Allahabad HC declines stay on Hindu prayers in the cellar
of Gyanvapi
జ్ఞానవాపి ఆలయాన్ని కూలగొట్టి నిర్మించిన మసీదు నేలమాళిగలో
హిందువుల పూజలకు అనుమతిస్తూ వారణాసి జిల్లాకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే
విధించడానికి అలహాబాద్ హైకోర్ట్ నిరాకరించింది.
వారణాసి కోర్టు ఇచ్చిన జనవరి 31న ఇచ్చిన ఆ ఉత్తర్వులకు
కారణమైన జనవరి 17నాటి ఆదేశాలను సవాల్ చేసేందుకు వీలుగా మసీద్ ఇంతెజామియా కమిటీకి
హైకోర్టు ఫిబ్రవరి 6 వరకూ సమయం ఇచ్చింది. ఆ రోజు వరకూ కేసు విచారణ వాయిదా వేసింది.
జనవరి 17న వారణాసి కోర్టు ఇచ్చిన ఆదేశాల్లో
వారణాసి జిల్లా కలెక్టర్‌ను రిసీవర్‌గా నియమించింది. దాంతో జనవరి 23 నుంచి
జ్ఞానవాపి ఆవరణ కలెక్టర్ హస్తగతమైంది. ఆ తర్వాత వారణాసి జిల్లాకోర్టు జనవరి 31న ఇచ్చిన
మరో మధ్యంతర ఉత్తర్వులో, ఆవరణలోని మాళిగలో ఉన్న హిందూదేవతామూర్తులకు పూజలు
చేసుకోవచ్చునని వెల్లడించింది. అందువల్ల ముస్లిం పక్షం మొదటగా జనవరి 17నాటి బేసిక్
ఆర్డర్‌ను సవాల్ చేయాల్సి ఉండగా ఎందుకు చేయలేదని హైకోర్ట్ బెంచ్ మసీదు కమిటీ తరఫు
న్యాయవాది ఎస్ఎఫ్ఎ నక్వీని ప్రశ్నించింది.
‘‘జనవరి 31న పూజలు జరుపుకోవచ్చంటూ కోర్టు
ఉత్తర్వులు ఇవ్వడంతో కలెక్టర్ వెంటనే ఏర్పాట్లు చేసారు, దాంతో ఆ రాత్రి నుంచే
పూజలు మొదలైపోయాయి. అందువల్ల దాన్ని నిలువరించాలంటూ ముందు స్టే కోరాము. బేసిక్
ఆర్డర్‌ని కూడా సవాల్ చేస్తాము’’ అని ముస్లిం పక్షపు న్యాయవాది నక్వీ
న్యాయస్థానానికి చెప్పుకొచ్చారు.
హిందువుల పక్షపు న్యాయవాది విష్ణుశంకర్ జైన్, అసలైన
బేసిక్ ఆర్డర్‌ను సవాల్ చేయలేదు కాబట్టి స్టే అప్పీలు నిలబడదంటూ అభ్యంతరపెట్టారు. జిల్లాకోర్టు
ఫిర్యాదికి ఉపశమనం ఇవ్వలేదనీ, ఆలయ ట్రస్టుకు అధికారం ఇచ్చిందనీ వాదించారు.
నేలమాళిగలో పూజలను నిలిపివేయాలంటూ మసీద్
ఇంతెజామియా కమిటీ గురువారం వేకువజామునే సుప్రీంకోర్టును సైతం ఆశ్రయించింది. కానీ
సుప్రీంకోర్టు వారికి హైకోర్టుకు వెళ్ళవలసిందిగా సూచించింది.
జిల్లాకోర్టు ఇచ్చిన
ఉత్తర్వులతో హిందువుల పక్షానికి ప్రాథమికంగానే అయినా విజయం లభించినట్లయింది. అక్కడ
వంశపారంపర్యంగా పూజలు చేస్తూన్న అర్చకుల వంశం, ఆ ఉత్తర్వులు వచ్చిన వెంటనే పూజలు
ప్రారంభించింది. మసీదు కింద నేలమాళిగలో ఉన్న శృంగారగౌరి, తదితర హిందూదేవతా
మూర్తులకు 1993 వరకూ నిత్యపూజలు జరుగుతుండేవి. అయోధ్యలో వివాదాస్పద కట్టడం
కూల్చివేత ఘటనను అడ్డుపెట్టుకుని ములాయంసింగ్ యాదవ్ ప్రభుత్వం 1993 నుంచీ ఆ పూజలు బలవంతంగా
ఆపించివేసింది.