సార్వత్రిక
ఎన్నికల గడువు దగ్గర పడుతున్న కొద్దీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త కొత్త
పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఆయారామ్, గయారామ్ లతో పాటు పరస్పర విమర్శలు,
అభ్యర్థుల ఖరారుతో అన్ని పార్టీలు క్షణం తీరికలేకుండా గడుపుతున్నాయి.
ప్రత్యర్థికి
ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గెలుపే లక్ష్యంగా ప్రజానుగ్రహం కోసం తపనపడుతున్నాయి.
అధికారమే
లక్ష్యంగా ప్రజాక్షేత్రంలో శ్రమిస్తున్న రాజకీయ పార్టీలు, ఇప్పుడు మహాభారతం లోని ప్రముఖ వ్యక్తులను కూడా రాజకీయాల్లోకి లాగి లబ్ధి
పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
తమను
తాము పాండవులతో పోల్చుకుంటూ, రాజకీయ శత్రువులను కౌరవులుగా అభివర్ణిస్తున్నారు. మొత్తానికి
ఎత్తులు, వ్యూహారచన, కవ్వింపు చర్యల్లో కురుక్షేత్ర సంగ్రామానికి మించి
తలమునకలయ్యారు.
దెందులూరు
నియోజకవర్గంలో పాలక వైసీపీ నిర్వహించిన ‘సిద్ధం’ సభలో తనను తాను మహాభారతంలోని సవ్యసాచి
అర్జునుడితో సీఎం జగన్ పోల్చుకున్నారు. రాజకీయ ప్రత్యర్థుల కుయుక్తులను ఛేదించి
మళ్ళీ విజయం సాధిస్తానంటూ ప్రకటన చేసి, పార్టీ శ్రేణుల్లో జోష్ నింపారు.
ప్రజలు,
తనకు శ్రీకృష్ణుడిలా అండగా నిలిచి, టీడీపీ-జనసేన కూటమిని ఓడించాలన్నారు.
టీడీపీ,జనసేన పార్టీలను ఆయన కౌరవులతో పోల్చారు. తమను విడివిడిగా ఎదుర్కోలేక
ప్రత్యర్థులంతా గుంపుగా వస్తున్నారని దుయ్యబట్టారు.
వైసీపీ
అధినేత, సీఎం జగన్ , తనను తాను గాండీవధారి అర్జునుడితో పోల్చుకోవడంపై టీడీపీ
అధినేత చంద్రబాబు ఆఘమేఘాలపై స్పందించారు. వైఎస్ జగన్, అర్జునుడు కాడు అక్రమార్జునుడు అంటూ
తూర్పారబట్టారు. చింతలపూడిలో నిర్వహించిన ‘రా కదిలి రా’ సభ వేదికగా వైసీపీ అధినేత
పై తీవ్ర ఆరోపణలు చేశారు. పులివెందుల రాజకీయాలను రాష్ట్రంపై రుద్దుతున్నారని మండిపడ్డారు.
అర్జునుడి
తో జగన్ ఎలా పోల్చుకుంటారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. తోబట్టువు
వైఎస్ షర్మిలను అసభ్య పదజాలంతో దూషించే వారిని ప్రోత్సహించే జగన్ మహాభారతంలోని వీరులతో
పోల్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. చిన్నాన్నను చంపిన వారికి మద్దతు పలికే జగన్, గాండీవధారి
ఎలా అవుతారని నిలదీశారు. ప్రాణభయంతో బతుకుతున్న చిన్నాన్న కూతురుకి అండగా నిలవలేని
వ్యక్తి, సవ్యసాచి ఎలా అవుతారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
జనసేన
అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీమంత్రి, వైసీపీ నేత పేర్ని నాని మరోసారి తీవ్ర
విమర్శలు చేశారు. మహాభారతంలోని శల్యుడితో పోల్చారు. పవన్ కళ్యాణ్ ‘కలియుగ శల్యుడు’
అంటూ తనదైన భాష్యం చెప్పారు. కురుక్షేత్ర సంగ్రామ సమయంలో కర్ణుడిని శల్యుడు నిరుత్సాహ
పరిచినట్లే, జనసేన కేడర్ ఆశలపై పవన్ నీళ్ళు చల్లుతున్నారని చెప్పారు. పవన్ ను
ముఖ్యమంత్రిగా చూడాలని జనసైనికులు ఆరాటపడుతుంటే, ఆయన మాత్రం చంద్రబాబు పల్లకీ
మోస్తున్నారని ఎద్దేవా చేశారు.