Indians there should vacate that place immediately, suggests MEA
మయన్మార్‌లోని రఖైన్ ప్రాంతంలో భద్రతా పరిస్థితులు
క్షీణిస్తున్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి భారతీయులు ఎవరూ వెళ్ళవద్దంటూ భారత
ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే అక్కడున్న వారిని వెంటనే ఆ ప్రదేశాన్ని ఖాళీ
చేయవలసిందిగా భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో కోరింది.
రఖైన్ ప్రాంతంలో పెరుగుతున్న హింసాకాండ,
టెలికమ్యూనికేషన్ నెట్‌వర్క్‌కు అంతరాయాలు, నిత్యావసర వస్తువుల కొరత పెరిగిపోవడం
వంటి కారణాల వల్ల భారత ప్రభుత్వం ఈ సూచన చేసింది. ఆ ప్రాంతంలో ఇప్పటికే ఉన్న భారత
పౌరులు ఆ రాష్ట్రాన్ని తక్షణమే వదిలిపెట్టి వచ్చేయాలని భారత విదేశాంగ శాఖ సూచించింది.
మయన్మార్‌లో 2021 ఫిబ్రవరి 1నసైనిక కుట్రతో మిలటరీ అధికారంలోకి వచ్చిననాటి
నుంచీ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించాలన్న డిమాండ్‌తో హింసాత్మక ఆందోళనలు
కొనసాగుతున్నాయి. గతేడాది అక్టోబర్ నుంచీ రఖైన్ వంటి ప్రాంతాల్లో సైన్యానికీ,
స్థానిక జాతులకూ మధ్య యుద్ధం జరుగుతోంది.
గత నవంబర్ నుంచీ భారత సరిహద్దు ప్రాంతాల్లోని
మయన్మార్ దేశానికి చెందిన పట్టణాలు, ప్రాంతాల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా
మారుతున్నాయి. మయన్మార్ సైన్యం తమ శత్రువులపై వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఈ పరిస్థితుల ప్రభావం మణిపూర్, మిజోరం వంటి సరిహద్దు
రాష్ట్రాల మీద పడే అవకాశం భారత్‌కు ఆందోళనకరంగా మారింది.
‘‘మయన్మార్‌లో
క్షీణిస్తున్న పరిస్థితులతో భారత్ ఆందోళన చెందుతోంది. వాటి ప్రభావం భారత్‌పై నేరుగా
ఉంటుంది’’ అని భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఫిబ్రవరి 1న ప్రకటించారు.
‘‘తమ దేశాన్ని ఫెడరల్ ప్రజాస్వామ్యంగా మార్చుకోమని, హింసాకాండను విరమించుకోమని, పొరుగున
ఉన్న మిత్రదేశంగా భారతదేశం మయన్మార్‌కు చాలాకాలం నుంచీ సూచిస్తోంది’’ అని ఆయన
వివరించారు.