PM Modi reply to the Motion of Thanks to the President’s Address
ఇంకో వంద రోజుల్లో తాము మళ్ళీ అధికారంలోకి
వస్తామని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేసారు. మూడోసారి అధికారంలోకి
వచ్చాక మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. రాష్ట్రపతి ప్రసంగానికి
ధన్యవాదాలు తెలిపే తీర్మానం సందర్భంగా ప్రధాని మోదీ సోమవారం లోక్‌సభలో మాట్లాడుతూ
ఎన్డీయే ప్రభుత్వం 400 పైగా సీట్లతో అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ సాధిస్తుందన్నారు.
పార్లమెంట్ వేదికగా సార్వత్రిక ఎన్నికల సమరానికి
సన్నద్ధతను వ్యక్తం చేస్తూ తాము వంద రోజుల్లో మళ్లీ అధికారంలోకి వస్తామని
ధీమా వ్యక్తం చేశారు. బీజేపీకి 370కి పైగా స్ధానాలు ఖాయమని, ఎన్డీయే
400 సీట్లకు పైగా గెలుచుకుంటుందని భరోసా వ్యక్తం చేశారు. తాము తిరిగి
అధికార పగ్గాలు చేపట్టిన అనంతరం మరిన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటామని
వెల్లడించారు.
ప్రధాని మోదీ మాట్లాడుతూ గత పదేళ్లలో తమ
ప్రభుత్వం ప్రజోపయోగ పథకాలు ఎన్నో అమల్లోకి తెచ్చామని తెలిపారు. మూడోసారి
అధికారంలోకి వచ్చాక ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను
తీర్చిదిద్దుతామన్నారు. 2014లో ప్రపంచంలో 11వ
స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను ప్రస్తుతం 5వ
స్థానానికి తీసుకొచ్చామని గుర్తుచేసారు.
భారతీయుల శక్తి సామర్థ్యాలపై కాంగ్రెస్‌కు
ఎప్పుడూ నమ్మకం లేదని మోదీ ఆగ్రహించారు. దేశానికి మొదటి ప్రధానమంత్రిగా
మొదటి ప్రసంగం చేసినప్పుడే జవాహర్లాల్ నెహ్రూ విదేశీయులతో పోలిస్తూ భారతీయులకు
నైపుణ్యం లేదని చెప్పారని మోదీ గుర్తు చేసారు. నెహ్రూ తర్వాత ఇందిరాగాంధీ కూడా
అలాంటి వ్యాఖ్యలే చేసారని, భారతీయులకు ఆత్మన్యూనత ఎక్కువంటూ ఆమె చిన్నచూపు చూశారని
మండిపడ్డారు. నెహ్రూ, ఇందిర ఇద్దరికీ భారతీయుల శక్తిపై ఎప్పుడూ నమ్మకం లేదని తప్పు
పట్టారు.
దేశంలో అవినీతిపరులపై దర్యాప్తులు సంస్థలు దాడులు
చేస్తుంటే విపక్ష నేతలు వారికి మద్దతు పలుకుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని
ప్రధాని మండిపడ్డారు. గతంలో పార్లమెంటులో అవినీతిపరులపై చర్యలకు డిమాండ్ చేసేవారు,
ఇప్పుడు అవినీతిపరులపై దాడులు జరుగుతుంటే వారికి మద్దతుగా ఆందోళనలు చేస్తున్నారంటూ
ప్రతిపక్షాలకు చురకలంటించారు.
కాంగ్రెస్ ఓబీసీలను ఎప్పుడూ అవమానిస్తూనే ఉందని
మోదీ వ్యాఖ్యానించారు. బిహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్‌కు తాము భారతరత్న అవార్డు
ఇచ్చి సత్కరించామని, కాంగ్రెస్ మాత్రంఆయన
సీఎంగా ఉన్నపుడు కుట్రలు చేసి గద్దె దించారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్ 370 ని
రద్దు చేశామని, మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేశామని
తెలిపారు. వలసవాదుల కాలం నాటి చట్టాలను తొలగించి వాటి స్థానంలో భారతీయ
న్యాయ సంహితను తీసుకువచ్చినట్లు ప్రధాని మోదీ వివరించారు. రాముడు తన సొంత ఇంటికి
తిరిగి చేరుకోవడం దేశానికి సరికొత్త శక్తినిచ్చిందని మోదీ వ్యాఖ్యానించారు.
గడిచిన పదేళ్లలో బలమైన
ప్రతిపక్షంగా ఎదిగేందుకు కాంగ్రెస్‌కు అవకాశం వచ్చినా వారు అందిపుచ్చుకోలేదన్నారు.
మిగతా ప్రతిపక్షాలను కూడా ఎదగనీయలేదన్నారు. కాంగ్రెస్ దుకాణానికి త్వరలోనే తాళాలు
వేస్తామన్నారు. ఇండీ కూటమిలో ఒక పార్టీపై మరొక పార్టీకి విశ్వాసం లేదని, ఆ కూటమిని ప్రజలు ఎలా నమ్ముతారని ప్రశ్నించారు.