నకిలీలు తయారుచేయడానికి కాదేదీ అనర్హం అన్నట్లు తయారైంది పరిస్థితి. చివరకు ఆర్మీ దుస్తులు కూడా నకిలీవి తయారు చేస్తున్నారు. డిజిటల్ టెక్నాలజీ సాయంతో గత ఏడాది భారత ఆర్మీకి నూతన దుస్తులను డిజైన్ చేశారు. వాటికి మేథోహక్కులు ఉన్నాయి. మరెవరూ రూపొందించడానికి అనుమతి లేదు.
తాజాగా పుణె, అహ్మద్‌నగర్‌లో భింగర్ క్యాంప్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొందరు నకిలీ యూనిఫామ్‌లు తయారు చేస్తున్నారనే సమాచారంతో ఆర్మీ ఇంటెలిజెన్స్ దాడులు నిర్వహించింది. 40 నకిలీ యూనిఫామ్‌లను స్వాధీనం (crime news) చేసుకుని, ఒకరిని అదుపులోకి తీసుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా యూనిఫామ్ తయారు చేస్తున్నట్లు గుర్తించారు. నిందితుడు నాసిక్ వాసిగా తేలింది.
2023లో సైన్యం ఉపయోగించే దుస్తులకు కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేయించింది. తేలిగ్గా ఉండేలా, బలంగా ఉండటంతోపాటు, బాగా గాలి ఆడేలా రూపొందించారు. త్వరగా ఆరిపోవడంతోపాటు, నిర్వహణ కూడా తెలిగ్గా ఉండేలా డిజిటల్ టెక్నాలజీతో తయారు చేశారు. పదేళ్లపాటు సైన్యానికి మేథోహక్కులున్నాయి. ఇప్పటికే 50వేల జతలను సైన్యం కొనుగోలు చేసింది. బహిరంగ మార్కెట్లో సైనిక దుస్తులు తయారుచేయడం, విక్రయించడం, ఉపయోగించడం నిషేధం. అక్రమంగా తయారుచేసే వారిపై క్రిమినల్ కేసులుంటాయని సైన్యానికి చెందిన ఓ అధికారి హెచ్చరించారు.