Uniform Civil Code Bill introduced before Uttarakhand Assembly
ఉత్తరాఖండ్ రాష్ట్ర శాసనసభలో ఇవాళ యూనిఫాం (కామన్)
సివిల్ కోడ్ బిల్లును ప్రవేశపెట్టారు. రాష్ట్ర రాజధాని డెహ్రాడూన్‌లో జరుగుతున్న శాసనసభ ప్రత్యేక సమావేశాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ బిల్లును ప్రవేశపెట్టారు. ప్రతిపాదిత యూనిఫాం సివిల్ కోడ్ సమాజంలోని అన్నివర్గాలకూ
మంచి చేస్తుందని ఆయన అన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవచించిన ‘సబ్కా సాథ్ – సబ్కా వికాస్’, ‘ఏక్ భారత్ –
శ్రేష్ఠ భారత్’ను సాకారం చేసే దిశలో యూసీసీ కీలక ముందడుగు అని ధామీ
వ్యాఖ్యానించారు.
యూసీసీ ముసాయిదా కోసం ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఒక
ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి రంజనా ప్రకాష్ దేశాయ్
ఆ ప్యానెల్‌కు నేతృత్వం వహించారు. ఆ ప్యానెల్ పలు సిఫార్సులతో 749 పుటలు గల నాలుగు
భాగాల ముసాయిదాను తయారు చేసింది. ఆ ప్యానెల్ మొత్తం 2.33 లక్షల మంది అభిప్రాయాలను
ఆన్లైన్లో సేకరించారు. 70కి పైగా బహిరంగ ఫోరమ్‌లు నిర్వహించారు. వాటిద్వారా
సుమారు 60వేల మంది ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు. వాటన్నింటినీ క్రోడీకరించి ఈ
ముసాయిదాను తయారుచేసారు.
యూసీసీకి వచ్చిన ఎక్కువశాతం ప్రతిపాదనలు
బహుభార్యాత్వాన్ని, బాల్యవివాహాలనూ నిషేధించాలని కోరాయి. అన్ని మతాల్లోనూ అమ్మాయిల
వివాహ వయస్సును ప్రామాణీకరించాలని కోరాయి. విడాకులకు మతాలతో సంబంధం లేకుండా ఒకే
విధానం అమలుచేయాలని అభిప్రాయపడ్డాయి. ఆ సిఫారసులను దృష్టిలో ఉంచుకుని, స్త్రీ
పురుషులు ఇద్దరి మధ్యా లింగ సమానత్వాన్ని సాధించేలా ఈ బిల్లును ప్రత్యేక ప్యానెల్
రూపొందించింది. ఆ బిల్లును చట్టం చేయడానికి 4 రోజుల ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను
ఏర్పాటు చేసింది. సోమవారం మొదలైన ఈ సమావేశాలు గురువారం వరకూ జరుగుతాయి.
యూసీసీ బిల్లులో పౌరజీవితానికి సంబంధించిన పలు
అంశాలున్నాయి. వారసత్వ హక్కులు, తప్పనిసరి పెళ్ళిళ్ళ రిజిస్ట్రేషన్, అమ్మాయిల
వివాహ వయసు పెంపుదల వంటి అంశాలు ఈ బిల్లులో ఉన్నాయి. ఇంకా పెళ్ళికి ముందు విద్యాభ్యాసం
తప్పనిసరి చేయాలి, పెళ్ళిని రిజిస్టర్ చేసుకోనివారు ప్రభుత్వ సౌకర్యాలకు అనర్హులు..
వంటి ప్రతిపాదనలు కూడా ఉన్నాయి.
ఉత్తరాఖండ్ శాసనసభలో ఈ బిల్లు పాస్ అయితే, స్వతంత్రానంతర
భారతదేశంలో యూసీసీ అమలు చేసిన మొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్ నిలుస్తుంది. గోవాలో పోర్చుగీసుల
పరిపాలనా కాలం నుంచే యూసీసీ అమల్లో ఉంది. ఉత్తరాఖండ్‌లో ప్రతిపాదించిన యూసీసీ మతపరమైన
పరిమితులను అధిగమిస్తుంది, ముస్లిం మహిళలు సహా ప్రతీ ఒక్కరికీ దత్తత హక్కులు కల్పిస్తుంది.
హలాలా, ఇద్దత్ వంటి దురాచారాలను నిషేధిస్తుంది. లివిన్ రిలేషన్స్‌ను చట్టబద్ధంగా
ప్రకటించడాన్ని ప్రమోట్ చేస్తుంది. దత్తత విధానాలను సరళీకరిస్తుంది. ఈ ముసాయిదా
ఉత్తరాఖండ్ జనాభాలో 3శాతం ఉన్న షెడ్యూల్డు తెగలను మినహాయించి మిగతా అందరికీ
వర్తిస్తుంది.
ఇంకా ఈ యూసీసీ బిల్లులో
సంతానం అందరికీ సమాన ఆస్తిహక్కులు, చట్టబద్ధ సంతానానికీ చట్టవిరుద్ధ సంతానానికీ మధ్య
తేడాలను తొలగిస్తుంది. కన్న పిల్లలనూ, దత్తత తీసుకున్న పిల్లలనూ సమానంగా
చూస్తుంది. ఎవరైనా వ్యక్తి మరణించినప్పుడు జీవితభాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు
ఆస్తిలో సమాన వాటా దక్కేలా చేస్తుంది.