కర్ణాటక
సీఎం సిద్ధరామయ్యకు ఆ రాష్ట్ర హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2022లో తనపై నమోదైన
కేసును కొట్టి వేయాలంటూ ఆయన వేసిన పిటిషన్ కోర్టు కొట్టివేసింది. రోడ్డుపై
రాకపోకలకు అంతరాయం కల్గించిన కేసులో సిద్ధరామయ్యకు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ
కోర్టు తీర్పు వెల్లడించింది.
కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా, మంత్రులు
ఎంబీ పాటిల్, రామలింగారెడ్డి
కూడా ఈ కేసును ఎదుర్కొంటున్నారు. మార్చి 6న ఎంపీ, ఎమ్మెల్యే ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుకావాలని న్యాయస్థానం
ఆదేశించింది.
గత బీజేపీ ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్న కేఎస్ ఈశ్వరప్ప
తన గ్రామంలో పనులకు 40శాతం కమీషన్ డిమాండ్ చేశారని ఆరోపిస్తూ సంతోష్ పాటిల్ అనే
కాంట్రాక్టర్ ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టి అప్పటి సీఎం బసవరాజ్ బొమ్మై నివాస
ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. రోడ్లను దిగ్బందించి నిరసనకు దిగారంటూ
అప్పట్లో పోలీసులు కేసు నమోదు చేశారు.
దీనిని సిద్ధరామయ్య హైకోర్టులో సవాల్
చేశారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరగా న్యాయస్థానం నిరాకరించింది.
ప్రజాప్రతినిధులు కూడా నిబంధనలు పాటించాల్సిదేనన హైకోర్టు తేల్చి చెప్పింది.