అధిక
ఉష్ణోగ్రతల కారణంగా చిలీలో కార్చిచ్చు రేగింది. మంటల ధాటికి ఇప్పటివరకు 46 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని చిలీ అధ్యక్షుడు బోరిక్
గాబ్రియెల్ తెలిపారు. వేలాది మంది గాయపడగా పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు
పేర్కొన్నారు. 1,100 ఇళ్లు
అగ్నికి ఆహుతి అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.
వాల్పరైజో
ప్రాంతంలో మంటలు ఇంకా వ్యాపిస్తుండటంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మంటలు
అదుపులోకి రాకపోవడంతో ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు
వెళ్ళాలని చెబుతున్నారు. సహాయక చర్యలు చేపట్టిన వారికి సహకరించాలని బోరిక్
కోరారు.
మంటలు
చాలా వేగంగా వ్యాపిస్తుండటంతో వాటిని అదుపు చేసేందుకు వాతావరణ పరిస్థితులు
అనుకూలించడం లేదు.
అధిక ఉష్ణోగ్రతలు, బలమైన గాలులు, స్వల్ప తేమ కారణంగా సహాయ చర్యలకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి.
దేశ మధ్య, దక్షిణ
ప్రాంతాల్లో దాదాపు 92
కార్చిచ్చులు రేగాయి. వేలాదిమందిని పునరావాస ప్రాంతాలకు తరలించారు.