Ruckus in parliament on Congress MP’s controversial remarks
బడ్జెట్ కేటాయింపుల్లో దక్షిణాది రాష్ట్రాలకు
అన్యాయం జరుగుతోందని ఆరోపిస్తూ, అవే పరిస్థితులు కొనసాగితే ప్రత్యేక దేశం ఏర్పాటుకు
డిమాండ్లు పెరుగుతాయని కర్ణాటకకు చెందిన కాంగ్రెస్ ఎంపీ డికె సురేష్ గురువారం చేసిన
వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. పార్లమెంటు ఉభయ సభల్లోనూ సురేష్ వ్యాఖ్యలపై తీవ్ర దుమారం చెలరేగింది. ఆ
వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ క్షమాపణ చెప్పాలని కేంద్రమంత్రి పీయూష్ గోయల్
రాజ్యసభలో డిమాండ్ చేసారు. రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే
తమ పార్టీ ఎంపీ వ్యాఖ్యలపై స్పందించారు. దేశాన్ని విభజించడం గురించి ఎవరు
మాట్లాడినా తమ పార్టీ సహించదన్నారు. దేశ విభజన గురించి ఏ పార్టీవారు మాట్లాడినా
అది తప్పేనన్నారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ ఈ దేశం, ఈ దేశ ప్రజలు
ఒక్కటిగానే ఉన్నారు, అలాగే ఉంటారు అని వ్యాఖ్యానించారు. డికె సురేష్ వ్యాఖ్యలపై
సోనియాగాంధీ క్షమాపణలు చెప్పాలని, ఆయనపై కాంగ్రెస్ పార్టీ తక్షణం చర్యలు తీసుకోవాలనీ
లోక్‌సభలో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషీ డిమాండ్ చేసారు.
మరోవైపు… ప్రతిపక్ష కూటమి పార్టీలు హేమంత్
సోరెన్ అరెస్ట్ అంశాన్ని లేవనెత్తారు. కేంద్రప్రభుత్వం ప్రోద్బలంతోనే హేమంత్
సోరెన్‌ను అరెస్ట్ చేసారు. చంపయీ సోరెన్ ప్రమాణస్వీకారాన్ని ఉద్దేశపూర్వకంగానే
జాప్యం చేసారు. బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ధ్వంసం చేస్తోంది అని రాజ్యసభలో కాంగ్రెస్
పక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ఆ వ్యాఖ్యలను మంత్రి పీయూష్ గోయల్
ఖండించారు. భూకుంభకోణం కారణంగానే హేమంత్ సోరెన్ రాజీనామా చేయాల్సి వచ్చింది.
అలాంటి అవినీతిపరుడికి కాంగ్రెస్ మద్దతు పలుకుతుండడం ఆ పార్టీ వైఖరికి నిదర్శనం
అని పీయూష్ గోయల్ మండిపడ్డారు. లోక్‌సభలో కూడా ఇరుపక్షాల మధ్యా ఈ అంశంపై చర్చ
తీవ్రంగా జరిగింది. అధికార పక్షం వైఖరిని తప్పుపడుతూ ప్రతిపక్షాలు ఉభయ సభల నుంచీ
వాకౌట్ చేసాయి.
అనంతరం, ఈ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో
రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే చర్చ మొదలైంది.