బడ్జెట్
సమావేశాల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ శాసనసభా కార్యాలయ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం చోటు
చేసుకుంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ సర్పంచులు, అసెంబ్లీ ముట్టడికి దిగడంతో పోలీసులు
వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా పోలీసులు, సర్పంచుల మధ్య తోపులాట జరిగింది.
పంచాయతీరాజ్
ఛాంబర్ ఆధ్వర్యంలో సర్పంచ్ల సంఘం ‘చలో
అసెంబ్లీ’కి పిలుపునిచ్చింది. న్యాయబద్ధమైన తమ 16 డిమాండ్లు పరిష్కరించాలని
ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పోలీసుల
బందోబస్తును దాటుకుని అసెంబ్లీకి వద్దకు చేరుకున్న సర్పంచులు ప్రభుత్వానికి వ్యతరేకంగా
నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు
తరలించారు.
పంచాయతీల
అభివృద్ధికి ఆర్థిక సంఘం కేటాయించిన నిధులను ప్రభుత్వం దారి మళ్ళించిందని
ఆరోపించిన సర్పంచుల సంఘం నేతలు, ఉపాధి హామీ నిధులను చట్టప్రకారం పంచాయతీలకు
కేటాయించాలన్నారు.
సర్పంచుల
సంఘం ఆందోళనపై ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ ఛాంబర్ అధ్యక్షుడు వై.వి.బి
రాజేంద్రప్రసాద్ స్పందించారు.
ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన
సర్పుంచులను పోలీసులు రెండు రోజుల ముందే అరెస్టు చేయడం దారుణమన్నారు. గ్రామాల అభివృద్ధి
కోసం సర్పంచ్ల న్యాయబద్ధమైన 16 సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.
సర్పంచుల సంఘం నిరసనకు ఎలాంటి అనుమతి లేదని గుంటూరు
జిల్లా ఎస్పీ తుషార్ డూడి తెలిపారు. అసెంబ్లీ పరిసరాల్లో పోలీసు చట్టం 30 అమలులో
ఉందన్నారు. శాంతిభద్రతల సమస్యకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని
హెచ్చిరించారు.