మాఘ
మాస ఘడియలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానుండటంతో తెలుగురాష్ట్రాల్లో పెళ్ళి సందడి అప్పుడే
మొదలైంది. ఫిబ్రవరి 11 నుంచి ఏప్రిల్ ఆఖరు వరకు మాత్రమే వివాహానికి అనువైన శుభ
ఘడియలు ఉండటంతో పెళ్ళి
షాపింగ్ మొదలైంది.
షాపింగ్ మాల్స్ కస్టమర్లతో కళకళలాడుతున్నాయి. శుభలేఖల అందజేత,
కళ్యాణ మండపాల బుకింగ్ పై పెళ్ళింటి వారు దృష్టిసారించారు.
ఫిబ్రవరి
11 నుంచి ఏప్రిల్ 26 వరకు కలిపి అంటే మాఘం, ఫాల్గుణం, చైత్రం మాసాల్లో పెళ్ళి
ముహూర్తాలు దాదాపు 30 ఉన్నట్లు పంచాంగ పండితులు చెబుతున్నారు.
సాధారణంగా
మేలో కూడా వివాహ ముహూర్తాలు ఉంటాయి. కానీ ఈ ఏడాది మూఢం, శూన్య మాసం రావడంతో మేలో
ముహూర్తాలు లేవు. ఇప్పుడు కుదురకపోతే మళ్ళీ శ్రావణం వరకు ఆగాల్సిందే. శ్రావణంలో వానలు పడతాయి, దీనికి తోడు వ్యవసాయ
పనుల్లో జనం తీరిక లేకుండా గడపాల్సి ఉంటుంది. దీంతో వేసవిలోనే పెళ్ళి కార్యక్రమానికి అనువైన కాలంగా ఎక్కువ మంది భావిస్తారు.
ఫిబ్రవరిలో వివాహ ముహూర్త తేదీలు… ఫిబ్రవరి 12( సోమవారం), ఫిబ్రవరి 13( మంగళవారం), ఫిబ్రవరి 17( శనివారం), ఫిబ్రవరి 24( శనివారం), ఫిబ్రవరి 25( ఆదివారం), ఫిబ్రవరి 26( సోమవారం), ఈ
ఏడాది లీప్ ఇయర్ కావడంతో ఫిబ్రవరి 29( గురువారం)న
ముహూర్తం ఉంది.
మార్చి లో ఒకటో తేదీ నుంచి 7 వ తేదీ
వరకు వరుసగా ఏడు రోజులు వివాహ ఘడియలు ఉన్నాయి. దీంతో మార్చి మొదటి వారం అంతా సందడే
సందడి. తర్వాత మార్చి 10( ఆదివారం), మార్చి 11( సోమవారం), మార్చి 12( మంగళవారం)నాడు శుభ ముహూర్తాలు ఉన్నాయి.
ఇక ఎండలు ఎక్కువగే ఉండే ఏప్రిల్ లో నాలుగు రోజుల మాత్రమే వివాహానికి అనువైన
ముహూర్తాలకు పనికి వస్తాయి. ఏప్రిల్ 18( గురువారం), ఏప్రిల్ 19( శుక్రవారం), ఏప్రిల్ 21( ఆదివారం), ఏప్రిల్ 22( సోమవారం) నాడు పెళ్ళి ముహూర్తాలు
ఉన్నట్లు పంచాంగ పండితులు చెబుతున్నారు.