Historic verdict in Lakshagriha-Mazar dispute
ఉత్తరప్రదేశ్ బాగ్‌పట్‌లోని స్థానిక న్యాయస్థానం
సోమవారం నాడు ఓ చారిత్రక తీర్పు వెలువరించింది. లాక్షాగృహ – మజార్ వివాదంలో
53ఏళ్ళుగా జరుగుతున్న న్యాయపోరాటంలో హిందువులకు న్యాయం జరిగింది. 100 బిఘాల భూమి,
ఒక సమాధిపై యాజమాన్య హక్కులు హిందువులకే ఉన్నాయంటూ కోర్టు నిర్ధారించింది.
కేసులో ప్రతివాది అయిన కృష్ణదత్ మహరాజ్‌కు
అనుకూలంగా తీర్పునిస్తూ ఆ ప్రాచీన ప్రాంతం మహాభారతంలో పేర్కొన్న లాక్షాగృహమే అని
గుర్తించింది. అక్కడ దర్గా, సమాధి ఉన్నందున ఆ ప్రాంతం తమదే అంటూ ముస్లిం పక్షం
చేసిన వాదనను కోర్టు త్రోసిపారేసింది.
ఉత్తరప్రదేశ్ బాగ్పట్ జిల్లా బర్నావా గ్రామంలో
హిందోన్, క్రిష్ణి నదుల సంగమస్థానం దగ్గరున్న ప్రాచీన పర్వతప్రాంతం గురించి
సుదీర్ఘకాలంగా వివాదం నడుస్తోంది. ఆ ప్రదేశం ఇప్పుడు భారత పురావస్తు సర్వేక్షణ
సంస్థ – ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ఐ) అధీనంలో ఉంది. అక్కడ బద్రుద్దీన్
షా అనే సూఫీ సాధువు సమాధి, శ్మశానం ఉన్నాయి.
1970లో ఆ శ్మశానానికి ముతవల్లీ (సంరక్షకుడు)గా
వ్యవహరించిన ముకీమ్ ఖాన్ అన్న వ్యక్తి, ఆ ప్రదేశం మీద యాజమాన్య హక్కు కోసం కేసు
వేసాడు. అక్కడికి హిందువులు వచ్చి ఆ ప్రాంతాన్ని ఆక్రమించకూడదని, సమాధులను ధ్వంసం
చేయకూడదనీ, అక్కడ యజ్ఞయాగాది వైదిక కార్యక్రమాలు చేయకూడదనీ వారి వాదన.
స్థానిక హిందూ పూజారి అయిన కృష్ణదత్ మహరాజ్ ఆ
కేసులో ప్రతివాదిగా నిలిచారు. ఆ స్థలానికి చారిత్రక ప్రాముఖ్యత ఉందనీ, మహాభారతంలో
పాండవులను చంపడానికి దుర్యోధనుడు నిర్మించిన లాక్షాగృహం అదేననీ ఆయన వాదించారు.
హిందూపక్షానికి చెందిన న్యాయవాది రణ్వీర్ సింగ్
తోమర్, ఈ కేసులో వాది అయిన ముస్లిములు చేస్తన్న వాదనలో బోలెడన్ని లోపాలున్నాయని
కోర్టు ఉత్తర్వులో స్పష్టంగా తేల్చిందని వివరించారు. ముస్లిం పక్షం వాదన ప్రకారం అక్కడ
సూఫీ సాధువు సమాధి 600 ఏళ్ళుగా ఉంది, ఆయన మరణం తర్వాత శ్మశానం వెలిసింది. అప్పటి
ముస్లిం పాలకులు ఆ ప్రాంతాన్ని వక్ఫ్ ఆస్తిగా ప్రకటించారు. అయితే ఆ ప్రాంతంలోని
ముస్లిం పాలకుల పేర్లను కోర్టు అడిగితే చూపించలేకపోయారు. ఆ ప్రాంతంలో శ్మశానం
ఉన్నట్టుగా రికార్డులు ఏమీ లేవు.
ప్రతివాదులైన హిందూపక్షం 1920 డిసెంబర్ 12 నాటి
అధికారిక గజెట్ ఒకదాన్ని కోర్టు దృష్టికి తీసుకొచ్చింది. ఆ డాక్యుమెంట్లో ‘‘ఊరికి
దక్షిణాన ఉన్న దిబ్బను లఖా మండప్ (లక్క ఇల్లు)గా వ్యవహరిస్తారు. అక్కడే పాండవులను
చంపడానికి దుర్యోధనుడు ప్రయత్నించాడు. అది సర్దానా జిల్లాలో, మీరట్‌కు వాయవ్య
దిశలో 19 మైళ్ళ దూరంలో, బర్నావాకు దగ్గరలో ఉంది’’ అని ఏఎస్ఐ చెప్పింది.
ఇక కోర్టు పరిశీలించిన మరో అంశం ఏంటంటే
వివాదాస్పద స్థలం 1920లో వక్ఫ్ ఆస్తిగా ఉందా లేదా అన్న విషయాన్ని ముస్లిం పక్షం
నిరూపించలేకపోయింది.
ఈ తీర్పు వచ్చిన తర్వాత లాక్షాగృహలో భద్రతా
ఏర్పాట్లు కట్టుదిట్టం చేసారు. ముందుజాగ్రత్త చర్యగా పోలీసులను మోహరించారు.
కోర్టు తాజాగా ఇచ్చిన ఈ తీర్పు 53ఏళ్ళ
న్యాయపోరాటానికి ఒక ముగింపును ఇచ్చింది. లాక్షాగృహం స్థలానికి ఉన్న చారిత్రక,
సాంస్కృతిక ప్రాధాన్యతను గుర్తించడం మాత్రమే కాదు, ఈ తీర్పు ఆ స్థలం మీద, అక్కడ
కట్టిన సమాధి మీద అసలైన హక్కు హిందువులకే ఉందని తేల్చిచెప్పింది.
లాక్షాగృహ – మజార్ వివాదంలో వచ్చిన తీర్పు
దేశవ్యాప్తంగా చారిత్రక, ధార్మిక ప్రదేశాలకు సంబంధించిన ఇలాంటి కేసుల పరిస్థితులు ఎలా
ఉండబోతాయో ఒక అవగాహన కల్పించింది. చారిత్రక రికార్డుల సునిశిత పరిశీలన, ఏఎస్ఐ
డాక్యుమెంటేషన్… ఇలాంటి వివాదాలను ఎలా పరిష్కరించుకోవాలో ఒక దారి చూపించాయి.