బీజేపీ
కురువృద్ధుడు, మాజీ ఉపప్రధాని లాల్ కృష్ణ అద్వానీని భారతరత్న పురస్కారంతో
గౌరవించనున్నట్లు ప్రధాని మోదీ ప్రకటించడంపై అద్వానీ కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం
చేశారు. ప్రధాని ప్రకటనతో భావోద్వేగం చెందామన్నారు. దేశ అత్యున్నత పౌర పురస్కారం అద్వానీని
గౌరవించినందుకు గాను ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ప్రధాని మోదీ ప్రకటన అనంతరం అద్వానీకి ఆయన కుమార్తె స్వీటు తినిపించి అభినందించారు. ఇద్దరు
కలిసి చేతులో జోడించి ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు.
‘‘భారత
దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న, దాదా(ఎల్కే
అద్వానీ)కు లభించడంపై కుటుంబమంతా సంతోషంగా ఉంది. ఈ ఆనంద క్షణాల్లో నా తల్లి
ఉండాల్సింది. నా తండ్రి రాజకీయ, వ్యక్తిగత జీవితంలో ఆమె పాత్ర అపారం. పురస్కారం
గురించిన విషయాన్ని చెప్పినప్పుడు దాదా సంతోషించారు. తన జీవితం మొత్తం ప్రజాసేవకే అంకితం
చేశానని బదులిచ్చారు. ప్రధాని మోదీకి ఈ సందర్భంగా ధన్యవాదాలు
తెలిపారు.’’ అని అద్వాని కుమార్తె ప్రతిభా అద్వానీ వివరించారు.
ఆనందంతో
పొంగిపోవడంతో ఆనంద భాష్పాలు రాలాయన్నారు. ఎవరైనా ఆయనను పొగిడితే వెంటనే కళ్ళు
చెమురుస్తాయన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణం ఆయన స్వప్నమన్నారు.
దేశం
కోసం జీవితమంతా శ్రమించిన అద్వానీని ఈ దశలో అత్యున్నత పురస్కారంతో గౌరవించడం
అద్భుతమని అద్వానీ కుమారుడు జయంత్ అద్వానీ అన్నారు. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
బీజేపీ అగ్రనేత అద్వానీని భారత
ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్నకు ఎంపిక చేసినట్లు ప్రధాని
నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ప్రకటించారు. ” భారత రత్న పురస్కారానికి ఎంపికైన
అద్వానీజీకి అభినందనలు తెలిపానని, దేశాభివృద్ధికి ఆయన అందించిన సేవలు మరువలేము.’’ అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.