బీజేపీ సీనియర్ నేత ఎల్.కె.అడ్వాణీకి దేశ అత్యున్నత పురస్కారం భారతరత్న ప్రకటించడంతో ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు.సోషల్ మీడియా వేదికగా పలువురు పోస్టులు పెట్టారు. భారత అభివృద్ధి స్వాప్నికుడు, నవభారత నిర్మాణ మార్గదర్శకుడు, జీవితం మొత్తాన్ని ప్రజాసేవకే అంకితం చేసిన దేశభక్తుడు లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ప్రకటించడం ఆనందంగా ఉందని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు శుభాకాంక్షలు తెలిపారు.
బీజేపీ వ్యవస్థాపక సభ్యుడు. కోట్లాదిమందికి స్ఫూర్తిదాయకమైన మహానేత, మాజీ ఉప ప్రధాని లాల్ కృష్ణ అడ్వాణీకి భారతరత్న ఇవ్వడం ఆనందంగా ఉందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దాస్ పేర్కొన్నారు. అడ్వాణీ అవిశ్రాంత పోరాటం అందరిలో ప్రేరణ నింపిందని యోగి శుభాకాంక్షలు తెలిపారు.
ఎల్.కె.అడ్వాణీకి భారతరత్న ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ట్వీట్ చేశారు. ఎన్డీయేలో భాగంగా అడ్వాణీతో కలసి పనిచేయడం ఆనందాన్ని ఇచ్చిందని చంద్రబాబు తెలిపారు.
దేశంలోనే అత్యంత సీనియన్ రాజకీయవేత్త, మార్గనిర్ధేశకుడు ఎల్.కె.అడ్వాణీకి భారతరత్న ఇవ్వడం సంతోషకరమైన విషయమని కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కరీ కొనియాడారు. అడ్వాణీ ఆయురారోగ్యాలతో జీవించాలని ప్రార్థిస్తున్నానంటూ గడ్కరీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.