Will Indian troops withdraw from Maldives?
ఇటీవల మాల్దీవులకు చెందిన కొందరు రాజకీయ నాయకుల
విపరీత వ్యాఖ్యలతో భారత్-మాల్దీవ్స్ సంబంధాలు దెబ్బతిన్నాయి. అక్కడ ఇటీవల
అధికారంలోకి వచ్చిన చైనా అనుకూల ప్రభుత్వం, తమ దేశంలోని భారత బలగాలను వెనక్కు
పంపాలని భావిస్తోంది. అది ఆచరణరూపం దాలుస్తుందా?
ఇరు దేశాల ప్రతినిధులూ ఇదే విషయమై ఢిల్లీలో
సమావేశమయ్యారు. పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాల విషయంలో ఒక అంగీకారానికి
వచ్చినట్లు భారతదేశం ప్రకటించింది. అయితే భారత బలగాల ఉపసంహరణ గురించి మాత్రం ఏమీ
చెప్పలేదు. మాల్దీవులు మాత్రం, భారత బలగాలు మే నెలలోగారీప్లేస్
చేస్తారని ప్రకటించింది.
భారత విదేశాంగ శాఖ తమ ప్రకటనలో ‘‘సమావేశంలో
భాగంగా ఇరుపక్షాలూ భాగస్వామ్యాన్ని పెంపొందించుకునే దిశగా ద్వైపాక్షిక సహకారానికి
సంబంధించిన వివిధ అంశాలపై చర్చలు కొనసాగించాయి. ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి
సహకార ప్రాజెక్టుల అమలును వేగవంతం చేయడం గురించి కూడా చర్చలు జరిగాయి. మాల్దీవుల
ప్రజలకు మానవతా సహాయం, వైద్య సహాయం అందించే వైమానిక దళాల ఆపరేషన్లను కొనసాగించడం
వంటి విషయాల్లో పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాల విషయంలో ఇరుపక్షాలూ ఒక
అంగీకారానికి వచ్చాయి’’ అని వెల్లడించింది.
మాల్దీవులలోని భారత బలగాల్లో భాగంగా 80మంది సేవలు
అందిస్తున్నారు. వారిలో వైద్య సిబ్బంది కూడా ఉన్నారు. మాల్దీవుల సముద్రప్రాంతాల్లో
పెట్రోలింగ్ చేయడానికి 3 విమానాలు కూడా వారివద్ద ఉన్నాయి.
మాల్దీవుల విదేశాంగ శాఖ ‘‘ఒక ఏవియేషన్ ప్లాట్‌ఫాంలోని
సైనిక సిబ్బందిని మార్చి 10లోగా, మిగతా రెండు ఏవియేషన్ ప్లాట్‌ఫాంల సైనిక
సిబ్బందిని మే 10లోగా భారత ప్రభుత్వం రీప్లేస్ చేయడానికి ఇరు పక్షాలూ
అంగీకరించాయి’’ అంటూ ప్రకటన విడుదల చేసింది.
గత డిసెంబర్లో దుబాయ్‌లో జరిగిన కాప్ 28
సదస్సులో కలుసుకున్నప్పుడు, భారతప్రధాని నరేంద్ర మోదీ, మాల్దీవుల అధ్యక్షుడు మహమ్మద్
ముయిజ్జు చర్చలు జరిపారు. ఒక కోర్ గ్రూప్ ఏర్పాటు చేసుకోవాలని ఇరు పక్షాలూ నిర్ణయానికి
వచ్చాయి.
చైనా అనుకూలుడైన మహమ్మద్ మయిజ్జు గత నవంబర్‌లో
అధికారంలోకి వచ్చారు. ఆ ఎన్నికల సమయంలో భారత బలగాలను మాల్దీవుల నుంచి తొలగిస్తానని
ఆయన వాగ్దానం చేసారు. అధ్యక్ష పదవి చేపట్టిన వెంటనే మయిజ్జు ఈ యేడాది జనవరిలో చైనాలో
అధికారికంగా పర్యటించారు. ఆ తర్వాత భారత్‌ను తమ బలగాలను మార్చి 15లోగా ఉపసంహరించుకోమని
మయిజ్జు చెప్పారు.