Muslim girl on hunger strike demanding ban on Hijab
కర్ణాటక తర్వాత ఇప్పుడు రాజస్థాన్‌లో హిజాబ్ గురించి
గొడవ జరుగుతోంది. హిజాబ్ మీద నిషేధం విధించాలనే డిమాండ్లు పెరుగుతున్నాయి. తాజాగా హిజాబ్‌ను
నిషేధించాలని కోరుతూ ఓ ముస్లిం యువతి తన తండ్రితో కలిసి జైపూర్‌లో నిరాహారదీక్ష
మొదలుపెట్టింది.
తంజిమ్ మేరానీ గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన
యువతి. 2017 ఆగస్టులో శ్రీనగర్‌లోని లాల్‌చౌక్‌లో ధైర్యంగా త్రివర్ణ పతాకం
ఎగురవేసి సంచలనం సృష్టించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 14 సంవత్సరాలే. ఆరేళ్ళ
తర్వాత ఇప్పుడు రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో హిజాబ్‌కు వ్యతిరేకంగా నిరాహార దీక్ష
చేపట్టింది.
తంజిమ్ మేరానీ ఉద్దేశం ప్రకారం విద్యాసంస్థలకు
విద్య కోసమే వెళ్ళాలి తప్ప మత ప్రచారం కోసం కాదు. అందువల్ల బడులు, కళాశాలల్లో
హిజాబ్ మీద నిషేధం విధించి తీరాలి. ఆ డిమాండ్‌తో తంజిమ్ గత మూడు రోజులుగా రాష్ట్ర
ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మ నియోజకవర్గంలో నిరాహారదీక్ష చేస్తోంది.
హిజాబ్ నిషేధం కోరుతున్న తంజిమ్‌కు బెదిరింపులు
వస్తున్నాయి. అయితే అలాంటి బెదిరింపులకు తాను భయపడబోనని ఆమె చెబుతోంది. గతంలో కూడా
ఎన్నో ఫత్వాలు జారీ అయ్యాయి కానీ అలాంటివాటికి లొంగిపోను అంటోంది తంజిమ్. హిజాబ్
అంశం ఒక్కటే కాదు, పౌరసత్వ సవరణ చట్టం, యూనిఫాం సివిల్ కోడ్లను కూడా వెంటనే అమల్లోకి
తీసుకురావాలని ఆమె డిమాండ్ చేస్తోంది. అంతవరకూ తన ఆందోళన కొనసాగుతుందని చెబుతోంది.
‘‘నేను ముస్లిం మతానికి చెందిన అమ్మాయినే. కానీ
దానర్ధం నేను బడిలోనో, కాలేజీలోనో లేక ప్రభుత్వ కార్యాలయంలోనో హిజాబ్ ధరించాలని
అర్ధం కాదు. అందుకే హిజాబ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్నాను. రాజస్థాన్‌లో మొదలైన
ఈ ఆందోళన దేశమంతా వ్యాపిస్తుంది’’ అని తంజిమ్ ధీమా వ్యక్తం చేస్తోంది.
తంజిమ్‌తో పాటు ఆమె తండ్రి అమీర్ మేరానీ కూడా
నిరాహార దీక్ష చేస్తున్నారు. ‘తప్పు అనేది ఎప్పుడైనా ఎక్కడైనా తప్పే, దాన్ని
ఎక్కడైనా ఖండించాల్సిందే’ అని ఆయన వాదన. ‘తంజిమ్ మీద ఎన్నో ఫత్వాలు జారీ అయ్యాయి
కానీ భయపడితే ఏ మార్పూ రాదు. అందుకే నా కూతురికి అండగా నిలబడ్డాను’ అంటున్నారాయన.
ఒకవేళ ఎవరైనా ముస్లిం అమ్మాయి కలెక్టర్ అయితే హిజాబ్ ధరించి కుర్చీలో
కూర్చుంటుందా? అని ప్రశ్నించారాయన.