EC gives NCP name and party symbol to Ajit Pawar faction,
big shock for Sarad Pawar
మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు శరద్ పవార్‌కు
పెద్ద షాకే తగిలింది. తాను స్థాపించిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ పేరు, గుర్తు
రెండూ… అజిత్ పవార్ వర్గానికే చెందుతాయని ఎన్నికల కమిషన్ తీర్పునిచ్చింది.
అజిత్ పవార్, శరద్ పవార్‌కు మేనల్లుడే. రాజకీయ
భేదాభిప్రాయాలతో పార్టీలోని ఎమ్మెల్యేల్లో అత్యధికులతో కలిసి విడిపోయారు. శరద్
పవార్ వర్గం కాంగ్రెస్‌కు మద్దతిస్తుండగా, అజిత్ పవార్ వర్గం అధికార బీజేపీ-శివసేన
కూటమిలో చేరింది.
ఎన్‌సీపీలో మొత్తం 53 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.
వారిలో 41మంది అజిత్ పవార్‌తో ఉన్నారు. కేవలం 12మంది మాత్రమే శరద్ పవార్ వర్గంలో
ఉన్నారు. దాంతో అజిత్ పవార్ వర్గాన్నే అసలైన ఎన్‌సీపీగా ఎన్నికల కమిషన్
గుర్తించింది. పార్టీ పేరును, గుర్తును వారికే కేటాయించింది.
ఎన్నికల కమిషన్ నిర్ణయం ఫలితంగా పార్టీ ఆస్తులు,
బ్యాంకు ఖాతాలు ఇకపై అజిత్ పవార్ వర్గం చేతిలోనే ఉంటాయి. దాంతో శరద్ పవార్ వర్గం
ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో శరద్ పవార్ వర్గాన్ని
తమకొక పేరు, గుర్తు ఎంచుకోవాలని ఎన్నికల కమిషన్ సూచించింది. ఆ వివరాలను ఇవాళ
మధ్యాహ్నం 3గంటలలోగా తెలియజేయాలని సూచించింది.
గతేడాది ఫిబ్రవరిలో అంటే దాదాపు ఈ సమయంలోనే
శివసేనలో చీలిక వచ్చినప్పుడు సైతం ఎన్నికల కమిషన్ ఈ మాదిరి తీర్పే ఇచ్చింది.
పార్టీ వ్యవస్థాపకుడు బాల్ ఠాకరే కుమారుడు ఉద్ధవ్ ఠాక్రేకు కాకుండా, ఏకనాథ్ షిండే
వర్గానికి పార్టీ పేరును, చిహ్నాన్నీ ఇచ్చివేసింది. ఇప్పుడు ఏకనాథ్ షిండే
నేతృత్వంలోని శివసేన, బీజేపీతోనూ ఎన్‌సీపీ అజిత్ పవార్ వర్గంతోనూ కలిసి ప్రభుత్వం
ఏర్పాటు చేసింది.
శరద్ పవార్ వర్గానికి చెందిన సీనియర్ నాయకుడు అనిల్
దేశముఖ్ ‘‘ఎన్‌సీపీని ఎవరు ప్రారంభించారన్న సంగతి ప్రపంచం అందరికీ తెలుసు.
అలాంటప్పుడు ఎన్నికల కమిషన్ ఏం చేస్తే ఏమిటి? అయితే ఎన్నికల కమిషన్ చర్య
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే’’ అని వ్యాఖ్యానించారు.