ఝార్ఖండ్ సీఎం చంపయీ సోరెన్ శాసనసభలో ఇవాళ బలం నిరూపించుకున్నారు. విశ్వాసతీర్మానంపై జరిగిన ఓటింగ్‌లో 47 ఓట్లు సాధించారు. వ్యతిరేకంగా 29 ఓట్లు పోలయ్యాయి. అసెంబ్లీ స్మీకర్ రవీంద్రనాథ్ మహతో ఆదేశాల మేరకు చేతులెత్తే విధానం ద్వారా ఒక్కొక్కరి వద్దకు వెళ్లి అధికారులు లెక్కించారు. విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 47 మంది మద్దతు పలికారు. విశ్వాస పరీక్షకు వ్యతిరేకంగా 29 మంది చేతులెత్తారు. దీంతో సీఎం చంపయీ సోరెన్ విశ్వాస పరీక్ష నెగ్గినట్లు స్పీకర్ ప్రకటించారు.
ఝార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 మంది సభ్యులున్నారు. మెజారిటీ పొందాలంటే 41 మంది మద్దతు సాధించాల్సి ఉంటుంది. సభలో జేఎంఎంకు 29 మంది, కాంగ్రెస్‌కు 17 మంది సభ్యుల బలం ఉంది. దీంతో తేలిగ్గా విశ్వాసం నెగ్గగలిగారు.
మాజీ సీఎం, జేఎంఎం నేత హేమంత్ సోరెన్‌ను మనీలాండరింగ్ కేసులో ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంతో ఆయన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాంచీ జైలులో ఉన్న హేమంత్ సోరెన్ తన ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోర్టు అనుమతించింది. ఇవాళ జరిగిన బల పరీక్షలో హేమంత్ సోరెన్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.