ఎర్రచందనం స్మగ్లర్లు బరితెగించారు. అన్నమయ్య జిల్లాలో వాహనంతో ఢీకొట్టి ఓ కానిస్టేబుల్ను చంపేశారు. సోమవారం రాత్రి ఈ దారుణం జరిగింది. తనిఖీలు చేస్తున్న సమయంలో అడ్డుపడ్డ కానిస్టేబుల్ను వాహనంతో ఢీకొట్టి స్మగ్లర్లు పారిపోయినట్లు అధికారులు తెలిపారు. కేవీపల్లి మండలం చీనెపల్లె వద్ద ఎర్రచందనం అక్రమ రవాణా అవుతోన్నట్లు వచ్చిన సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. సుండుపల్లి సరిహద్దు గొల్లపల్లి చెరువు వద్ద వాహనాలను ఆపి తనిఖీలు చేశారు.
స్మగ్లర్ల వాహనాన్ని కానిస్టేబుల్ గణేశ్ ఆపే ప్రయత్నం చేశారు. తప్పించుకునే క్రమంలో ఎర్రచందనం స్మగ్లర్లు వారి వాహనంతో కానిస్టేబుల్ను బలంగా ఢీ కొట్టి (andhra today crime news) పరారయ్యారు. ఈ దాడిలో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేయగా దారిలోనే ప్రాణాలు కోల్పోయాడని పోలీసులు తెలిపారు. స్మగ్లర్ల కోసం గాలింపు చేపట్టి, ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు.