వేలాడుతూ ఉండడం వల్ల ఏం ఉపయోగం లేదు. మనం
గతాన్ని వదిలిపెట్టి ముఖ్యమైన దిశగా ముందడుగులు వేస్తున్నాం. అదేంటంటే భారతదేశం
మొత్తాన్నీ ఒక ఐక్యదేశంగా, ఐకమత్యం కలిగిన దేశంగా మలచాలని ప్రయత్నిస్తున్నాం.’’ –
అల్లాడి కుప్పుసామి అయ్యర్
‘‘ఆ ప్రకటన నన్ను ఎంతో ఆశ్చర్యచకితుణ్ణి చేసింది.
ఎందుకంటే ఈ దేశంలో మానవ సంబంధాలకు సంబంధించిన దాదాపు అన్ని విషయాల్లోనూ అందరికీ
సమానంగా వర్తించే చట్టాలు తీసుకొచ్చాం. ఈ దేశంలో ఆచరణలో పౌరస్మృతి ఉందని, దానిలోని
విషయాలు దేశంలోని అందరికీ సమానంగా వర్తిస్తాయనీ నిరూపించడానికి నేను లెక్కలేనన్ని
చట్టాలను చూపించగలను. సివిల్ లా ఇప్పటివరకూ చొరబడని ఒకేఒక అంశం వివాహం,
వంశపారంపర్యం.’’ – బి ఆర్ అంబేడ్కర్