చిలీ దేశంలో ఘోరం చోటు చేసుకుంది. మూడు రోజుల కిందట చెలరేగిన కార్చిచ్చు నేటికీ అదుపులోకి రాలేదు. ఇప్పటికే 112 మంది చనిపోయారని చిలీ ప్రకటించింది. వేలాది మంది గాయపడ్డారు. దాదాపు 200 మంది కనిపించకుండాపోయారని అధికారులు చెబుతున్నారు. 93 సంవత్సరాల కిందట ఏర్పాటు చేసి ప్రఖ్యాత బొటానికల్ గార్డెన్ కాలిబూడిదైంది. కార్చిచ్చు (chile wildfire) ప్రభావం అధికంగా ఉన్న డెల్ మార్ పట్టణంలో పరిస్థితులు అత్యంత దయనీయంగా తయారయ్యాయి. రెండు రోజులు జాతీయ సంతాప దినాలుగా ప్రకటించారు.
పెద్ద ఎత్తున మంటలు, పొగ వల్ల ప్రజలు ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. కార్చిచ్చు మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తోందని చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్ బోరిక్ వెల్లడించారు. కాలిపోయిన ఇళ్లలో మృతదేహాల కోసం గాలింపు కొనసాగుతోంది. గాయపడిన వారిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉందని చిలీ ప్రభుత్వం ప్రకటించింది.
ఈ కార్చిచ్చుపై అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొందరు కావాలని చేసిన పనిగా అనుమానిస్తున్నారు. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో మంటలు చెలరేగడం అనుమానాలకు బలం చేకూరుస్తోంది. కార్చిచ్చుపై పూర్తిస్థాయి దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది.