ఎర్రసముద్రంలో రవాణా నౌకలే లక్ష్యంగా రెచ్చిపోతోన్న హౌతీ తిరుగుబాటుదారులపై (houti rebels) అమెరికా సైన్యం భీకరదాడులకు దిగింది. శుక్రవారంనాడు 56 హౌతీ స్థావరాలను ధ్వంసం చేయగా, శనివారం మరో 36 స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసింది. ఈ దాడుల్లో ఆస్ట్రేలియా, కెనడా, బహ్రెయిన్, డెన్మార్క్, నెదర్లాండ్స్, న్యూజిలాండ్ దేశాల సైన్యం కూడా పొల్గొందని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్ ఆస్టిన్ వెల్లడించారు. వాణిజ్య నౌకలపై దాడులు ఆపకపోతే హౌతీలపై ప్రతిదాడులు తప్పవని అమెరికా తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది.
హౌతీ స్థావరాలు, ఆయుధ నిల్వలే లక్ష్యంగా అమెరికా సైన్యం వైమానిక దాడులు చేసింది. హౌతీల రాడార్ వ్యవస్థలను ధ్వంసం చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి ప్రకటించారు. హౌతీలు దాడులు ఆపేవరకు ప్రతిదాడులు కొనసాగుతూనే ఉంటాయని ఆస్టిన్ హెచ్చరించారు.నవంబర్ నుంచి ఇప్పటి వరకు 30కుపైగా నౌకలపై హౌతీలు దాడులకు తెగబడ్డారు. హౌతీల దాడులతో అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లే ప్రమాదం ఉండటంతో అమెరికా కఠిన చర్యలకు ఉపక్రమించింది.